– పంటలకు చట్టబద్ధత కల్పించాలి
– ప్రభుత్వ రంగ సంస్థలు వ్యాపారం చేయవు!
– రైతులు రాజకీయాలకు అతీతంగా సంఘటితంగా హక్కుల కోసం ఉద్యమించాలి
– మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
– రైతు సంఘం రాష్ట్ర నేత నల్లమల వెంకటేశ్వరరావు
నవతెలంగాణ – బోనకల్లు : కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్దతు ధర ప్రకటించడం కాదని వాటికి చట్టబద్ధత కల్పించినప్పుడే రైతులకు నిజంగా న్యాయం జరుగుతుందని, రైతులు రాజకీయాలకు అతీతంగా తమ సమస్యల, హక్కుల సాధన కోసం సంఘటితంగా ఉద్యమించాలని కాంగ్రెస్ రాష్ట్ర రైతు సంఘం నేత నల్లమల వెంకటేశ్వరరావు అన్నారు. మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని బోనకల్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ నందు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బోనకల్ సర్పంచ్ బానోతు జ్యోతితో కలిసి నల్లమల వెంకటేశ్వరరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బోనకల్ సొసైటీ మాజీ అధ్యక్షుడు చావా వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో నల్లమల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం మద్దతు ధర రూ. 2400 రూపాయల ప్రకటించింది అన్నారు.
కానీ ప్రభుత్వం వైపు నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు క్వింటా రూ. 1600 నుంచి రూ. 1800 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, దీనివలన రైతులకు రూ. 600 నుంచి రూ. 800 వరకు నష్టపోతున్నారన్నారు. జిల్లావ్యాప్తంగా 1.85 లక్షల లో మొక్కజొన్న పంట సాగు చేశారన్నారు. ప్రభుత్వాలు వ్యాపారం చేయవన్నారు. మార్కెట్ లో పోటీ తత్వాన్ని పెంచడానికే ప్రభుత్వాలు పంటలను కొనుగోలు చేస్తున్నాయన్నారు. మార్క్ ఫెడ్ ఎండి తో తాను మాట్లాడి బోనకల్ మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. రైతులు హక్కులు, సమస్యల పరిష్కారం కోసం పోరాటాలలోకి రావటం లేదన్నారు. దీనివలన రైతులకే నష్టం జరుగుతుందని, కానీ రైతులు ఆలోచించటం లేదన్నారు. పంటలకు ధర నిర్ణయించే హక్కు రైతులు లేకుండా పోయిందని, ధర నిర్ణయించే హక్కు ప్రభుత్వాలకు, ప్రైవేటు వ్యాపారులకు పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
రైతుల నుంచి ప్రభుత్వం మొక్కజొన్నను కొనుగోలు చేసిన తర్వాత దానిని మరల అమ్మటానికి క్వింటాకు సుమారు రూ. 1000 రూపాయలు నష్టపోతుందన్నారు. బోనకల్ మండలంలో అత్యధికంగా 20,566 ఎకరాలలో మొక్కజొన్న పంట సాగు చేశారని, కానీ బోనకల్ కొనుగోలు కేంద్రం కాకుండా ముష్టికుంట్ల, గోవిందపురం ఎల్, మోటమర్రి గ్రామాలలో కూడా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఆ దిశగా తమ ప్రయత్నం చేస్తామని తెలిపారు. సిపిఎం మండల కార్యదర్శి కిలారు సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎకరానికి 26 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని పరిమితి విధించడం సరైనది కాదని, ఎకరానికి 40 క్వింటాలు దిగుబడి వస్తుందని, మిగిలిన పంటను రైతులు ఎవరికి అమ్ముకోవాలని, ప్రభుత్వమే పంట మాత్రం కొనుగోలు చేయాలని కోరారు. అదేవిధంగా మండల పరిధిలోని అన్ని సహకార సంఘాల ద్వారా మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని ఆయన కోరారు. 22 గ్రామాలకు కలిపి ఒకే ఒక్క మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయటం వలన రైతులు తమ గ్రామాల నుంచి పంటను బోనకల్ తీసుకురావడానికి రవాణా, ఇతరపరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
ఆత్మ కమిటీ మధిర చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరరావు బోనకల్ మాజీ సొసైటీ అధ్యక్షులు చావా వెంకటేశ్వరరావు, గుండపనేని సుధాకర్ రావు, బోనకల్ ఉపసర్పంచ్ బానోతు కొండ, మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనుమోలు వెంకటేష్, ముష్టికుంట్ల సర్పంచ్ పిల్లలమర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ బోనకల్ మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోనకల్ సహకార సంఘ ఇన్చార్జి కట్టా కిషోర్, చిరునోముల, బోనకల్ ఏ ఈ ఓ లు మరీదు త్రివేణి, బంధం రజిత, బోనకల్ సొసైటీ సీఈవో అంబటి సంపత్ కుమార్, రావినూతల సీఈవో బోయినపల్లి ఉమామహేశ్వరరావు, బోనకల్ సొసైటీ మాజీ సీఈవో మండేపూడి వెంకటేశ్వరరావు, సిబ్బంది చక్కిలాల నాగేశ్వరరావు, చిరునోముల ఉపసర్పంచ్ నిమ్మతోట రఘు, రైతులు గంగుల నాగేశ్వరరావు, నందమూరి సత్యనారాయణ, బోనకల్ సొసైటీ పరిధిలోనే రైతులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ప్రకటించిన నాణ్యత ప్రమాణాలు: వ్యర్ధ పదార్థాలు ఒక శాతం, ఇతర తిండి గింజలు రెండు శాతం, దెబ్బతన్న గింజలు 1.5 శాతం, కొద్దిగా దెబ్బతిన్న రంగు మారిన గింజలు 4.5 శాతం, నాసిరకం గింజలు 3 శాతం, పుచ్చిపోయిన గింజలు 1 శాతం , తేమశాతం 14 శాతం ఉండాలి.
మొక్కజొన్న పంట కోసిన తర్వాత రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు: మొక్కజొన్న కంకుల నుంచి మొక్కజొన్నలను వేరు చేసి, యంత్రాలను ఉపయోగించి మార్పిడి చేస్తే నాణ్యమైన మొక్కజొన్నలను పొందవచ్చు. మొక్కజొన్నను వలిచిన తర్వాత బాగా ఎండలో ఆరబెట్టాలి. తెగుళ్లు సోకిన, రంగు మారిన, ముడుచుకొని పోయిన గింజలను సాధ్యమైనంత వరకు ఏరి వేయాలి. రాళ్లు, మట్టి పెడ్డలు, చెత్తాచెదారం లాంటి వ్యర్థ పదార్థాలు చేరకుండా జాగ్రత్తపడాలి. రైతులు కొనుగోలు కేంద్రమునకు వచ్చేటప్పుడు సంబంధిత రైతు పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంకు ఎకౌంటు జిరాక్స్, ఏవో సర్టిఫికెట్స్ తీసుకొని రావాలి.



