Tuesday, April 29, 2025
Navatelangana
Homeఎడిట్ పేజిమృతభాష కాకూడదు

మృతభాష కాకూడదు

- Advertisement -

కుల, మత, భాషా, సాంస్కృతికంగా వైవిధ్యభరితమైన దేశం మనది. భాష… జీవ, భౌతిక, సామాజిక, మనో వైజ్ఞానిక లక్షణాల సమాహారం. భిన్న భాషలు, భిన్న ప్రాంతాలను, విభిన్న సంస్కృతులను ఐక్యం చేసే ఏకాత్మ మన భారతీయత. ఈ ఐక్యతను దెబ్బతీసేందుకు, ఏకాత్మ మూల వేరును పెకిలించేందుకు మతోన్మాద శక్తులు శతవిధాలా ప్రయత్ని స్తున్నాయి. అందుకు దొడ్డిదారిన నేడు మన రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో తెలుగుకు గండికొట్టే ప్రయత్నాలు మొదలయ్యాయి.మార్కులు ఎక్కువగా వస్తాయన్న ఉద్దేశంతో ద్వితీయ భాషగా సంస్కృతంను ఎంచుకునే జాఢ్యం కార్పొరేట్‌, ప్రయివేటు కాలేజీల్లోనే ఎక్కువగా ఉంది. దీన్ని ప్రభుత్వ కళాశాలకు వర్తింపజేయాలని ఇంటర్‌ బోర్డు భావిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే అన్ని ప్రభుత్వ కాలేజీల్లో సంస్కృతాన్ని ద్వితీయ భాషగా అమలు చేయాలన్న నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎందుకూ అక్కరకు రాని సంస్కృతం భాషతో విద్యార్థులకు మార్కులు పెరుగుతాయని ఇంటర్‌ బోర్డు అధికారులు చెప్పడం… వారి అవివేకానికి నిదర్శనం.ఇంటర్‌లో ద్వితీయభాషగా తెలుగును ఎత్తివేసి సంస్కృతాన్ని తేవాలన్న ఇంటర్‌ బోర్డు ఆలోచన వెనక ఓ ఉన్నతాధికారిదే కీలక పాత్ర. ఏ అజ్ఞాత శక్తుల అండ చూసుకునో ఆమె ప్రభుత్వ ఆదేశాలకు భిన్నమైన ఆదేశాలివ్వడమే అసలు సమస్యకు మూలం. ఆ ఆదేశాలు ఇంటర్‌లో తెలుగుభాషకు గొడ్డలిపెట్టే. ప్రభుత్వ కాలేజీల్లో సంస్కృతాన్ని తప్పనిసరి చేయాలన్న ఆమె అత్యుత్సాహనికి కారణాలేమిటో తెలియడం లేదు.రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి వరకు అన్ని ప్రయివేటు విద్యాసంస్థల్లోనూ తెలుగును తప్పనిసరిగా అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించి రెండు నెలలైనా గడవకముందే ఇంటర్‌లో ద్వితీయ భాషగా ఉన్న తెలుగు స్థానంలో సంస్కృతాన్ని ప్రవేశపెట్టే దిశగా వచ్చిన ఆదేశాలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇంటర్‌లో సంస్కృతాన్ని రెండో భాషగా తీసుకుంటున్న విద్యార్థులు.. ఆ భాషను కాస్తంతైనా నేర్చుకుంటున్నారా అంటే అదీ లేదు. అంతా బట్టీ వ్యవహారమే. ఒట్టి మార్కుల హైరానా తప్ప మరొకటి కాదు. అయినప్పటికీ.. విద్యార్థులకు వ్యవహారపరంగా ఏమాత్రం ఉపయోగపడని సంస్కృతాన్ని ప్రోత్సహిస్తూ ఇంటర్‌బోర్డు అధికారులు తెలుగు చదివేవారి హక్కును కాలరాయడం ఎంత వరకు సరైంది? కనీసం ఒక్క సంస్కృత తరగతి కూడా వినని విద్యార్థులకు తొంభైకి పైగా మార్కులు వేయడం… చక్కని అన్వయంతో రాసే తెలుగు విద్యార్థులకు మొక్కుబడి మార్కులేమిటన్న ఆవేదన తెలుగు భాషాభిమానులు, విద్యావేత్తలు వ్యక్తమవుతోంది. సంస్కృత పరీక్షలో సమాధానాలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ ఇలా ఏ భాషలోనైనా రాసే వీలుండడం ఎంత వరకు సమంజసం? సంస్కృతాన్ని దేవనాగరి లిపిలోనే రాయాలి. కానీ, ఏ భాషలో రాసినా భారీగా మార్కులు వచ్చే అవకాశం ఉండడంతో అది కార్పొరేట్‌ విద్యార్థులకు ఒక వరంగా, స్కోరింగ్‌ సబ్జెక్టుగా మారిపోయింది. కాబట్టే ప్రభుత్వాలపై ఇలాంటి ఒత్తిళ్లు రావడానికి ఇదీ ఒక కారణం కావచ్చు.ఇలాంటి తరుణంలో ఇంటర్‌ బోర్డు తెలుగును పక్కనబెట్టి సంస్కృతానికి ఎందుకు ప్రాధాన్యమిస్తోందో? సదరు అధికారి నిర్ణయం వెనక ఉన్న మతలబు ఏమిటో? ఇంటర్‌లో తెలుగు చదవకపోతే డిగ్రీలోనూ చదివే అవకాశం ఉండదు. కాబట్టి క్రమంగా రాష్ట్రంలో తెలుగు చదివే వారు కానీ, బోధించే వారు కానీ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని తెలుగు భాషను కాపాడాల్సిన అవసరం ఉంది.దేశంలో నూతన విద్యా విధానం పేర కాషాయ ఆలోచనలను నింపే ప్రయత్నంలో భాగంగానే…దేశ వైవిధ్యాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా… దేశవ్యాప్తంగా హిందీ అమలు కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తోంది. ఆధునిక శాస్త్ర సాంకేతిక అవసరాలను తీర్చేదిగా హిందీని అభివృద్ధి చేయాలని అంటూనే సంస్కృతీకరించేందుకు పూనుకున్నారు. ‘కాలం చెల్లిన సంస్కృతంతో హిందీని సజీవం చేయాలనుకోవడం మొరటు ప్రయత్నం’ అని భాషా నిపుణులు చెబుతున్నారు. దేశ వైవిధ్యాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా… ఇలాంటి నిర్ణయాలను బలవంతంగా రుద్దడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. యువతకు నష్టం జరిగే ఎలాంటి ప్రయత్నమూ సమాజానికి మేలు చేయదు. గతంలో జరిగిన హిందీ వ్యతిరేక ఆందోళనల నుంచి ప్రభుత్వాలు ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకుంటే దేశ ఐక్యతకు, భారతీయత బలోపేతానికి మార్గం సుగమమవుతుంది. లేదంటే… దేశంలో భాషా బేధాలు తలెత్తే అవకాశం ఉంది. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏమాలోచిస్తోందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు