సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రగతి. వెండితెరపై ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో కనిపించారు. భార్యగా, తల్లిగా, సోదరిగా ఎన్నో చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో ప్రేక్షకులను మెప్పించారు. ఫిట్‌నెస్‌కు కూడా ఆమె ఎంతో ప్రధాన్యం ఇస్తుంటారు. డైలీ వర్కౌట్లు, యోగా, వెయిట్ లిఫ్టింగ్ లాంటివి చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఏదో సరదాగా చేస్తున్నారనుకున్న వర్కౌట్‌ను ఆమె సీరియస్‌గా తీసుకున్నారు. వెయిట్ లిఫ్టింగ్‌లో రాణిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి గుర్తింపు తీసుకొస్తున్నారు. సంకల్పం ఉంటే వయసుతో సంబంధం లేదని మరోసారి నిరూపించిన ఆమె పరిచయం నేటి మానవిలో…
ప్రగతి షూటింగ్ లేకపోతే జిమ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. అయితే అందం, ఆరోగ్యం కోసమే ఇలాంటి వర్కౌట్లు చేస్తుందనుకుని చాలా మంది రకరకాల కాంమెంట్లు చేసేవారు. అలాంటి వారందరికీ ప్రగతి షాక్ ఇచ్చారు. వెయిట్ లిఫ్టింగ్‌లో జాతీయ స్థాయిలో తన సత్తా ఏంటో చూపించారు. అంతేనా ఇటీవలె అంతర్జాతీయ స్థాయిలో దేశం తరపున పాల్గొని మెడల్ అందుకున్నారు.
వెండి తెరకు పరిచయం
ప్రగతి 1976 ఏప్రిల్ 16న నెల్లూరు జిల్లా ఉలవపాడులో పుట్టారు. పెరిగింది మాత్రం హైదరాబాద్. డిగ్రీ చదువుతున్నపుడే ఆమె మైసూర్ సిల్క్ ప్యాలెస్‌కు మోడల్‌గా నటించారు. ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పని చేశారు. ఆ సమయంలోనే తమిళ దర్శకుడు కె.భాగ్యరాజా ‘వీట్ల విశేషంగా’ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకున్నారు. ఆ తర్వాత తమిళ, మలయాళ చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. పెండ్లి తర్వాత కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. కొన్నాళ్లు రీఎంట్రి ఇచ్చారు. అయితే టీవీ సీరియల్స్‌లో మాత్రమే నటించారు. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అవకాశాలు వచ్చాయి.
బిజీ ఆర్టిస్టుగా…
మహేశ్‌బాబు ‘బాబీ’ సినిమాతో సెంకడ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ప్రగతికి ఇక వెనక్కి తిరిగి చూసుకోవల్సిన అవసరం లేకుండా పోయింది. తెలుగులో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. బృందావనం, రేసుగుర్రం, బాద్‌షా, జులాయి లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించారు. లాక్‌డౌన్ సమయంలో ప్రగతి ఎక్కువగా జిమ్ వీడియోలు పోస్ట్ చేసేవారు. అలా ఆరోగ్యం కోసం మొదలుపెట్టిన జిమ్ ఆమెను ఇప్పుడు వెయిట్ లిఫ్టర్‌గా మార్చివేసింది.
టార్గెట్ పెద్దది
2023లో తన ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి ‘కొత్త జర్నీ మొదలైంది. రెండు నెలల కిందట నా జీవితం ఇలా మలుపు తిరుగుతుందని అస్సలు ఊహించ లేదు. పవర్ లిఫ్టింగ్‌లో నా కొత్త ప్రయాణమిది. రెండు నెలల కిందట స్టార్ట్ అయిన ఈ జర్నీలో ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. ఇది కూడా పూర్తి చేసి తీరతాను. ప్రస్తుతం నా స్కోరు 250. అయితే టార్గెట్ చాలా పెద్దది. దాన్ని చేరే వరకు తగ్గేదే లే’ అంటూ రాసుకొచ్చారు. అన్నట్టుగానే ఆమె ప్రస్తు తం తన టార్గెట్‌ను రీచ్ అయ్యారు.
సరదాకు చేస్తుందనుకుంటే…
ప్రగతి ఏదో ఫిట్ నెస్ కోసం వర్కౌట్లు చేస్తుందని మొదట్లో చాలా మంది అనుకున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తే ‘ఆంటీ.. ఈ వయసులో నీకు అవసరమా’ అంటూ కామెంట్లు చేసినవాళ్లు కూడా ఉన్నారు. ఎవరు ఏమన్నా ప్రగతి మాత్రం తన పని తాను చేసుకుపోయారు. అయితే ఆమె టార్గెట్ ఏంటో తెలుసుకున్న తర్వాత ఆశ్చర్యపోయారు. రెండేండ్ల నుండి వెయిట్ లిఫ్టింగ్‌లో ఆమె సాధిస్తూ వస్తున్న సక్సెస్‌లు చూసి అంతా నోరెళ్ళబెట్టారు. సరదాకు చేస్తుందనుకున్న వెయిట్ లిఫ్టింగ్, జిమ్‌ను ఆమె చాలా సీరియస్‌గా తీసుకున్నారు. అంతే కాదు పోటీలకు కూడా సిద్ధమయ్యారు.
అనేక మెడల్స్ అందుకొని
2023లో పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనడం ప్రారంభించిన 49 ఏండ్ల ప్రగతి ఈ ఏడాది హైదరాబాద్ జిల్లా స్థాయి, తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీల్లో స్వర్ణం గెల్చుకున్నారు. అలాగే కేరళలో జరిగిన నేషనల్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లోనూ గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు. జాతీయ స్థాయిలో నేషనల్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్యం సాధించారు. 2024 సౌత్ ఇండియన్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో సిల్వర్ మెడల్ గెలిచారు. తాజాగా ఇంటర్నేషనల్ లెవల్లో ఇండియాకు మెడల్‌ను కూడా సాధించారు. వీటితోపాటు గత రెండేండ్లుగా హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్‌లో వరుసగా గోల్డ్ మెడల్స్ గెల్చుకుంటూ సత్తా చాటారు.
అద్భుత ప్రతిభ
ఇప్పటి వరకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో అనేక పతకాలు సాధించిన ప్రగతి ఇటీవల అంతర్జాతీయ స్థాయిలోనూ తన సత్తా చాటుకున్నారు. 2025 ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశం తరపున పాల్గొన్నారు. టర్కీలో జరిగిన ఈ పోటీల్లో 84 కేజీల పవర్ లిఫ్టింగ్ విభాగంలో అద్భుత ప్రతిభ చూపించారు. ఈ విభాగంలో ఆమె సిల్వర్ మెడల్ సాధించి ఇండియాకు ఘనత తీసుకువచ్చారు.
కోచ్‌కు ధన్యవాదాలు
అంతే కాదు ప్రగతి వీటికి అదనంగా డెడ్ లిఫ్ట్, బెంచ్ ప్రెస్, స్క్వాడ్ విభాగాల్లో ఒక గోల్డ్, రెండు సిల్వర్‌లు గెలుచుకుని మొత్తంగా నాలుగు పతకాలు తన ఖాతాలో వేసుకున్నారు. ఈ విజయాల వివరాలను ప్రగతి స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఆమె అభిమానులు, నెటిజన్లు, సినీ ప్రముఖులు, ఫిట్‌నెస్ కమ్యూనిటీ సభ్యులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. యాక్టింగ్ మాత్రమే కాదు.. ఇలా స్పోర్ట్స్‌లో కూడా సత్తా చాటుతూ.. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం ఫిల్మ్ ఇండిస్టీ గర్వించదగ్గ విషయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె తన ట్రైనింగ్‌లో కీలక పాత్ర పోషించిన కోచ్ ఉదరుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సలీమా



