హైదరాబాద్ అభివృద్ధే లక్ష్యం : బం-రుక్న్-ఉద్-దౌలా చెరువు ప్రారంభోత్సవ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
నిజాం నిర్మించిన కట్టడాన్ని రక్షిస్తాం
నవతెలంగాణ-రాజేంద్రనగర్
‘ఓల్డ్ సిటీ కాదు.. ఇది ఒరిజనల్ సీటీ .. చాలా సుందరమైనది. ఒక వైపు చార్మినార్, మరో వైపు గొల్కొండ, ఉస్మానియా ఆస్పత్రి, ఫలక్‌నుమా ఫ్యాలెస్.. చారిత్రాత్మక ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి.. అన్నింటినీ నిజాం సర్కార్ నిర్మించింది.. వాటిని రక్షించడానికి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ పాతబస్తీలోని చారిత్రక బం-రుక్న్-ఉద్-దౌలా చెరువును మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో కలిసి ఆదివారం సీఎం ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో సీఎం ప్రసంగించారు. పాతబస్తీలో రోడ్ల విస్తరణ, మెట్రో రైలు నిర్మాణం కోసం భూ సేకరణ చేశామని తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రికి నూతన నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ తీసుకుని, హైదరాబాద్ అభివృద్ధికి ప్రయత్నం చేస్తోందన్నారు. హిమాయత్ సాగర్ ఎకో పార్క్‌ను ఇప్పటికే ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు. దేశంలోనే హైదరాబాద్ గతంలో నెంబర్ 1గా ఉండేదని, ఇప్పుడు నగరమంతా చెత్తతో నిండిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. లండన్ థేమ్స్ నదిని అక్బరుద్దీన్‌తో కలిసి తాను సందర్శించానని గుర్తు చేసుకున్నారు. నదీ పరివాహక ప్రాంతంలోనే నాగరికత వెలసిల్లిందన్నారు. మూసీకి వరదలు వచ్చినప్పుడు నిజాం నవాబు మోక్షగుండం విశ్వేరయ్యను తీసుకొచ్చి రిజర్వాయర్లు నిర్మించారని తెలిపారు.
హైదరాబాద్ నగరం చరిత్రను, ప్రభావాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని, ఆక్రమణలకు గురైన చెరువులను, నాలాలను, పార్కులను పునరుద్ధరించడానికి ప్రభుత్వం అంకితభావంతో పని చేస్తోందని స్పష్టం చేశారు. బతుకమ్మ కుంటను కబ్జా పెట్టుకున్న వాళ్లపై కఠినంగా వ్యవహరించామని తెలిపారు. ఈనాడు బతుకమ్మ కుంటలో ఆడబిడ్డలు బతుకమ్మ ఆడుతున్నారని, అలాగే బం-రుక్న్-ఉద్-దౌలా చెరువును కూడా పునరుద్ధించామన్నారు. లేక్ పోలీసింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. చెరువు దగ్గరకు వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూడాలన్నారు. చెరువుల దగ్గర స్వయం సహాయక మహిళలతో స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. పాలు, పండ్లు కొనుక్కునే స్టాల్స్‌ను చెరువుల దగ్గర ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్‌లో రాత్రి ఒంటి గంట వరకు వ్యాపారాలు చేసుకునే వెసులుబాటు కల్పించామని తెలిపారు. మూసీ పునరుద్ధరణతో నైట్ బజార్‌లు తీసుకురాబోతున్నామని, రాత్రి అంతా మూసీ రివర్ ఫ్రంట్‌లో వ్యాపారాలు చేసుకోవడం ద్వారా పాతబస్తీలో నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు.
మూసీ పునరుద్ధరణలో పేదల ఇండ్లు పోతే వాళ్లకు ఇండ్లు కట్టించి ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇప్పటికే ప్రణాళిక తయారు చేశామని, దీనిపై అసదుద్దీన్ ఓవైసీతో మాట్లాడతామని అన్నారు. ‘ఈ ప్రాంతం మనది.. దీన్ని రక్షించుకునే బాధ్యత మనందరిది. పాతబస్తీలో ముసీ పునరుద్ధరణ కోసం ఎంఐఎం పార్టీ కార్యకర్తలకు అసదుద్దీన్ ఓవైసీ పిలుపునివ్వాలి. నిధులకు ఎలాంటి కొరతా లేదు.. పాతబస్తీలో మెట్రోతో పాటు అన్ని సౌకర్యాలూ కల్పిస్తాం..’ అని సీఎం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మీర్జా రెహ్మద బేగ్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, ఆర్డీఓ వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజనల్ సిటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



