Friday, November 7, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయండ్రగ్స్‌పై కాదు… వెనిజులా పైనే

డ్రగ్స్‌పై కాదు… వెనిజులా పైనే

- Advertisement -

కయ్యానికి కాలుదువ్వుతున్న ట్రంప్‌ ప్రభుత్వం
17 దాడులు…67 మంది మృతి

వాషింగ్టన్‌ : ఎనిమిది నెలల కాలంలో ఎనిమిది యుద్ధాలు ఆపానని చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తనను తాను ఓ శాంతిదూతగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఘర్షణలను నివారించినందుకు తనకు నోబెల్‌ శాంతి బహుమతి వస్తుందని ఆశించి భంగపడ్డారు. అయితే అగ్రరాజ్యం నిజంగానే శాంతిని కోరుకుంటోందా అని ప్రశ్నిస్తే లేదనే సమాధానమే వస్తుంది. శత్రు దేశాలపై ఏదో ఒక సాకుతో కయ్యానికి కాలు దువ్వడం దానికి అలవాటే. ఇప్పుడు కరేబియన్‌ ప్రాంతంలో జరుగుతున్నది అదే. అక్కడ అమెరికా దళాల మోహరింపు నానాటికీ పెరిగిపోతోంది. యుద్ధ విమాన వాహన నౌకలు, ఎఫ్‌-35 విమానాలు, ప్రత్యేక దళాలు అక్కడ మకాం వేశాయి. మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్నాయన్న అనుమానంతో ఓడలపై ప్రాణాంతక వైమానిక దాడులు జరుగుతున్నాయి.

దీనికి అమెరికా అధికారులు చెబుతున్న కారణాలు ఏమిటంటే మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్న వారిని ట్రంప్‌ లక్ష్యంగా చేసుకున్నారట. కొకైన్‌, ఫెంటానిల్‌ వంటి మత్తు పదార్థాల రవాణా జరగకుండా అమెరికా తీర ప్రాంతాలను రక్షించుకుంటున్నారట. కానీ వాస్తవాలను నిశితంగా గమనిస్తే కథ వేరేలా ఉంది. వెనిజులా సమీపంలో అమెరికా నౌకాదళం అనునిత్యం పహారా కాస్తోంది. చిన్న చిన్న ఓడలపై క్షిపణులు విరుచుకుపడు తున్నాయి. ఈ దాడుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలు సముద్ర జలాలలో తేలియాడుతున్నాయి. రహస్య ఆపరేషన్‌ నిర్వహించేందుకు సీఐఏకు అనుమతి ఇచ్చారు. వెనిజులా భూభాగంలో ప్రాణాంతక దాడులు చేపట్టేందుకు ఆ సంస్థ సిద్ధంగా ఉంది. వెనెజులా అధ్యక్షుడు నికొలస్‌ మదురోపై ట్రంప్‌ ‘మాదక ద్రవ్యాల ఉగ్రవాది’గా ముద్ర వేశారు. ఆయన తలకు యాభై మిలియన్‌ డాలర్ల వెల కట్టారు. ఇవి కేవలం రెచ్చగొట్టే మాటలు కావు. అమెరికా విధాన నిర్ణేతల దృష్టిలో అసాధారణ సైనిక చర్యలకు సమర్ధింపులు.

రంగంలోకి దిగిన రష్యా
అమెరికా చర్యలకు ప్రతిగా రష్యా కూడా రంగంలోకి దిగింది. వెనిజులాకు వైమానిక రక్షణ వ్యవస్థలను సరఫరా చేసింది. పంత్‌సర్‌-ఎస్‌1ఎస్‌, బక్‌-ఎం2ఈఎస్‌, ఎస్‌-300 వీఎంఎస్‌ వంటి రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలు వెనిజులా అమ్ముల పొదిలో చేరాయి. సుదూర లక్ష్యాలను ఛేదించే క్రూయిజ్‌ క్షిపణులను కూడా రష్యా అందించబోతోంది. రష్యాకు చెందిన రవాణా విమానాలు వెనిజులాలో చక్కర్లు కొడుతున్నాయి. రష్యా చట్టసభ సభ్యులు బహిరంగంగానే మదురోకు మద్దతు ప్రకటించారు. కరేబియన్‌ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే మాదక ద్రవ్యాలపై పోరు పేరుతో ప్రచ్ఛన్న యుద్ధం తరహాలో పరోక్ష ఘర్షణలు తప్పేలా లేవు.

మెక్సికోపై కూడా…
అంతర్జాతీయ జలాలలో ఇలాంటి దాడులు జరపడానికి చట్టబద్ధమైన ప్రాతిపదిక ఏమైనా ఉన్నదా అని డెమొక్రాట్లే కాకుండా రిపబ్లికన్లు సైతం ట్రంప్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అమెరికా దళాలు చంపుతున్నది మాదక ద్రవ్యాల రవాణా దారులను కాదని, వారంతా మత్స్యకారులని లాటిన్‌ అమెరికాలోని మృతుల కుటుంబ సభ్యులు వాపోయారు. దాడులను వెంటనే ఆపాలని ఐరాస మానవ హక్కుల అధిపతి వోల్కర్‌ ట్రంక్‌ గత వారం అమెరికాను కోరారు. అయినా అది ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కాగా మాదక ద్రవ్యాలపై పోరాటం పేరుతో తాజాగా మెక్సికోకు అమెరికా దళాలను, ఇంటెలిజెన్స్‌ అధికారులను పంపాలని ట్రంప్‌ యోచిస్తున్నారు.

ఆధారాలు చూపని అగ్రరాజ్యం
వెనిజులా వద్ద అపారమైన చమురు నిల్వలు ఉన్నాయి. కీలక సముద్ర మార్గాలపై దాని ఆధిపత్యం కొనసాగుతోంది. దీనినిజీర్ణించుకోలేని అమెరికా ఎలాగైనా వెనిజులాను తన అధీనంలోకి తెచ్చుకోవాలని యోచిస్తోంది. అందుకే మాదక ద్రవ్యాల రవాణాపై దాడుల పేరుతో కయ్యానికి కాలు దువ్వుతోంది. వాస్తవానికి ఆ ఓడల్లో మాదక ద్రవ్యాల రవాణా జరుగుతోందని చెప్పడానికి అమెరికా వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. అమెరికా జరుపుతున్న వైమానిక క్షిపణి దాడుల కారణంగా ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరిని బందీలుగా చేసి వారిని చిత్రహింసలకు గురి చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. సెప్టెంబర్‌ నుంచి కరేబియన్‌, పసిఫిక్‌ ప్రాంతాలలో ఓడలపై అమెరికా జరిపిన 17 దాడుల్లో కనీసం 67 మంది చనిపోయారు. తాజాగా పసిఫిక్‌లో జరిపిన దాడిలో ఇద్దరు మరణించారు.

మిత్ర దేశాల బాసట
వెనిజులాకు ప్రాంతీయ భాగస్వామ్య దేశాలు బాసటగా నిలుస్తున్నాయి. ఓడలో ప్రయాణిస్తున్న తన జాతీయులు అమెరికా వైమానిక దాడిలో మరణించడంపై కొలంబియా మండిపడుతోంది. తన భూభాగం సమీపంలో అమెరికా చేపడుతున్న సైనిక చర్యలపై మెక్సికో అభ్యంతరం వ్యక్తం చేసింది. వెనిజులా చుట్టూ అమెరికా సైనిక దళాల మోహరింపును బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా నిరసించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -