కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే లేబర్ కోడ్‌లు
తిప్పికొట్టేందుకు పోరాటమే మార్గం : ఎస్‌వీకే వెబినార్‌లో సీఐటీయూ జాతీయ కోశాధికారి సాయిబాబు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లతో కార్మికుల హక్కులకే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకూ దెబ్బేనని అని సీఐటీయూ జాతీయకోశాధికారి ఎమ్. సాయిబాబు ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్యాలకు కార్మికులు గులాంగిరి చేసేలా ఈ చట్టాలను తీసుకొచ్చిందని విమర్శించారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే లేబర్ కోడ్‌లను అమలు చేస్తున్నదని చెప్పారు. అందువల్ల కార్మికులు జీతభకార్మికుల హక్కులకే కాదు…ఆర్థిక వ్యవస్ధకూ దెబ్బే త్యాల కోసమే కాకుండా హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ‘మోడీ ప్రభుత్వ లేబర్ కోడ్‌లు ఎవరి కోసం?’ అనే అంశంపై నిర్వహించిన వెబినార్ సాయిబాబు మాట్లాడారు. దీనికి ఎస్‌వీకే మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్ వినయకుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు.
దశాబ్ద కాలంగా కార్మికులు ప్రాణ త్యాగాలు చేసి 29 కార్మిక చట్టాలను సాధించుకున్నారని గుర్తు చేశారు. ఏ చట్టం కూడా పోరాటం చేయకుండా రాలేదని తెలిపారు. కార్మికుల హక్కులకు రక్షణ ఉన్న చట్టాలను కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం మార్చి కార్మికుల హక్కులను హరించిందని విమర్శించారు. చట్టాలతో కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేయడం, కార్పొరేట్లకు లాభాలు తెచ్చి పెట్టడం, ఆదాయాలు పెంచుకోవడం, సంపద కొద్ది మంది చేతుల్లో పోగుపడటం, కార్మికుల జీవన ప్రమాణాలు తగ్గడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీని ఫలితంగా ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోందని తెలిపారు. ఈ చట్టం పరిశ్రమలను ఎప్పడు పడితే అప్పుడు మూసేందుకు యాజమాన్యాలకు వీలు కల్పించిందన్నారు. అప్పుడు కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదని చెప్పారు. హక్కుల సాధన కోసం కార్మికులకు ఉన్న సమ్మె అనే ఆఖరి ఆయుధాన్ని కూడా బీజేపీ ప్రభుత్వం లేకుండా చేసిందని విమర్శించారు.
సమ్మెకు మద్దతు ఇచ్చే ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు, రాజకీయపార్టీల నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపే అవకాశాన్ని లేబర్ కోడ్‌లు కల్పించాయన్నారు. సామాజిక భద్రతకు పెద్దపీట వేస్తున్నట్టు ప్రకటించినప్పటికీ, పీఎఫ్, ఈఎస్‌ఐ, గ్రాట్యూటీ, బోనస్ వంటి సౌకర్యాల్లో కేంద్రం కోత పెట్టిందని చెప్పారు. ప్రయివేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రతి అంశానికి ఆధార్ లింక్ పెట్టడంతో వలస కార్మికుల పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. పది లక్షల విలువైన నిర్మాణం చేపడితే ఒక శాతం సెస్ కార్మిక వెల్ఫేర్ బోర్డుకు చెల్లించే విధానం అమలుల్లో ఉందనీ, దాని స్థానంలో 50లక్షల విలువ ఉంటేనే సెస్ చెల్లించాలనే నిబంధనను పెట్టి కేంద్రం పెద్ద పెద్ద కంపెనీలకు మేలు చేసిందన్నారు.
వెల్ఫేర్ బోర్డుకు సెస్ చెల్లించకపోతే కార్మిక సంక్షేమం, భద్రత, రక్షణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. నిర్మాణ ప్రదేశాలను పర్యవేక్షించే అధికారాలను తొలగించిందనీ, ఆయా కంపెనీలు సెల్ఫ్ సర్టిఫికెట్స్ ఇస్తే సరిపోతుందని పేర్కొందని తెలిపారు. పని గంటలు పెంచడంతోపాటు వారాంతపు సెలవులను కూడా ఈ కోడ్లు హరించాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేరళ రాష్ట్రం మినహా రెండు తెలుగు రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పని పది గంటలకు పెంచుతూ జీవోలు ఇచ్చారని విమర్శించారు. ఫలితంగా కొత్త వారికి ఉద్యోగాలు కూడా రావన్నారు. దేశంలో నిరుద్యోగం మరింత పెరుగుతుందని చెప్పారు. సాంకేతికత పెరిగితే శ్రమ తగ్గాల్సిన చోట పెరుగు తుందన్నారు. ఈ నేపథ్యంలో కార్మికులకు పోరాటం తప్ప మరో మార్గం లేదనీ, అందుకు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.



