– బీసీ రిజర్వేషన్లపై నమ్మించి మోసం
– 21న నిరాహార దీక్షలు, కలెక్టరేట్ల వద్ద ధర్నా : రాష్ట్ర బీసీ జేఏసీ చైర్మెన్ ఆర్.కృష్ణయ్య
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
బీసీ రిజర్వేషన్లు పార్టీ పరంగా వద్దని, చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలని రాజ్యసభ సభ్యులు, రాష్ట్ర బీసీ జేఏసీ చైర్మెన్ ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని కోరారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి బాణాల అజరు కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కృష్ణయ్య మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇస్తామని సీఎం, మంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షులు పదే పదే ప్రకటించి ఏడాది కాలం నమ్మించి మోసం చేశారని, దీనికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు, ఎమ్మార్వో, ఆర్డీవో కార్యాలయాల ఎదుట నిరాహార దీక్షలు, ధర్నాలు చేపడతామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లను ఇస్తామని క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమన్నారు. ఇది బీసీలను నమ్మించి మోసం చేయడమేనని విమర్శించారు. ఇక ముందు రాష్ట్ర ప్రభుత్వానికి, బీసీలకు మధ్య జరిగేది యుద్ధమేనని హెచ్చరించారు. ప్రభుత్వం మొదటి నుంచే వివిధ పార్టీల మద్దతు ద్వారా పోరాడితే సాధించే అవకాశం ఉండేదని, చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలేదని అన్నారు. కాంగ్రెస్ నాయకత్వం వహించే ఇండియా కూటమికి లోక్‌సభలో 240 మంది ఎంపీలు ఉన్నా ఒక్క రోజూ పార్లమెంట్‌లో ప్రశ్నించలేదని, అలాగే ప్రధానిని కలిసి చర్చించలేదని అన్నారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో పార్టీపరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. మార్చిలోపు ఎన్నికలు పూర్తి చేయకపోతే రూ.3 వేల కోట్లు వృథా అవుతాయని సీఎం అనడం సరైంది కాదని, రూ.3 వేల కోట్ల బడ్జెట్ కంటే 2 కోట్ల మంది బీసీ సమాజం ఎదురుచూస్తున్న బీసీ రిజర్వేషన్లు ఎంతో ముఖ్యమని అన్నారు. హైకోర్టులో కేసు నెలలోపు పూర్తవుతుందని, ఆ లోపు అఖిలపక్షంతో కలిసి వెళ్లి ప్రధానితో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించొచ్చని సూచించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్, బీసీ యువజన, విద్యార్థి సంఘాల నాయకులు జి.అనంతయ్య, సి.రాజేందర్, రాజ్ కుమార్, భీమ్ రాజ్, పగిళ్ల సతీష్, మోడీ రాందేవ్, జి.అంజి తదితరులు ఉన్నారు.
పార్టీపరంగా వద్దు.. చట్టపరంగా ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



