నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రఖ్యాత సాహితీవేత్త, అవధాని అయిన అవధానుల దత్తయ్య శర్మ శివైక్యం చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం కరీంనగర్‌లోని అపోలో రిచ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దత్తయ్య ఆకస్మిక మరణ వార్త హుజురాబాద్ ప్రాంత సాహితీ లోకాన్ని, ఆయన అభిమానులను, ఆప్తులను, కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో నెట్టివేసింది. తెలుగు భాషకు, సాహిత్యానికి ఆయన చేసిన సేవలు అపారమని, ఆయన మరణం తీరని లోటని పలువురు ప్రముఖులు, సాహితీవేత్తలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తన జీవితాన్ని అవధాన కళకు, సాహిత్య లోకానికి అంకితం చేశారు. తనదైన శైలిలో పద్య రచన, ప్రసంగ ధోరణితో ఎంతో మందిని ఆకట్టుకున్నారు. ఆయన చేపట్టిన ఎన్నో అవధానాలు, సభలు, ప్రసంగాలు హుజురాబాద్ ప్రాంతానికి స్ఫూర్తినిచ్చాయి. ఆయన బహుముఖ ప్రజ్ఞ, విజ్ఞానం ఎందరికో ఆదర్శం. సాహిత్య రంగంలో ఆయన చేసిన కృషికి పలు సన్మానాలు లభించాయి. దత్తయ్య శర్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులు, శిష్యులు తమ దుఃఖాన్ని తెలియజేస్తున్నారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు ఈ తీరని శోకాన్ని తట్టుకునే మనో ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుతూ ప్రార్థిస్తున్నారు.



