– కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కనీస వేతనాల బోర్డు ఛైర్మెన్, సభ్యులుగా కార్మిక సంఘాలకు చెందిన వాళ్లను నియమించారనే పిల్‌ను విచారించిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. స్వతంత్ర వ్యక్తులను నియమించాలన్న నిబంధనల కు వ్యతిరేకంగా కనీస వేతనాల బోర్డు చైర్మెన్‌గా జనక్ ప్రసాద్, సభ్యుడిగా ఎస్.నరసింహారెడ్డిలను ప్రభుత్వం నియమించిందనే పిల్‌కు నెంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ నియామకంపై కౌంటర్లు దాఖలు చేయా లంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్మిక ఉపాధి శాఖ ముఖ్యకార్యదర్శి, కార్మికశాఖ కమిషనర్‌లతో పాటు బి.జనక్‌ప్రసాద్, ఎస్.నరసింహారెడ్డిలకు వ్యక్తిగత హోదాలో నోటీసులు జారీ చేసింది. వారిద్దరి నియామక జీవోలు 443, 21లను సవాలు చేస్తూ ట్రేడ్ యూనియన్ కార్యకర్త జి.శ్రీనివాస్ వేసిన పిల్‌ను చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ పి.శ్యాం కోశీ డివిజన్ బెంచ్ గురువారం విచారించింది. అడ్వొకేట్ చిక్కుడు ప్రభాకర్ వాదిస్తూ, వాళ్లిద్దరూ అధికార పార్టీకి చెందిన వారనీ, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ (ఐఎన్‌టీయూసీ) నేతగా జనక్ ప్రసాద్, సింగరేణి కాలరీస్ ట్రేడ్ యూనియన్ నేతగా నరసింహారెడ్డి ఉన్నారని చెప్పారు. ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన పదవిలో అధికార పార్టీకి అనుకూలం గా ఉన్న వారిని నియమిస్తే కనీస వేతనాలు పెంపునకు ఆస్కారం ఉండబోదన్నారు. ఛైర్మెన్, సభ్యుల నియామకం కనీస వేతనాల చట్టం నిబంధనలకు విరుద్ధమన్నారు. స్వతంత్ర వ్యక్తులను నియమించాలనే నిబంధనలకు వ్యతిరేక మన్నారు. చట్ట విరుద్ధంగా నియామకం జరిగిందన్నారు. విచారణ వాయిదా పడింది.
విద్యుత్ సంస్థలకు ఊరట
విద్యుత్తు సరఫరాలో లోటు ఛార్జీల బకాయిలు రూ.179 కోట్లు చెల్లించాలంటూ సీఈఆర్‌సీ (సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులరేటరీ కమిషన్) ఇచ్చిన నోటీసులపై ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌లకు హైకోర్టులో ఊరట లభించింది. సీఈఆర్‌సీ ఇచ్చిన డిమాండ్ నోటీసును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్తు సరఫరాలో హెచ్చు తగ్గులను సమన్వయం చేస్తూ గ్రిడ్‌కు అదనపు విద్యుత్తు అందించినందుకు రూ.179 కోట్లు బకాయిలు చెల్లించాలంటూ సీఈఆర్‌సీ జారీ చేసిన ఉత్తర్వును సవాలు చేస్తూ ఎస్పీడీసీఎల్, ఎన్సీడీసీఎల్‌లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ పి.శ్యాంకోశీలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్.శ్రీధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ రెగ్యులేటరీ నిబంధనలు గత ఏడాది సెప్టెంబరు 16న అమల్లోకి వచ్చాయనీ, నిబంధనలు అమల్లోకి రాకముందు బకాయిలను చెల్లించాలనడం సరికాదన్నారు. రాష్ట్రానికి సరఫరా సమయంలో జరిగిన హెచ్చుతగ్గులకు చెందిన వాస్తవ ఛార్జీలను చెల్లించడానికి సిద్ధమేనన్నారు. అయితే ఇతర రాష్ట్రాలకు చెందిన భారాన్ని రాష్ట్ర సంస్థలపై మోపడం సరికాదన్నారు. వాదనలను విన్న ధర్మాసనం రూ.179 పాత బకాయిల చెల్లింపునకు సంబంధించి జారీ చేసిన నోటీసు అమలును నిలిపివేసింది. తాజాగా ఏర్పడే లోటు ఛార్జీలను మాత్రం చెల్లించాలని విద్యుత్తు సంస్థలను ఆదేశిస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
ఇసుక అక్రమ రవాణా కేసు కొట్టివేత
ప్రభుత్వ రూల్ ప్రకారం ఇసుక రవాణా చేసిన వాహనాన్ని సీజ్ చేశాక వాహన యజమాని జరిమానా చెల్లిస్తే వెంటనే వాహనాన్ని విడుదల చేయాలని హైకోర్టు తీర్పు చెప్పింది. సీజ్ చేసిన ట్రాక్టర్‌ను విడుదల చేయాలని నాగర్‌కర్నూలు పోలీసులను ఆదేశించింది. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న తన వాహనాన్ని సీజ్ చేస్తూ పోలీసులు పెట్టిన కేసును కొట్టేయాలని ట్రాక్టర్ యజమాని బండి చెన్నయ్య వేసిన పిటిషన్‌పై జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ తీర్పు చెప్పారు. తొలిసారి సీజ్ చేస్తే రూ. 5 వేలు, రెండోసారి అయితే రూ.15 వేలు జరిమానా చెల్లించాలనే నిబంధన ఉందనీ, జరిమానా చెల్లించాక గనుల శాఖ అధికారులు ట్రాక్టర్‌ను రిలీజ్ చేయాలని పోలీసులకు లేఖ రాసినప్పటికీ చేయలేదన్నారు. వాదనల తర్వాత న్యాయమూర్తి, జరిమానా చెల్లించినందున పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేస్తూ, సీజ్ చేసిన ట్రాక్టర్‌ను అప్పగించాలని ఆదేశించారు.
కనీస వేతనాల బోర్డు చైర్మెన్, సభ్యుల నియామకంపై నోటీసు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES