నీటి ఎద్దడి నివారణకు రూ. 200 కోట్లు
అసెంబ్లీలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
పలు పద్దులను ఆమోదించిన సభ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో 15 వేల అంగన్వాడీ పోస్టులను త్వరలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. శనివారం ఆ శాఖ పద్దులపై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియ తుది దశకు చేరుకుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్వాడి కేంద్రాలను అప్‌గ్రేడ్ చేసి, వారికి రూ.13,650 వేతనం చెల్లిస్తున్నామన్నారు. అలాగే మహిళా సంఘాలను రూ.57 కోట్లను రుణాలుగా చెల్లించామనీ, అందులో రూ.13 వేల కోట్ల వడ్డీ మాఫీ కూడా ఉందని వివరించారు. వేసవిలో మంచినీటి సమస్య పరిష్కారానికి ఏప్రిల్1 నుంచి 15వరకు రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామనీ, ఇందు కోసం రూ.200 కోట్లు కేటాయించినట్టు తెలిపారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో 15వ ఆర్దిక సంఘం నిధులు రూ.12,80 కోట్లు రాష్ట్రానికి రాగా, స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ కింద రూ.611 కోట్లు, 2025-26 ఏడాదికి రూ.400 కోట్లు గ్రామ పంచాయతీలకు విడుదల చేశామని తెలిపారు. కల్యాణ లక్ష్మీ అమలుకు నిధుల కొరత లేదన్నారు. ఈ ఆర్దిక సంత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.5,486 కోట్లు విడుదల చేయగా, అందులో రూ.3,484 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అకారణంగా ఏ ఒక్కరికీ పింఛన్లు ఆపలేదనీ, మరణించిన వారికి, రెండు పింఛన్లు తీసుకుంటున్న వారిని అనర్హులుగా గుర్తించి నిలిపివేశామని మంత్రి చెప్పారు. తామ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు లక్ష మందికి కొత్త పింఛన్లు మంజూరు చేశామన్నారు.
వచ్చే ఏడాది రెండు లక్షల మందికి ఇవ్వాలని బడ్జెట్లో నిధులు ప్రతిపాదించామని చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వచ్చే ఆర్దిక సంవత్సరం పూర్తి స్థాయిలో అమలు చేస్తామని తెలిపారు. మహిళల పట్ల సమాజ ఆలోచనాదృక్పధం మారాల్సి ఉందని పేర్కొన్నారు. మహిళల కోసం త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలసీ తీసుకొస్తుందని తెలిపారు. తాను నిత్య విద్యార్ధిననీ, పొరపాట్లు జరిగితే సరిదిద్దుకొని ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి సీతక్క తెలిపారు. హోం, రవాణా, బీసీ సంక్షేమం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశ, వికలాంగుల సంక్షేమం పద్దులకు సభ ఆమోదం తెలిపినట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇందన, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గృహనిర్మాణం, మంత్రి శ్రీధర్‌బాబు ఐటీ, పరిశ్రమల శాఖ పద్దులను సభలో ప్రతిపాదించారు.
బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్
మహిళలకు తులంబంగారం పథకాన్ని అమలు చేయకపోవడం, పింఛన్లు పెంచకపోవడానికి నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు బీఆర్ఎస్ సభ్యులు సునితా లక్ష్మారెడ్డి ప్రకటించారు. ఈ దశలో శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు జోక్యం చేసుకున్నారు. ఒక వైపు శాసనసభను మరో 15 రోజులు నడపాలని కొరుతూనే మాటిమాటికి ఎందుకు సభనుంచి వాకౌట్ చేస్తున్నారని ప్రశ్నించారు. సభా మర్యాదను పాటిస్తూ తీర్మానాన్ని అమోదించాలని కోరారు. మంత్రి మాటలు పట్టించుకోకుండా బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.



