Saturday, July 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఇంజినీరింగ్‌ బీ కేటగిరీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌

ఇంజినీరింగ్‌ బీ కేటగిరీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌

- Advertisement -

– రేపటినుంచి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
– ఆగస్టు 10 నాటికి సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలి
– ప్రయివేటు ఇంజినీరింగ్‌ కాలేజీలు మీడియాలో ప్రకటనలివ్వాలి
– మెరిట్‌ ప్రకారమే అభ్యర్థులకు సీట్లివ్వాలి: మార్గదర్శకాలు విడుదల చేసిన ఉన్నత విద్యామండలి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రయివేటు (మైనార్టీ, నాన్‌మైనార్టీ) ఇంజినీరింగ్‌, ఫార్మసీ కాలేజీల్లో బీ కేటగిరీలోని సీట్ల భర్తీకి శనివారం నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్‌ గురువారం మార్గదర్శకాలను విడుదల చేశారు. శనివారం నుంచి ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో నేరుగా దరఖాస్తుల సమర్పణ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. వచ్చేనెల బీ కేటగిరీ సీట్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని కాలేజీ యాజమాన్యాలను ఆదేశించారు. మూడు దినపత్రికల్లో (ఇంగ్లీష్‌, తెలుగు, ఉర్దూ) ఇంజినీరింగ్‌ కాలేజీ యాజమాన్యాలు బీ కేటగిరీ సీట్ల భర్తీకి సంబంధించి ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని సూచించారు. వచ్చిన దరఖాస్తుల వివరాలను ప్రతిరోజూ కాలేజీలోని నోటీసు బోర్డులో, వెబ్‌సైట్‌లో ప్రదర్శించాలని తెలిపారు. ఇంటర్మీడియెట్‌లో 45 శాతం (రిజర్వుడు కేటగిరీ వారికి 40 శాతం) మార్కులొచ్చిన విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్రంలోని ప్రయివేటు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 70 శాతం సీట్లు కన్వీనర్‌ కోటాలో, 30 శాతం సీట్లు బీ కేటగిరీలో భర్తీ అవుతాయని వివరించారు. ఇందులో నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్‌ (ఎన్‌ఆర్‌ఐ) కోటా కింద 15 శాతం, యాజమాన్య (మేనేజ్‌మెంట్‌) కోటా కింద 15 శాతం సీట్లు భర్తీ చేయాలని పేర్కొన్నారు. బీ కేటగిరీలోని సీట్ల వివరాలను బ్రాంచ్‌ల వారీగా ప్రకటించాలని ఆదేశించారు. జేఈఈ మెయిన్స్‌, ఎప్‌సెట్‌ ర్యాంకుల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయాలని వివరించారు. ఇంకా సీట్లు మిగిలితే ఇంటర్‌లో మార్కుల ఆధారంగా సీట్లివ్వాలని తెలిపారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి మెరిట్‌ ప్రకారమే సీట్లు భర్తీ చేయాలని కోరారు. బ్రాంచ్‌ వారీగా మెరిట్‌ జాబితాను ప్రకటించాలని సూచించారు. వచ్చేనెల పదో తేదీ నాటికి బీ కేటగిరీ సీట్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. అదేనెల 28 నాటికి భర్తీ చేసిన సీట్ల వివరాలను ఉన్నత విద్యామండలికి సమర్పించాలని సూచించారు.

ప్రముఖ ప్రయివేటు కాలేజీల్లో సీట్లు రిజర్వు
ఇప్పటికే కొన్ని ప్రముఖ ప్రయివేటు ఇంజినీరింగ్‌ కాలేజీ యాజమాన్యాలు సీట్లను రిజర్వు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాజమాన్యాలతో వేలాది మంది విద్యార్థులు సంప్రదించి సీట్లను ముందే పొందినట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా డిమాండ్‌ ఉన్న కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ) అనుబంధ బ్రాంచీల్లో ఎక్కువ మంది విద్యార్థులు సీట్లు రిజర్వు చేసుకున్నట్టు సమాచారం. నోటిఫికేషన్‌ విడుదలయ్యాక పద్ధతి ప్రకారం ఆ విద్యార్థులు దరఖాస్తు చేసినట్టు కాలేజీ యాజమాన్యాలు ప్రకటిస్తాయని విద్యావేత్తలు చెప్తున్నారు. యాజమాన్య కోటాకు సంబంధించి కాలేజీని బట్టి సీఎస్‌ఈ సీటు రూ.పది లక్షల నుంచి రూ.24 లక్షల వరకు డొనేషన్‌ వసూలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు, తల్లిదండ్రుల మధ్య బేరసారాలు పూర్తయినట్టు సమాచారం. సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మెషిన్‌ లెర్నింగ్‌, డేటాసైన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, సీఎస్‌ఈ ఐవోటీ, ఐటీ వంటి కోర్సులకు భారీగా డిమాండ్‌ ఉన్నది. ఈ కోర్సుల్లో చేరేందుకు ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తిని కనబరుస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కాలేజీ యాజమాన్యాలు అందినకాడికి దండుకుంటున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉన్న బలహీనతను క్యాష్‌ చేసుకుంటున్నాయి. ఉన్నత విద్యామండలి మార్గదర్శ కాలను బట్టి పత్రికల్లో నోటిఫికేషన్లు ఇవ్వడం, విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించినట్టు చేయడం నామమా త్రమేనని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -