Tuesday, July 15, 2025
E-PAPER
Homeజాతీయంఇక నూతన పౌరసత్వ పాలన !

ఇక నూతన పౌరసత్వ పాలన !

- Advertisement -

– బీహార్‌ నుంచి బెంగాల్‌ వరకూ ఇదే తంతు
– అడ్డదారిలో గెలిచేందుకు బీజేపీ కుయుక్తులు
– పౌరులపై అక్రమ వలసదారులు, బెంగాలీ ముస్లింల ముద్ర
– ఓటర్ల జాబితాల నుంచి భారీగా తొలగింపులు
– హిందూత్వమే ప్రాతిపదిక

కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం నూతన పౌరసత్వ పాలనకు శ్రీకారం చుడుతోంది. అందుకోసం బీహార్‌ నుంచి బెంగాల్‌ వరకూ…పలు రాష్ట్రాలలో ఓటర్ల జాబితాలను సవరిస్తోంది. అక్రమ వలసదారులు, విదేశీయులు అనే ముద్ర వేసి జాబితాల నుంచి పేదలు, దళితులు, ముస్లింలు వంటి అట్టడుగు వర్గాల ఓటర్లను తొలగిస్తోంది. ఎన్నడూ లేనిది ఇప్పుడు కొత్తగా పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన దుస్థితిలోకి పౌరులను నెట్టేస్తోంది. నిరూపించుకోలేకపోతే ‘అనుమానాస్పద’ ఓటర్లుగా నిర్ధారిస్తోంది. న్యాయస్థానాలు అక్షింతలు వేసినా ఎన్నికల కమిషన్‌ సాయంతో కేంద్రం దూకుడుగా వ్యవహరిస్తోంది.
న్యూఢిల్లీ : 2019లో నరేంద్ర మోడీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ఆమోదించిన తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ చట్టం మొదటిసారిగా భారత పౌరసత్వానికి మతపరమైన ప్రమాణాలను ముడిపెట్టింది. భారతీయులకు ఈ చట్టంతో సంబంధం లేదని ప్రభుత్వం చెప్పింది. మతపరమైన హింస కారణంగా పొరుగు దేశాల నుంచి భారత్‌కు వచ్చిన వారికి క్షమాభిక్ష ప్రసాదించేందుకే దీనిని ఉద్దేశించామని తెలిపింది. అయితే ప్రభుత్వ వాదనను అనేక మంది విశ్వసించడం లేదు. గతంలో బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించినప్పుడు అమిత్‌ షా ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ జాతీయ పౌరుల రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సీ) తర్వాతే సీఏఏను అమలు చేస్తామని ప్రకటించిన విషయాన్ని వారు గుర్తు చేశారు.


అసోంలో ఎన్‌ఆర్‌సీని చేపట్టగా లక్షలాది మంది ప్రజలు తమ పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు బీహార్‌లో కూడా అదే జరుగుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ముస్లిం వలసదారులను సీఏఏ నుండి మినహాయించారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీల కారణంగా తాము ఓటు హక్కును కోల్పోతామేమోనని ముస్లింలు కలవరపాటుకు గురయ్యారు. ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా వేలాది మంది వీధులలోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. దీంతో ఎన్‌ఆర్‌సీని చేపట్టే ప్రణాళిక ఏదీ లేదని ప్రభుత్వం స్పష్టం చేయాల్సి వచ్చింది.


అనుమానాస్పదం అవుతుందా?
బీహార్‌ దేశంలోనే అత్యంత నిరుపేద దేశం. అక్షరాస్యత కూడా చాలా తక్కువ. వీరిలో చాలా కొద్ది మంది వద్దే జనన ధృవీకరణ పత్రం, పాఠశాల ధృవీకరణ పత్రం ఉన్నాయి. దీంతో తమ గుర్తింపును, పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి లక్షలాది మంది ప్రస్తుతం నివాస ధృవపత్రాన్ని పొందే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఏ పత్రమైనా మూడు వారాల వ్యవధిలోనే పొందాల్సి ఉంటుంది. ఇంత స్వల్ప వ్యవధిలో ఇదంతా ఎలా సాధ్యమంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అసలు పౌరసత్వం నిర్ధారణ ఎన్నికల కమిషన్‌ పరిధిలో ఉన్నదా అని నిలదీసింది. ఈ అధికారం ఎన్నికల సంఘానికి లేదని, అది కేంద్ర హోం శాఖ చేయాల్సిన పని అని భవిష్యత్తులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా నష్టం తప్పదు. అవసరమైన పత్రాలను సకాలంలో సమర్పించని పక్షంలో బీహారీల పౌరసత్వం అనుమానాస్పదం అవుతుంది. వీరిలో ఎక్కువ మంది దళితులు, వెనుకబడిన వారు, ముస్లిం వర్గాలకు చెందిన పేదలు, అణగారిన ఓటర్లేనని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.


అసోం అనుభవాలు
‘అనుమానాస్పద’ ఓటర్లకు సంబంధించి అస్సాం అనుభవాలనే తీసుకుందాం. 1997లో జరిగిన ఎన్నికల జాబితాల సవరణ అనుమానాస్పద ఓటర్ల జాబితాను తయారు చేసింది. వీరందరినీ ఆ తర్వాత విదేశీయుల ట్రిబ్యునల్స్‌ ముందు నిలబెట్టారు. వీరిలో చాలా మంది వాదనలు కూడా వినకుండానే విదేశీయులుగా ముద్ర వేశారు. న్యాయస్థానాలు ఇచ్చిన ఏకపక్ష తీర్పులను సవాలు చేసేందుకు అవసరమైన వనరులను సేకరించుకోవడంలో విఫలమైన వారిని నిర్బంధ శిబిరాలకు పంపే ప్రమాదం పొంచి ఉంది. అంతకంటే దారుణమైన విషయమేమంటే అస్సాం నుంచి వందలాది మందిని సరిహద్దు దాటించి బలవంతంగా బంగ్లాదేశ్‌కు పంపడం. ఉపాధ్యాయులను, జాతీయ పౌరుల రిజిస్టరులో పేరున్న వృద్ధులను కూడా వదలడం లేదు. న్యాయస్థానాలు తుది తీర్పు ఇవ్వకపోయినా అనేక మందిని దేశం నుంచి బయటికి సాగనంపారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే వీరంతా బెంగాలీ మూలాలు ఉన్న ముస్లింలు, దేశ విభజనకు ముందు తూర్పు బెంగాల్‌ లేదా ప్రస్తుత బంగ్లాదేశ్‌లో మూలాలు కలిగిన సమాజానికి చెందిన వారు.


బెంగాలీ ముస్లింలే లక్ష్యంగా…
బెంగాలీ మూలాలున్న హిందువులను కూడా ఈ జాబితాలోనే చేర్చి అసోంలో విదేశీయులుగా ప్రకటించినప్పటికీ వారిని బహిష్కరించకుండా పౌరసత్వ సవరణ చట్టం కాపాడుతోందని తెలు స్తోంది. బెంగాలీ హిందువుల కేసులను పట్టించు కోవద్దంటూ గత సంవత్సరం అస్సాం ప్రభుత్వం సరిహద్దు పోలీసులను ఆదేశించింది. అంటే భవిష్యత్తులో బీహార్‌లోని అనుమానాస్పద ఓటర్లు కూడా మతం ఆధారంగా ఇలాంటి వివక్షనే ఎదుర్కొనే అవకాశం ఉందన్న మాటే కదా. గత కొన్ని నెలలుగా బీజేపీ పాలిత రాష్ట్రాలలో…పశ్చిమ బెంగాల్‌ నుండి వలస వచ్చిన వందలాది మంది ముస్లిం కార్మికులను అక్రమ వలసదారులనే పేరుతో పోలీసులు నిర్బంధిస్తున్నారు. బెంగాలీ మాట్లాడేవారంతా బంగ్లాదేశీయులేనని ఒడిశా పోలీసుల అభిప్రాయం. ఏదేమైనా బెంగాలీ ముస్లింలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయన్న అనుమానం బలపడుతోంది. బెంగాల్‌ గ్రామాల నుంచి వలస వచ్చినట్టు రుజువులు చూపినప్పటికీ పోలీసులు వారిని విడిచి పెట్టడం లేదు. ఢిల్లీ, మహారాష్ట్రలో పోలీసుల నిర్బంధంలో ఉన్న బెంగాలీ ముస్లిం కుటుంబాలను కూడా బంగ్లాదేశ్‌కు పంపుతున్నారు. బెంగాల్‌ ప్రభుత్వ జోక్యంతో వారందరినీ ఆ తర్వాత రాష్ట్రానికి తీసుకొచ్చారు.


పౌరసత్వ పరీక్ష
అయితే బహిరంగంగా చేయలేని పనిని మోడీ ప్రభుత్వం ఈ సంవత్సరం చాటుగా చక్కబెట్టింది. దీంతో దేశ ప్రజలకు తమ భారతీయతను నిరూపించు కోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. మొదటి దశలో కేంద్ర ఎన్నికల సంఘం బీహార్‌లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణను ప్రారంభిం చింది. ఇందుకోసం ప్రభుత్వం నియమించిన అధికారులనే ఉపయోగించుకుంటోంది. ఇది ఓ రకంగా ఆ రాష్ట్రంలోని లక్షలాది మందికి పౌరసత్వ పరీక్షగా మారింది. బీహార్‌లో సుమారు ఎనిమిది కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరందరూ గతంలో జరిగిన ఎన్నికలలో ఓటు వేసి ఉండవచ్చు. సవరించిన ఓటర్ల జాబితాలో తమ పేరు ఉండాలంటే ఇప్పుడు వారంతా ఈ నెల 25 లోగా ఓ పత్రాన్ని నింపాల్సి ఉంటుంది.


ఏం చేయాలంటే…
2003 నాటి ఓటర్ల జాబితాలో పేరు లేని 2.9 కోట్ల మంది పౌరులు ఇప్పుడు వారి గుర్తింపును, పౌరసత్వాన్ని అదనంగా నిరూపించుకోవాల్సి ఉంటుంది. 40 సంవత్సరాల వయసు దాటిన ఓటర్లు తమ పుట్టిన తేదీ, నివాస ప్రాంతాన్ని నిర్ధారించే పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. 40 సంవత్సరాల లోపు వారు మరింత కఠినమైన పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారు 2004కు ముందు జన్మించి ఉంటే తమ తల్లిదండ్రులలో ఎవరో ఒకరి పౌరసత్వాన్ని నిరూపించాలి. అదే 2004 తర్వాత జన్మిస్తే తల్లిదండ్రులు ఇద్దరి పౌరసత్వాన్నీ నిరూపించాల్సి ఉంటుంది. దీనికి 2003లో బీజేపీ ప్రభుత్వం చేసిన పౌరసత్వ చట్ట సవరణే కారణం. ఒక్క మాటలో చెప్పాలంటే పుట్టుకే కాకుండా వంశపారంపర్యం కూడా పౌరసత్వానికి ఆధారం కాబోతోంది.


హిందూత్వమే ప్రాతిపదిక
బీహార్‌, అస్సాం, బెంగాల్‌ తదితర ప్రాంతాలలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఓ పద్ధతి ప్రకారం నూతన పౌరసత్వ పాలనను సృష్టించేందుకు బీజేపీ పెద్దలు చట్టాన్ని, అధికారాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో స్పష్టమవుతుంది. హిందూత్వ ప్రాతిపదికన భారతీయులుగా గుర్తించని వారిని దుర్బలులుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారు తమ ఓటు హక్కును కోల్పోతారు. అంతేకాక వారిని రాత్రికి రాత్రే దేశం నుండి వెళ్లగొట్టే అవకాశమూ ఉంది. ఇటీవలి ఆదేశాల కారణంగా న్యాయస్థానాలు కూడా వారిని కాపాడలేవు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -