దళాలను మోహరిస్తున్న అమెరికా
చర్చలంటూనే ఇదేం పని ? : నిలదీసిన టెహ్రాన్
ఇరాన్ దాడిలో కీలక నిఘా విమానాన్ని కోల్పోయిన అగ్రరాజ్యం
నవతెలంగాణ – సెంట్రల్ డెస్క్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఓ వైపు చర్చల మంత్రం పఠిస్తూనే మరోవైపు మధ్యప్రాచ్యానికి అదనపు దళాలను తరలిస్తోంది. తద్వారా భూతల దాడులు మొదలు పెడతామంటూ సంకేతాలు ఇస్తోంది. తాజాగా సుశిక్షితులైన మూడున్నర వేల మంది సైనికులు, నావికులను ఆ ప్రాంతంలో మోహరించింది. దీంతో ఇప్పుడు అక్కడ మకాం వేసిన అమెరికా సేనల సంఖ్య యాభై వేలకు చేరుకుంది. పశ్చిమాసియాలో అమెరికా సేనలు ఈ స్థాయిలో యుద్ధ సన్నాహాలు చేయడం గత ఇరవై సంవత్సరాల కాలంలో ఇదే మొదటిసారి. చర్చలు, దౌత్యం ద్వారా విభేదాలను పరిష్కరించుకుందామని చెబుతున్న అమెరికా తాజాగా భూతల దాడులకు కుట్ర పన్నుతోందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఘలీబాఫ్ ఆరోపించారు.
మధ్యప్రాచ్యానికి చేరుకున్న సైనిక పటాలం
అమెరికా సైనిక పటాలం యూఎస్‌ఎస్ ట్రిపోలీ నౌకలో మధ్యప్రాచ్యానికి చేరుకుంది. ఈ విషయాన్ని యూఎస్ సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. ‘అమెరికా నావికులు, సుశిక్షితులైన సైనికులు ప్రత్యేక విధుల నిమిత్తం యూఎస్‌ఎస్ ట్రిపోలీ నౌకలో ఈ నెల 27వ తేదీన సెంట్రల్ కమాండ్ ప్రాంతానికి చేరుకున్నారు’ అని శనివారం పొద్దుపోయిన తర్వాత సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో తెలియజేసింది. దళాలు పూర్తి యుద్ధ సన్నాహాలతో ఉన్నాయంటూ కొన్ని చిత్రాలను కూడా విడుదల చేసింది.
ఇదిలావుండగా యూఎస్‌ఎస్ బాక్సర్‌తో పాటు మరో రెండు నౌకలను, శాన్ డియాగో నుంచి అదనంగా ఓ మెరైన్ ఎక్స్‌పెడిషనరీ యూనిట్‌ను కూడా మధ్యప్రాచ్యానికి పంపాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ పరిణామాలను గమనిస్తే… ఇప్పటివరకూ వైమానిక, క్షిపణి దాడులకే పరిమితమైన అమెరికా ఇక దీర్ఘకాల పోరుకు భూతల దాడులకూ సిద్ధంగా ఉన్నదన్న సంకేతాలు కన్పిస్తున్నాయి. అయితే దీనిపై ట్రంప్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా ఇరన్ దక్షిణ తీరంలోని ఖర్గ్ దీవిని ఆక్రమించుకునేందుకు దానికి సమీపంలోనే అమెరికా సేనలు మోహరించి ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.
కొనసాగుతున్న దాడులు
బV్‌ారైన్, యూఏఈలలో అమెరికా సైన్యానికి చెందినవిగా భావిస్తున్న రెండు అల్యూమినియం కర్మాగారాలపై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ దాడి చేసింది. మరోవైపు ఇజ్రాయిల్‌లోని వివిధ ప్రాంతాలపై కూడా ఇరాన్ క్షిపణి దాడులు జరిపింది. మరోవైపు ఇరాన్‌లో ప్రాధాన్యత కలిగిన లక్ష్యాలపై త్వరలోనే దాడులు చేస్తామని ఇజ్రాయిల్ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల తయారీ కేంద్రాలు, అణు కేంద్రాలు, కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలపై మరిన్ని దాడులు చేస్తానని చెప్పింది.
భారత్ వైపు కదులుతున్న రెండు ఎల్పీజీ నౌకలు
బీడబ్ల్యూ టీవైఆర్, బీడబ్ల్యూ ఈఎల్‌ఎం అనే రెండు నౌకలు ఎల్పీజీతో భారత్ వైపు కదులుతున్నాయి. ఈ నౌకలలో 94,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉంది. నౌకలు సురక్షితంగా హర్మూజ్‌ను దాటి మన దేశం వైపు వస్తున్నాయని ప్రభుత్వం తెలియజేసింది. ‘బీడబ్ల్యూ టీవైఆర్ నౌక ముంబయి వస్తోంది. ఇది మంగళవారం అక్కడికి చేరుకోవచ్చు. బీడబ్ల్యూ ఈఎంఎల్ నౌక బుధవారం న్యూ మంగళూరు చేరుకుంటుంది. భారత పతాకంతో ఉన్న 18 నౌకలు ప్రస్తుతం హార్ముజ్ జలసంధి పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి. వీటిలో 485 మంది సిబ్బంది ఉన్నారు. ఫిబ్రవరి 28న… అంటే యుద్ధం ప్రారంభమైన రోజు నుంచి ఇప్పటి వరకూ 5.24 లక్షల మంది ప్రయాణికులు భారత్ చేరుకున్నారు’ అని ప్రభుత్వం ఒక ప్రకటనలో వివరించింది.
ఇరాన్‌లో వైద్యసేవలు విస్తృతం
ఇరాన్‌పై ఇటీవల జరిగిన అమెరికా-ఇజ్రాయిల్ సంఘర్షణలో సంభవించిన ప్రాణనష్టానికి సంబంధించిన తాజా గణాంకాలను ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. యుద్ధం ప్రారంభమైన 30వ రోజు నాటికి, మొత్తం 24,742 మంది క్షతగాత్రులకు చికిత్స అందించి, ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి చేసినట్టు ఆ మంత్రిత్వ శాఖ నివేదించింది. మరణాలు, గాయాలు, దేశ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టానికి సంబంధించిన కొత్త వివరాలను కూడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, టెహ్రాన్, హారుజ్‌గాన్ ప్రావిన్సుల్లో అత్యధికసంఖ్యలో మరణాలు నమోదయ్యాయి.
క్షతగాత్రుల్లో 4,255 మంది మహిళలు కాగా, 1,767 మంది ఎనిమిదేండ్ల లోపు పిల్లలు ఉన్నారు. వైౖద్య, అత్యవసర సహాయక బృందాలకు చెందిన 114 మంది సిబ్బంది గాయపడ్డారని, అలాగే సంక్షోభ నివారణ చర్యలలో ముందుండి పనిచేసిన 24 మంది ఆరోగ్య కార్యకర్తలు తమ ప్రాణాలను కోల్పోయారని ఈ నివేదిక పేర్కొంది. అంతేకాకుండా, మరణించిన వారిలో 246 మంది మహిళలు, 18 ఏండ్లలోపు పిల్లలు 216 మంది, ఐదేండ్లలోపు పిల్లలు 17 మంది ఉన్నారు. ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలకు భారీ నష్టం వాటిల్లినట్టు కూడా నివేదించబడింది. మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం, 51 అత్యవసర కేంద్రాలు, 41 వైద్య కేంద్రాలు , 199 ఆరోగ్య సదుపాయాలు,40 అంబులెన్స్‌లు దెబ్బతిన్నాయని వెల్లడించింది.
పాకిస్తాన్ పతాక నౌకలకు ఇరాన్ అనుమతి
హäర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించేందుకు పాకిస్తాన్ పతాకమున్న 20 నౌకలను ఇరాన్ అనుమతించింది. ప్రతి రోజూ రెండు నౌకలు జలసంధిని దాటతాయని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చెప్పారు. ఉద్రిక్తత లను నివారించి సుస్థిరతను సాధించేందుకు ఈ పరిణామం ఉపకరిస్తుందని తెలిపారు. ఇరాన్, పాకిస్తాన్ మధ్య ఇటీవల జరిగిన దౌత్య చర్చల ఫలితంగా ఈ ప్రకటన వెలువడింది. దార్ ఇటీవలే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో టెలిఫోన్ సంభాషణ జరిపారు. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను నివారించే విషయంలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
మినాబ్‌పై దాడికి బాధ్యులు వీరే
ఇరాన్‌లోని ఓ బాలికల పాఠశాలపై అమెరికా జరిపిన క్షిపణి దాడిపై అంతర్జాతీయంగా తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా క్షిపణిని ప్రయోగించిన ఇద్దరు అమెరికా నౌకాదళ అధికారుల ఫొటోలను ఇరాన్ విడుదల చేసింది. చిన్నారుల మృతికి వీరే బాధ్యులంటూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది. పాఠశాలపై జరిగిన దాడిలో 168 మంది పిల్లలు, 14 మంది ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. దాడికి పాల్పడిన యుద్ధ నౌక ఎగ్జిక్యూటివ్ అధికారి జెఫ్రీ యీ యార్క్, కమాండింగ్ అధికారి లీ ఆర్ టేట్ ఫొటోలను భారత్, దక్షిణాఫ్రికా, నైజీరియాలలోని ఇరాన్ రాయబార కార్యాలయాలు విడుదల చేశాయి. ఈ ఇద్దరు నేరస్థులు మూడు సార్లు తోమహాక్ క్షిపణులను ప్రయోగించారని, 168 మంది చిన్నారుల మరణానికి కారకులయ్యారని విమర్శించాయి.
పశ్చిమాసియా ఉద్రిక్తతలపై పాక్‌లో చర్చలు
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఆదివారం చర్చలు మొదలయ్యాయి. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఈజిప్ట్, తుర్కియేలకు చెందిన సహచర మంత్రులతో భేటీ అయ్యారు. సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి కూడా తదుపరి చర్చల్లో భాగస్వామి అవుతారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై పాకిస్తాన్, ఈజిప్ట్ మంత్రులు పరస్పరం అభిప్రాయాలు తెలుపుకున్నారు. సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను నివారించాలని, వివాదాలను చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని వారు సూచించారు. దార్ ఆహ్వానం మేరకు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సాద్, తుర్కియే విదేశాంగ మంత్రి హకన్ ఫిదన్, ఈజిప్ట్ విదేశాంగ మంత్రి బర్ అబ్దెలాటీలు ఇస్లామాబాద్ లో పర్యటిస్తున్నారు.
వర్సిటీలనూ వదలడం లేదు
పరిశోధనా కేంద్రాలు, చారిత్రక కట్టడాలపై ఉద్దేశపూర్వకంగా దాడులు
కొందరు ప్రముఖ శాస్త్రవేత్తలపై కూడా టార్గెట్
ఇరాన్ సైనిక స్థావరాలు, జనావాసాలు, పౌర మౌలిక సదుపాయాలే కాదు… అమెరికా-ఇజ్రాయిల్ సేనలు అక్కడి యూనివర్సిటీలను కూడా వదలడం లేదు. తమ యూనివర్సిటీలు, పరిశోధనా కేంద్రాలు, చారిత్రక కట్టడాలపై ఉద్దేశపూర్వకంగానే దాడులు జరుగుతున్నాయని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఖై ఆరోపించారు. గత నెల రోజుల్లో ఇస్ఫహాన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, ఇరాన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సహా పలు వర్సిటీలపై దాడులు జరిగాయని ఆయన తెలిపారు. ఇరాన్ శాస్త్ర పునాదులను, సాంస్కృతిక వారసత్వాన్ని ధ్వంసం చేయడమే ఈ దాడుల లక్ష్యమని ఆయన మండిపడ్డారు. కొందరు ప్రముఖ శాస్త్రవేత్తలపై కూడా యుద్ధోన్మాదులు దాడులు చేశారని చెప్పారు.
విద్యార్థులు, విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలపై దాడులు చేయడం ద్వారా ఇరాన్ భవిష్యత్‌ను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ఈ దాడులు చేస్తున్నారని ప్రభుత్వ సమాచార మండలి అధిపతి ఎల్యాస్ హజ్రతి విమర్శించారు. ఇరాన్ చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని లక్ష్యంగా చేసుకొని మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే ఇజ్రాయిల్-అమెరికా ఉద్దేశమని మండిపడ్డారు. కాగా తమ విద్యాసంస్థల జోలికి వస్తే మధ్యప్రాచ్యంలోని అమెరికా లేదా ఇజ్రాయిల్ యూనివర్సిటీలపై ప్రతీకార దాడులు చేస్తామని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) హెచ్చరించింది. ఆయా సంస్థలను తమ ‘చట్టబద్ధమైన లక్ష్యాలు’గా ఎంచుకుంటామని తెలిపింది.
కీలక నిఘా వ్యవస్థను కోల్పోయిన అమెరికా
ఈ-3 సెంట్రీ ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (అవాక్స్)కు దెబ్బ
మరమ్మతులకు పనికిరాని స్థావరం
సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై రెండు రోజుల క్రితం ఇరాన్ జరిపిన క్షిపణి, డ్రోన్ దాడిలో అమెరికాకు చెందిన ఈ-3 సెంట్రీ ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (అవాక్స్) నిఘా యుద్ధ విమానం సహా పలు విమానాలు దెబ్బతిన్నాయని అమెరికా, అరబ్ అధికారులను ఉటంకిస్తూ వాల్‌స్ట్రీట్ జర్నల్, ఎయిర్ అండ్ స్పేస్ మ్యాగజైన్ తెలిపాయి. యుద్ధ విమానానికి (రూ.6,600 కోట్లు) తీవ్ర నష్టం జరిగిందని, ఇక ఆ స్థావరం మరమ్మతులకు కూడా పనికిరాదని తెలుస్తోంది.
ఈ-3 సెంట్రీ అనేది కేవలం యుద్ధ విమానమే కాదు. దానిలోని వ్యవస్థ యుద్ధ క్షేత్రంలో దళాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంటుంది. దీనిని ‘ఎగిరే కమాండ్ సెంటర్’ అని అంటారు. గగనతలంలో వందలాది మైళ్ల దూరాన్ని అవాక్స్ నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఇరాన్ నుంచి దూసుకొచ్చే డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలను పసిగట్టి సకాలంలో సేనలకు సమాచారం ఇస్తుంది. క్షిపణులు, డ్రోన్లపై నిఘా వేయడంతో పాటు వాటిని అడ్డుకునే సామర్ధ్యం కూడా ఈ వ్యవస్థకు ఉంది. అందుకే ఆధునిక యుద్ధ క్షేత్రంలో దీనిని అత్యంత కీలకమైన ఆస్తిగా పరిగణిస్తారు. దీనిని కోల్పోవడం అమెరికా సేనలకు పెద్ద ఎదురు దెబ్బగానే భావిస్తున్నారు.
యుద్ధోన్మాదానికి చిన్నారులు బలి
జనావాసాలపై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు
యుద్ధనీతి ప్రకారం వార్ కొనసాగాల్సి ఉండగా.. దానికి అమెరికా, ఇజ్రాయిల్‌లు తూట్లు పొడుస్తున్నాయి. కేవలం ఇరాన్‌లోని చమురు నిక్షేపాలను దక్కించుకోవటానికి చర్చ లంటూనే దాడులకు దిగుతూ జనావాసా లపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇరాన్ మాత్రం ప్రతీకార చర్యలు గల్ఫ్‌దేశాల్లోని అమెరికా సైనిక స్థావ రాలపైనే గురిపెడుతోంది. అమెరికా-ఇజ్రాయిల్ దళాల యుద్ధోన్మాదం వందలాది మంది చిన్నారుల ప్రాణాలను బలిగొంటోంది. మరెంతో మంది పిల్లలను ఆస్పత్రుల పాలు చేస్తోంది. వారిలో ఆరేండ్ల అమిర్ హుస్సేన్ ఒకరు. పది రోజుల క్రితం…అంటే ఈ నెల 18వ తేదీ రాత్రి టెహ్రాన్‌లో ఆ బాలుడి కుటుంబం నివసిస్తున్న ఇంటిపై అమెరికా- ఇజ్రాయిల్ సేనలు వైమానిక దాడి జరిపారు.
అది సైనిక లక్ష్యం కాదు.. పైగా ముందస్తు హెచ్చరికలూ లేవు. అక్కడ అనేక నివాస భవనాలు ఉన్నాయి. ఒక్కసారిగా జరిగిన దాడి కారణంగా భారీ పేలుడు సంభవించింది. క్షణాల వ్యవధిలోనే అమిర్ హుస్సేన్ ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. తీవ్ర గాయాలతో బతికి బయట పడిన అమిర్ హుస్సేన్‌ను ఆ మరుసటి రోజు ఉదయమే మొఫిద్ ఆస్పత్రిలో చేర్చారు. పదేండ్ల వయసున్న అతని సోదరి ఆ దాడిలో చనిపోయింది. అతని తల్లిదండ్రులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే వారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అమిర్ హుస్సేన్ మాత్రం ఇంకా ఐసీయూలోనే చికిత్స పొందుతున్నాడు.
యుద్ధం ప్రారంభమైన నెలరోజులు పూర్తయ్యాయి. మృతులు, క్షతగాత్రుల సంఖ్యపై అధికారికంగా ఎలాంటి సమా చారం అందనప్పటికీ అది ఎక్కువగానే ఉంటుందని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వార్తలు సూచిస్తున్నాయి. ముఖ్యం గా అభంశుభం తెలియని పిల్లలు మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది. జనావాస ప్రాంతాలపై జరుగుతున్న దాడులలో ప్రాణనష్టం అధికంగా ఉంటోంది. సంఘటనా స్థలంలోనే అనేక మంది చిన్నారులు ప్రాణాలు విడు స్తున్నారు. ఒకవేళ బతికి ఉన్నా చావుబతుకుల మధ్య ఆస్పత్రుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. తీవ్ర గాయాలతో వస్తున్న వారికి చికిత్స అందించడం వైద్యులకు సవాలుగా మారింది. వారు కోలుకునేందుకు చాలా కాలం పడుతుందని, అది కూడా ఏమీ చెప్పలేని పరిస్థితి అని వైద్యులు తెలిపారు.
యుద్ధమంటే వ్యూహాలు, లక్ష్యాలతో కూడుకు న్నది. అయితే మధ్యప్రాచ్యంలో మాత్రం ప్రజలు సర్వం కోల్పోయి రోడ్డున పడుతున్నారు. తినడానికి తిండి లేదు… ఉండడానికి ఇల్లు లేదు… కట్టుకోవడానికి బట్టలు లేవు… వారి దయనీయ స్థితిని చూస్తుంటే రాతి గుండె అయినా కరిగిపోవాల్సిందే. ఆరు నెలల వయసున్న పసికూనలు కూడా గాయాలతో ఆస్పత్రులకు చేరుతున్నారు. కొందరు ఆస్పత్రికి తరలించే లోగానే చనిపోతున్నారు. ఆస్పత్రుల వద్ద తరచూ వినిపిస్తున్న మాటలేమిటంటే… గాయాలు తీవ్రంగా ఉన్నాయి. పరిస్థితి విషమంగా ఉంది. సంఘటనా స్థలంలోనే కన్నుమూస్తున్న వారి సంఖ్య అధికంగానే ఉంటోంది. లక్ష్యాలను ఆవల దాడులు జరుగుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. జనావాసాలు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులు తీవ్రమవుతున్నాయి.



