పుస్తక ప్రియులకు పండుగొచ్చింది
రేపటి నుంచి డిసెంబర్ 29 వరకు బుక్ ఫెయిర్
13 రాష్ట్రాలు.. 365 స్టాళ్లు
పఠనంపై ప్రజల్లో జిజ్ఞాస, ఆసక్తి పెరుగుతోంది
ప్రాంగణానికి అందెశ్రీ..ప్రధాన వేదికకు అనిశెట్టి రజిత పేర్లు
300లకుపైగా కొత్త రచయితల పరిచయం.. 150 కొత్త పుస్తకాల ఆవిష్కరణ
ఎలాంటి ఇబ్బందిలేకుండా అన్ని సౌకర్యాలు
రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం
ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, యువత, మహిళలు తరలి రండి
నవతెలంగాణ ఇంటర్వ్యూలో బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యాకుబ్, ఆర్. వాసు వెల్లడి
పాఠకులకు పుస్తక పఠనం పట్ల రోజురోజుకీ ఆసక్తి, జిజ్ఞాస పెరుగుతోందని హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షులు, కవి యాకుబ్, ప్రధాన కార్యదర్శి ఆర్.వాసు వెల్లడించారు. సామాజిక మాద్యమాల జోరులోనూ పాఠకులకు పుస్తక పఠనంపై ఏ మాత్రం మమకారం తగ్గలేదని తెలిపారు. బుక్‌ఫెయిర్‌తో పుస్తకప్రియులకు పండగ రాబోతున్నదని చెప్పారు. ప్రతియేటా డిసెంబర్‌లో నిర్వహించే హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌లో ఈసారి ఎన్నో విశేషాలున్నాయని తెలిపారు. అక్షర జాతరకు ఐటీ ఉద్యోగులు, యువత, విద్యార్థులు, మహిళలు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉందని చెప్పారు. అందుకనుగుణంగా అక్షర జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్నామన్నారు. 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ డిసెంబర్ 19 నుంచి 29 వరకు ఎన్టీఆర్ స్టేడియం కళాభారతిలో నిర్వహిస్తున్న నేపథ్యంలో ‘నవతెలంగాణ’కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.
హైదరాబాద్ బుక్‌ఫెయిర్ ఏర్పాట్లు ఎలా?
పాఠకులు అక్షరాలతో స్నేహం చేసేందుకు అలవాటు పడ్డారు. బుక్ ఫెయిర్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ప్రతి రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు కొనసాగుతున్నది. బుక్‌ఫెయిర్‌ను శుక్రవారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటకశాఖమంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించనున్నారు. హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, సుప్రీంకోర్టు మాజీ న్యాయ మూర్తి సుదర్శన్‌రెడ్డి తదితర ప్రముఖులు హాజరు కానున్నారు. గతేడాది 10 లక్షల మంది బుక్ ఫెయిర్‌ను సందర్శించారు. ఈ సారి 12 నుంచి 15 లక్షల మంది సందర్శించే అవకాశం ఉందని అంచనా. గతేడాది ఎదురైన అనుభవాలే పాఠాలుగా ఈసారి మరింత మెరుగ్గా సౌకర్యాలను కల్పించాం. పిల్లలు, వృద్ధులు, మహిళలు… ఇలా అన్ని వయస్సుల వారిని దృష్టిలో పెట్టుకుని బుక్‌ఫెయిర్‌ను నిర్వహించబోతున్నాం.
సందర్శలకు కల్పించే సౌకర్యాలేంటి?
బుక్‌ఫెయిర్‌కు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. బుక్‌ఫెయిర్‌కు ఇరువైపులా టాయిలెట్లు ఏర్పాటు చేశాం. ఈసారి అధిక సంఖ్యలో పాఠకులు వచ్చే అవకాశం ఉండటంతో ఈ చర్యలు తీసుకున్నాం. స్టాల్స్ నిర్వాహకులకు ఎప్పటిలాగే టీ, స్నాక్స్ అందించనున్నాం. ఆవరణలో పుస్తక ప్రియుల కోసం ఫుడ్‌స్టాల్స్ ఏర్పాటయ్యాయి. ఈసారి ఫుడ్ స్టాల్స్ పెంచాం. కుటుంబాలు, స్నేహితులు, బంధువులతో వచ్చి వివిధ రాష్ట్రాల రుచులను ఆస్వాదించనున్నారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా టెండర్లు పిలిచి సొసైటీ ధరలను నిర్ణ యించింది. స్వీట్లు, మాడుగుల హల్వాకు పెట్టింది పేరు. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫ్రూట్ బౌల్ వంటివి ప్రవేశంలోనే ఏర్పాటు చేశాం. సందర్శకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అక్కడే హెల్త్ క్లినిక్ పాయింట్ కూడా అందుబాటులో ఉంది. పుస్తకాల పట్ల మమకారం పెంచుకున్న వృద్ధులు ఇబ్బంది పడకుండా వీల్ చైర్లు, సహాయకులను అందుబాటులో ఉంచాం. మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా రూమ్ కేటాయించాం.
ఎలాంటి పుస్తకాలు లభిస్తాయి? దేశ స్వాతంత్య్ర సంగ్రామం, తెలంగాణ సాయుధపోరాట చరిత్రకు సంబంధించిన పుస్తకాలు ఉంటాయా?
ఇక్కడ అన్ని రకాల పుస్తకాలు లభిస్తాయి. కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని రెచ్చగొట్టేలా ఉండే సాహిత్యా నికి ఇక్కడ తావులేదు. ఇతరుల మనోభావాలను కించపరిచేలా ఉన్న పుస్తకాలకు బుక్ ఫెయిర్‌లో చోటులేదు. గతేడాది చోటుచేసుకున్న దురదృష్ట్టకర ఘటన నేపథ్యంలో ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. తెలంగాణ చరిత్ర, భాష, యాస, సంస్కృతి, సంప్రదాయాలకు బుక్‌ఫెయిర్ తగిన ప్రాధాన్యతనిస్తోంది. వీటి కోసం 10 నుంచి 12 స్టాళ్లు కేటాయించాం. రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ స్టాల్స్ ఉన్నాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో పుస్తకాలతో ‘మంచి పుస్తకం స్టాల్’ ఆకర్షించనుంది. ముఖ్యంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సంబంధించి, దేశ స్వాతంత్య్ర సంగ్రామానికి సంబంధించి వేలాది పుస్తకాలు లభిస్తాయి. దేశ చరిత్ర, రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలకు సంబంధించి విశ్లేషణలకు సంబంధించి 10 లక్షలకుపైగా పుస్తకాలుంటాయి.
ప్రవేశ రుసుం ఎంత వసూలు చేస్తున్నారు?
హైదరాబాద్ బుక్ ఫెయిర్ సందర్శనకు ప్రవేశ రుసుం రూ.10 వసూలు చేస్తాం. విద్యార్థులు తమ ఐడెంటి కార్డు చూపిస్తే ఉచిత ప్రవేశం కలిస్తాం. వారితోపాటు ఉపాధ్యాయులకు ఉచిత ప్రవేశం. దాదాపు 50వేల ఉచిత పాస్‌లు పంపిణీ చేశాం. బుక్ ఫెయిర్ సందర్శనకు హైదరాబాద్ నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా విద్యార్థులు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అనేక పాఠశాలు ప్లాన్ చేసుకుంటున్నాయి. సూర్యాపేట జిల్లాలో ఒక పాఠశాల నుంచి 800 మంది విద్యార్థులు ఒకేసారి 10 నుంచి 12 బస్సుల్లో బుక్ ఫెయిర్‌కు రానున్నారు. ఇప్పటికే నిర్వాహకుల అనుమతి తీసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని రకాల పుస్తకాలు ఒకే చోటకు తెచ్చిన బుక్ ఫెయిర్ అందరిని ఆకర్షించనుంది.
రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎలా ఉంది?
బుక్ ఫెయిర్‌కు రాష్ట్ర ప్రభుత్వ సహకారం సంపూర్ణంగా ఉంది. వివిధ విభాగాల్లో తీసుకున్న కార్యకలాపాలు, సాధించిన విజయాలను తెలియ జేస్తూ కొన్ని స్టాళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బుక్ ఫెయిర్‌ను ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేశారు.
ఈసారి బుక్‌ఫెయిర్ ప్రత్యేకతలేంటి?
ఈసారి బుక్‌ఫెయిర్‌కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. పిల్లలను దృష్టి ఉంచుకుని ఏర్పాటు చేసిన స్థలంలో ఆట వస్తువులను, పరికరాలను పెట్టాం. చార్మినార్ నమూనా ఏర్పాటు చేసి అక్కడ సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశాం. ఒక ప్రధాన వేదిక, రెండు పుస్తకావిష్కరణ వేదికలను ఏర్పాటు చేశాం. ప్రధాన వేదిక మీద సాంస్కృతిక కార్యక్రమాలు, బాలోత్సవ ప్రదర్శనలుంటాయి. ప్రతిరోజు నచ్చిన, స్ఫూర్తినిచ్చిన ‘పుస్తకం పేరు’తో కార్యక్రమాలను నిర్వహించనున్నాం. తొలిరోజు ప్రముఖ దర్శకులు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ఈసారి పైరసీ, సెకండ్ హ్యాండ్ పుస్తకాల దుకాణాలకు అవకాశం కల్పించలేదు.
తక్కువ పుస్తకాలు రాసిన రచయితలు వాటిని విక్రయించుకునేందుకు బుక్ ఫెయిర్ ఎంతో దోహదపడుతున్నది. వారి కోసం గేట్ పక్కనే రైటర్స్ టేబుల్స్ ఏర్పాటయ్యాయి. దీంతో జాతీయ, అంతర్జాతీయ పుస్తక విక్రేతలు భాగస్వాములయ్యారు. బుక్ ఫెయిర్ ప్రాంగణానికి తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ పేరు నామకరణం చేశాం. ప్రధాన వేదికకు రచయిత్రి అనిశెట్టి రజిత, పుస్తకావిష్కరణ వేదికకు కొంపల్లి వెంకట్ గౌడ్, రచయితల స్టాల్‌కు ప్రొఫెసర్ ఎస్వీ రామారావు, మీడియా స్టాల్స్‌కు స్వేచ్ఛ వోటార్కర్‌గా నామకరణం చేశాం. మొత్తం 365స్టాళ్లుండగా, అందులో 20 ప్రభుత్వ స్టాళ్లు, 10 రచయితల స్టాళ్లు, మరో 10 మీడియా స్టాళ్లున్నాయి.



