నేటి నుంచి సూపర్8 మ్యాచ్‌లు
ఐసీసీ 2026 టీ20 ప్రపంచకప్
పొట్టి ప్రపంచకప్‌లో తొలి అంకం ముగిసింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో తొలిసారి 20 జట్లు పోటీపడుతుండగా.. టైటిల్ వేటలో ఎనిమిది జట్లే మిగిలాయి. శుక్రవారంతో గ్రూప్ దశ మ్యాచ్‌లు ముగియగా 12 జట్లు ఇంటిబాట పట్టాయి. మాజీ చాంపియన్, అగ్రజట్టు ఆస్ట్రేలియా సహా అఫ్గనిస్తాన్‌లు గ్రూప్ దశ నుంచే ఇంటి బాట పట్టాయి. సెమీఫైనల్ బెర్తులు దక్కించుకునేందుకు టాప్-8 జట్టు నేటి నుంచి సూపర్ సవాల్‌కు సిద్ధమవుతున్నాయి. సూపర్8 దశలో నేడు గ్రూప్-2లో పాకిస్తాన్, న్యూజిలాండ్ తలపడనున్నాయి.
నవతెలంగాణ-ముంబయి
టీ20 ప్రపంచకప్‌లో 20 జట్లు పోటీపడేలా ఐసీసీ ప్రణాళికలు రూపొందించగా.. పొట్టి పోరులో ఉత్కంఠ తగ్గుతుందేమో అనే ఆందోళన అభిమానుల్లో కనిపించింది. కానీ, 2026 టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశ మ్యాచ్‌లు ఆ అంచనాలను తలకిందులు చేసింది. గ్రూప్ దశ మ్యాచ్‌ల్లో పసికూనలు, చిన్న జట్లు ట్యాగ్‌తో బరిలోకి దిగిన యుఏఈ, నేపాల్, ఇటలీ, జింబాబ్వే, నెదర్లాండ్స్‌లు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆస్ట్రేలియా, శ్రీలంకలతో కలిసి గ్రూప్-బిలో నిలిచిన జింబాబ్వే.. ఏకంగా సూపర్8 బెర్త్‌ను దక్కించుకోవటం పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉత్కంఠభరిత మ్యాచ్‌లు, సంచలన ఫలితాలు, అగ్రజట్ల వెన్నులో వణుకు పుట్టించే పోటీతత్వం గ్రూప్ దశను విజయవంతం చేశాయి. 12 జట్లు టైటిల్ వేట నుంచి తప్పుకోగా.. 8 జట్లు తాడోపేడో తేల్చుకునేందుకు ఎదురుచూ స్తున్నాయి. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో సూపర్8 మ్యాచ్‌లు నేటి నుంచి ఆరంభం కానున్నాయి.
అజేయుల గ్రూప్!
సూపర్8లో గ్రూప్-1 సమీకరణాలు అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. గ్రూప్-1లో ఆతిథ్య భారత్ సహా దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే ఉన్నాయి. గ్రూప్ దశలో ఈ నాలుగు జట్లు అజేయం గా నిలువటం విశేషం. గ్రూప్-ఏలో భారత్, గ్రూప్-బిలో జింబాబ్వే, గ్రూప్-సిలో వెస్టిండీస్, గ్రూప్-డిలో దక్షిణాఫ్రికాలు ఓటమి చవిచూడలేదు. దీంతో సూపర్8లో ఈ గ్రూప్‌లో పోటీ తీవ్రంగా ఉండనుంది. ఆస్ట్రేలియాను కంగుతి నిపించి సూపర్8కు చేరుకున్న జింబాబ్వేను తేలిగ్గా తీసుకునేందుకు ఇతర జట్లు ఏమాత్రం సిద్ధంగా లేవు. డిఫెండింగ్ చాంపియన్ భారత్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుండగా.. వెస్టిండీస్, దక్షిణాఫ్రికాలు గట్టి సవాల్ విసిరేందుకు ఎదురు చూస్తున్నాయి.
సూపర్8 గ్రూప్-2లో పాకిస్తాన్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక నిలిచాయి. ఈ నాలుగు జట్లు గ్రూప్ దశలో ద్వితీయ స్థానంలో నిలువటం గమనార్హం. గ్రూప్ దశలో పడుతూ లేస్తూ ముందంజ వేసిన ఈ జట్లు సెమీఫైనల్ బెర్త్‌పై కన్నేసి తాడోపేడో తేల్చుకోవాలని చూస్తున్నాయి. సమవుజ్జీల గ్రూప్‌గా కనిపిస్తున్న గ్రూప్-2.. రేసును రక్తికట్టించనుంది. శ్రీలంకలో స్లో పిచ్‌లపై పాకిస్తాన్, శ్రీలంకలు పైచేయి సాధించనుండగా.. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఈ పరిస్థితులకు వేగంగా అలవాటు పడాల్సి ఉంది.



