డిజిటల్ సేవల్లో విశిష్ట ప్రతిభ
నవతెలంగాణ-నక్కలగుట్ట
విద్యుత్ పంపిణీ సంస్థ ఎన్పీడీసీఎల్‌కు ఆపరేషనల్ ఎక్సలెన్స్, ఆటోమేషన్, డిజిటల్ టెక్నాలజీ విభాగాల్లో ప్రతిష్టాత్మకమైన ‘గవర్నెన్స్ నౌ పీఎస్‌యూ 2026’ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో సంస్థ తరపున అందుకున్న ఈ అవార్డును సోమవారం హనుమకొండ జిల్లా నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ విద్యుత్ భవన్‌లో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డికి అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ మార్గదర్శ కత్వంతోపాటు సంస్థ ఉద్యోగుల కృషి ఫలితంగా ఈ గుర్తింపు దక్కింద న్నారు.
ఏఐ ఆధారిత ఫీడర్ అవుటేజ్ అంచనా విధానం, రియల్‌టైమ్ ఫీడర్ మానిటరింగ్ సిస్టమ్, ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్ల వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంతో విద్యుత్ అంతరాయాలను తగ్గిస్తూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. అదే విధంగా ‘ఇప్పయి పవర్ అవార్డ్స్ 2026’లో ఇన్నోవేషన్ విభాగంలో కూడా సంస్థకు పురస్కారం లభించిందన్నారు. 17 జిల్లాల్లో సుమారు 72 లక్షల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తూ, ‘పొలం బాట’, ‘ప్రజా బాట’, ప్రజావాణి, 1912 కాల్ సెంటర్ వంటి సేవల ద్వారా వినియోగదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, సీఈలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



