విచారణ లేకుండా 12 నెలలు నిర్బంధించే అవకాశం
జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలింపు
శ్రీనగర్ : జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద లద్దాఖ్ పోలీసులు అరెస్ట్ చేసిన పర్యావరణ ఉద్యమకారుడు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత సోనమ్ వాంగ్‌చుక్‌ను రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జైలుకు తరలించారు. రాష్ట్ర భద్రతకు హాని కలిగించే కార్యకలాపాలకు వాంగ్‌చుక్ పాల్పడుతు న్నారని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆయనను లెహ్ లో ఉంచడం సబబుకాదని, అందుకే జోధ్‌పూర్ జైలుకు తరలించామని అధికారులు తెలిపారు. రాష్ట్ర హోదా కోసం, ఆరో షెడ్యూలులో చేర్చడం కోసం లెహ్ లో కొనసాగిన హింస నేపథ్యంలో వాంగ్‌చుక్‌ను శుక్రవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 1980వ సంవత్సరపు ఎన్‌ఎస్‌ఏ కింద వాంగ్‌చుక్‌ను ఆయన నివాసం సమీపంలో పోలీ సులు నిర్బంధించి జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ చట్టం కింద అరెస్ట్ చేసిన వారిని విచారణ జరపకుండా 12 నెలల వరకూ నిర్బంధిం చవచ్చు. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పేందుకు ఆన్‌లైన్ ద్వారా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి వాంగ్‌చుక్ సిద్ధపడుతున్న సమయంలోనే ఆయనను అరెస్ట్ చేశారు.
తన అరెస్టును ముందుగానే ఊహించిన వాంగ్‌చుక్ అంతకుముందు పాత్రికేయులతో మాట్లాడుతూ ‘నేను బయట ఉండే కంటే జైలులో ఉంటేనే దేశ ప్రజలు చైతన్యవంతులవుతారు’అని వ్యాఖ్యానిం చారు. కాగా వాంగ్‌చుక్‌పై వచ్చిన ఆరోపణలను లెహ్ అపెక్స్ బాడీ (ల్యాబ్) సహ ఛైర్‌పర్సన్ చెరింగ్ దార్జే లక్‌రక్ ఖండించారు. మరోవైపు వాంగ్‌చుక్ ను ఎన్‌ఎస్‌ఏ కింద అరెస్ట్ చేసి జోధ్‌పూర్ పంపడాన్ని అధికారులు సమర్ధించుకున్నారు. నిర్దిష్ట సమాచారం ఆధారంగానే ఈ చర్యలు తీసుకున్నా మని తెలిపారు. ఉన్నత స్థాయి కమిటీ సమావేశం గురించి ప్రభుత్వం సమాచారం ఇచ్చినప్పటికీ, సంప్రదింపులకు సంసిద్ధత తెలిపినప్పటికీ నిరాహారదీక్ష కొనసాగించారని ఆరోపించారు.
వాంగ్‌చుక్ అరెస్ట్ నేపథ్యంలో అధికారులు లెహ్‌లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపి వేశారు. వరుసగా నాలుగో రోజు కూడా కర్ఫ్యూను కొనసాగించారు. గత 24 గంటల కాలంలో లద్దాఖ్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని, శాంతి భద్రతలను కాపాడడానికి ఆంక్షలు కొనసాగి స్తున్నామని అధికారులు చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాలలో పోలీసులు, పారా మిలిటరీ దళాల గస్తీ, తనిఖీలు కొనసాగుతున్నాయి. అల్లర్లకు పాల్ప డి తప్పించుకొని తిరుగుతున్న వారిని పట్టుకు నేం దుకు దాడులు జరుపుతున్నారు. హింసను ప్రేరేపించిన ఓ కౌన్సిలర్ కోసం కూడా గాలిస్తున్నారు.