లేజర్, ఏఐ ఆయుధాలు కూడా..
15 ఏండ్లలో సమకూర్చుకునేలా రోడ్‌మ్యాప్: కేంద్రం నిర్ణయం
న్యూఢిల్లీ : త్రివిధ దళాలకు అత్యాధునిక ఆయుధాలు సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అణుశక్తితో నడిచే యుద్ధ నౌకలు, లేజర్, కృత్రిమ మేధ (ఏఐ)తో పని చేసే ఆయుధాలు, ఎలక్ట్రోమాగెట్ ఎయిర్‌క్రాప్ట్ వంటి అధునాతన ఆయుధ సంపత్తిని 15 ఏండ్ల కాలపరిమితిలో సమకూర్చుకునేలా ప్రత్యేక రోడ్ మ్యాప్‌ను రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారంనాడు విడుదల చేసింది. జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదదాడి, ‘ఆపరేషన్ సిందూర్’ వంటి పరిణామాల నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు నిర్ణయించింది. సమకూర్చుకోవాల్సిన ఆయుధాల జాబితాలో అణుశక్తి యుద్ధ నౌకలు, మలితరం యుద్ధ ట్యాంకులు, హైపర్‌సోనిక్ క్షిపణులు, స్టెల్త్ బాంబర్ డ్రోన్లు, ఏఐ ఆధారిత ఆయుధాలున్నాయి. ఇందుకు కేంద్రప్రభుత్వం రూ.వేల కోట్లను వెచ్చించాల్సి ఉంటుంది.
ఇదే రోడ్ మ్యాప్
త్రివిధ దళాలకు కనీసం 500కు తగ్గకుండా హైపర్‌సోనిక్ క్షిపణులను సమకూర్చాలని ఈ విజన్ డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు. దీని ప్రకారం పాత టి-72 యుద్ధట్యాంక్‌లను 1800 అత్యాధునిక ఫ్యూచర్ ట్యాంక్‌లతో భర్తీ చేయనుంది. మరో 400 తేలికపాటి ట్యాంక్‌లను దళాలకు అందించనుంది. ట్యాంక్‌పై నుంచి ప్రయోగించే 50 వేల యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్, 6లక్షల శతఘ్ని గుండ్లు, మానవ రహిత విమానాలను సమకూర్చుకోనుంది. వీటితోపాటు 700 రోబోటిక్ కౌంటర్ ఐఈడీ సిస్టమ్‌లను రంగంలోని దించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నౌకాదళం కోసం సరికొత్త ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, 10 అత్యాధునిక ఫ్రిగెట్‌లు, 7 అడ్వాన్స్‌డ్ కార్వెట్టీలు, 4 ల్యాండ్ డాక్ ప్లాట్‌ఫారమ్స్, హెలికాప్టర్లు కొనుగోలు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. అణుశక్తితో నడిచే యుద్ధ నౌకలు, ఎలక్ట్రోమాగెట్ ఎయిర్‌క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్‌ను సేకరించేందుకు పచ్చజెండా ఊపింది.
వాయుసేన కోసం..
వాయుసేన కోసం 75 హైఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్స్, 150 స్టెల్త్ బాంబర్ డ్రోన్లు, 100 రిమోట్ సాయంతో పనిచేసే విమానాలు, గైడెడ్ ఆయుధాలు, 20 స్ట్రాటోస్పియరిక్ ఎయిర్ షిప్‌లను సమకూర్చనుంది. 21 శతాబ్దంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా సైన్యాన్ని తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఈ దిశలో యాంటీ స్వార్మ్ డ్రోన్ వ్యవస్థలు, లేజర్ ఆయుధాలు, మానవ రహిత విమానాల కోసం గగనతలం నుంచి భూతలంపైకి సంధించే క్షిపణులు, అత్యాధునిక టార్గెటింగ్ పాడ్స్ వంటివి కూడా కేంద్రం నిర్దేశించుకున్న జాబితాలో ఉన్నాయి. ఇదే సమయంలో ఆయుధాలను పెద్దఎత్తున అభివృద్ధి చేసేందుకు అత్యాధునిక టెక్నాలజీని వాడతామని రక్షణ శాఖ పేర్కొన్నది. రోబోటిక్స్, కృత్రిమ మేధ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుద్ధ భూములను మార్చేస్తున్నాయని అభిప్రాయపడింది. ఆ మేరకు సన్నద్ధం కావాలని వివరించింది. దేశీయ కంపెనీలు మేకిన్ ఇండియా కార్యక్రమానికి ప్రాధాన్యమివ్వాలని రక్షణశాఖ కోరింది.
మరిన్ని ఎస్-400 కొనుగోళ్లు ..
గగనతల రక్షణ వ్యవస్థల్లో ప్రఖ్యాతినొందిన ఎస్-400 వ్యవస్థలను మరికొన్ని సమకూర్చుకోవటంపైనా రక్షణ శాఖ దృష్టి సారించింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ఎస్-400 అద్భుతంగా పనిచేసినట్టు వాయుసేన పేర్కొనటంతో మరికొన్ని యూనిట్లు కొనుగోలు చేసేందుకు రక్షణశాఖ సిద్ధమైంది. ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ ప్రత్యర్థి క్షిపణులను అడ్డుకోవటమే కాకుండా వాటిని ధ్వంసం చేసే సామర్థ్యం కలిగి ఉంది. మరిన్ని ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థల కొనుగోలు కోసం భారత్ చర్చలు జరుపుతున్నట్టు రష్యా రక్షణ శాఖ అధికారులు చెప్పినట్టు మాస్కో అధికారిక న్యూస్ టాస్ పేర్కొన్నది. భారత్ ఇప్పటికే ఎస్-400లను వాడుతోందనీ, మరిన్ని యూనిట్ల కోసం చర్చలు జరుపుతున్నట్టు రష్యా మిలిటరీ టెక్నికల్ కో-ఆపరేషన్ అధిపతి షుగయేవ్ తెలిపారు.
సైన్యానికి అణు యుద్ధ నౌకలు
- Advertisement -
- Advertisement -