Friday, February 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనుమాయిష్‌ వాణిజ్య, సాంస్కృతిక వికాసానికి రోల్‌ మోడల్‌..

నుమాయిష్‌ వాణిజ్య, సాంస్కృతిక వికాసానికి రోల్‌ మోడల్‌..

- Advertisement -

నుమాయిష్‌ను జిల్లాలకు విస్తరించాలి : బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు

నవతెలంగాణ -సుల్తాన్‌ బజార్‌
దేశ వ్యాప్తంగా ఖ్యాతి గడించిన నాంపల్లి నుమాయిష్‌ కేవలం ఒక వ్యాపార ప్రదర్శన మాత్రమే కాదని, అది మన రాష్ట్ర వాణిజ్య, సాంస్కృతిక వికాసానికి రోల్‌ మోడల్‌గా నిలుస్తుందని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. ఈ ప్రదర్శనకు ఇప్పటి వరకు 20 లక్షలకు పైగా సందర్శకులు వచ్చారని, ఇది హైదరాబాద్‌పై ప్రజలకు ఉన్న మక్కువను, నుమాయిష్‌పై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోందని అన్నారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల చిన్న, మధ్య తరగతికి చెందిన వ్యాపారులు ఉత్పత్తి చేసిన వస్తువులను విక్రయించుకునేందుకు మన నుమాయిష్‌ వేదిక కావడం సంతోషకరంగా ఉందన్నారు. హైదరాబాద్‌తో పాటు జిల్లాలకు ఎగ్జిబిషన్‌ను విస్తరించాలని సూచించారు.

1938లో స్థాపించిన ఈ నుమాయిష్‌ అనాడు 100 స్టాళ్లతో మొదలై, నేడు 1050 స్టాళ్లకు చేరడం మన పారిశ్రామిక ప్రగతికి నిదర్శనమని తెలిపారు. వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ ఆర్థికంగా ఎదగడంలో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. చార్మినార్‌, గోల్కొండ, బిర్యానీ తరహాలోనే ‘నుమాయిష్‌’ హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌లో అంతర్భాగమైందని మంత్రి అన్నారు. ఇది భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే వేదిక అని, కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ఉత్పత్తులు ఇక్కడ కొలువుదీరడం వల్ల ఇది ఒక ‘మినీ ఇండియా’ను తలపిస్తోందని చెప్పారు. మన గంగా-జమునా తెహజీబ్‌కు ఇది నిలువుటద్దమని అన్నారు. అలాగే వ్యాపారం ద్వారా వచ్చిన ఆదాయాన్ని తిరిగి సమాజానికి అందించడం గొప్ప విషయం అన్నారు.

ముఖ్యంగా 19 విద్యా సంస్థలను నడుపుతూ, 30 వేల మంది విద్యార్థులకు, అందులోనూ మహిళా విద్యకు పెద్దపీట వేయడం ఎగ్జిబిషన్‌ సొసైటీ చేస్తున్న అద్భుతమైన కృషికి నిదర్శనమని తెలిపారు. నుమాయిష్‌ ద్వారా వచ్చిన ప్రతి రూపాయిని నిరుపేద విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు వినియోగించడం అభినందనీయమన్నారు. 86వ నుమాయిష్‌ మరింత విజయవంతంగా, అద్భుతంగా జరగాలని అకాంక్షించారు. నుమాయిష్‌లో సందర్శకులకు ఉత్తమ సేవలను అందించిన స్టాల్‌ నిర్వాహకులు, పోలీస్‌, ట్రాఫిక్‌, విద్యుత్‌, ఆర్‌ అండ్‌ బీ, ఇతర శాఖల అధికారులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్‌ సొసైటీ వైస్‌ ప్రెసిడెంట్‌ సుఖేష్‌ రెడ్డి, సెక్రటరీ బీఎన్‌. రాజేశ్వర్‌, ట్రెజరర్‌ ఎన్‌.సంజీవ్‌ కుమార్‌, జాయింట్‌ సెక్రటరీ టి. చంద్రశేఖర్‌, ప్రైజ్‌ డిస్ట్రిబ్యూషన్‌ అడ్వైజర్‌ పి. హరినాథ్‌ రెడ్డి, కన్వీనర్‌ బి.అనురాధ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -