ప్రారంభంకాని మట్టి నింపే పనులు
ఈజిఎస్ కార్యాలయంలోనే పాలిథిన్ కవర్లు
నవతెలంగాణ – మల్హర్ రావు
పచ్చదనం పెంపునకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గ్రామానికో నర్సరీ ఏర్పాటు చేసి ఏటా లక్ష్యం మేర మొక్కలు పెంచుతుంది. ఇక్కడ పెరిగిన మొక్కలను ఏటా వర్షాకాలంలో గ్రామంలో రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ స్థలాల్లో నాటిస్తోంది. అధికారులు 2026-27 ఆర్థిక సంవత్సరంలో మండలంలోని 15 పంచాయతీల్లో 1.52 లక్షల మొక్కలు పెంచాలనే లక్ష్యంగా నిర్దేశించారు. దీంతో సిబ్బంది నర్సరీల్లో వివిధ రకాల మొక్కలు పెంచి నాటేందుకు ప్రణాళికలు రూపొందించారు.
మండలానికి 1.52 లక్షల పాలిథిన్ కవర్లు
ఒక్కో గ్రామపంచాయతీ నర్సరీలో 10 వేల నుంచి 12 వేల మొక్కలు పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అందుకు అనుగుణంగా డిసెంబర్ నెలలోనే 1.52 లక్షల పాలిథిన్ కవర్లు ఈజీఎస్ కార్యాలయానికి చేరుకున్నాయి.ఈజీఎస్ సిబ్బంది వాటిని నర్సరీలకు తీసుకువెళ్లాల్సి ఉంది. మరోవైపు పాలిథిన్ కవర్లలో నింపేందుకు మట్టి అందుబాటులో లేక కవర్లు తీసుకుపోవడంలేదని తెలుస్తోంది. మండలంలో 15 గ్రామపంచాయతీల్లో నర్సరీల ఏర్పాటులో నిర్లక్ష్యం నెలకొంది. అన్ని గ్రామాల్లో ఇప్పటికి ఇంకా ప్రాథమిక ఏర్పాట్లు కాలేదు.
అధికారుల నిర్లక్ష్యం..
డిసెంబర్ నెలలో నర్సరీలు ప్రారంభం కావాల్సి ఉండగా అధికారుల నిర్లక్ష్యంతో ఆలస్యం అవుతోంది. జనవరి మాసం ప్రారంభమైనా నర్సరీల జాడ కనిపించడం లేదు. ఇప్పటికే గ్రామీణాభివృద్ధి శాఖ మొక్కల పెంపకానికి సరఫరా చేసిన పాలిథిన్ కవర్లు ఈజీఎస్ కార్యాలయానికే పరిమితమయ్యాయి. వాటిని గ్రామాలకు సరఫరా చేయడంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది. నర్సరీలు ఏర్పాటు చేయాల్సిన ప్రదేశాల్లో ఎర్రమట్టి లభ్యత లేకపోవడం మరో ప్రధాన సమస్యగా మారిందని తెలుస్తోంది. మొక్కల పెంపకానికి అనువైన మట్టిని ముందుగానే సేకరించాల్సి ఉన్నా, చాలా గ్రామాల్లో ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. దీంతో కవర్లు వచ్చి నా నర్సరీల ఏర్పాటు ప్రశ్నార్ధకంగా మారుతోంది.
త్వరలో నర్సరీలు ఏర్పాటు చేస్తాం: ఎపిఓ హరీష్
త్వరలో అన్ని గ్రామపంచాయతీలకు పాలిథిన్ కవర్లు అందజేసి నర్సరీల ఏర్పాటును వేగవంతం చేస్తాం. ఇప్పటికె కొన్ని జిపిలకు కవర్లు అందజేశాం.ఎర్ర మట్టి,నీటి సదుపాయాలు కల్పిస్తాం. వనమహోత్సవానికి మొక్కలు సిద్ధమయ్యేలా చర్య లు తీసుకుంటాం.



