- – రెడ్డి గుంపు అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం వేడుకలు
– చిరుధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, పండ్లతో ఆకర్షణీయ ప్రదర్శన
– గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషణ మార్గదర్శనం - నవతెలంగాణ – అశ్వారావుపేట
- అశ్వారావుపేట మండలం, గాండ్లగూడెం పంచాయతీ పరిధిలోని రెడ్డి గుంపు అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం ‘పోషణ మాసం’ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ రాములమ్మ మాట్లాడుతూ.. “పోషకాహారం అంటే కేవలం తిండి కాదు, ఆరోగ్యానికి మేలుచేసే ఆహారాన్ని సరియైన మోతాదులో, సరైన సమయంలో తీసుకోవడం” అని వివరించారు. కేంద్ర ప్రాంగణంలో చిరుధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో ఆకర్షణీయమైన ఆహార పదార్థాల ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
స్థానికంగా పండే జొన్న, రాగి, సజ్జ వంటి చిరుధాన్యాలు తో తయారుచేసిన వంటకాలు, పప్పు కూరలు, ఆకుకూర వంటకాలు ప్రదర్శనలో ఉంచి వాటి పోషక విలువలను వివరించారు. బాలింతలు, గర్భిణీలు, చిన్నారులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రదర్శనను సందర్శించారు. అందరికీ చిరుధాన్యాలు తో తయారైన పదార్థాలను రుచి చూపించి వాటి ప్రయోజనాలను వివరించారు.
గ్రామ పెద్దలు మాట్లాడుతూ “ఇలాంటి కార్యక్రమాలు గ్రామీణ స్థాయిలో ప్రజల్లో పోషణ పట్ల చైతన్యం పెంచుతాయి” అని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో భాగంగా గర్భిణీలు కోసం ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు కలిసి గృహ సందర్శనలో ప్రాముఖ్యతను వివరించారు. గర్భిణీలకు తగిన ఆహారం, విశ్రాంతి, ఆరోగ్య పరీక్షల ప్రాముఖ్యతను తెలియజేశారు.
కేంద్రంలో జరిగిన ప్రదర్శనలో పిల్లలతో పాటు మహిళలు కూడా పాల్గొన్నారు. తమ ఇళ్లలో పెరటి తోటలు ఏర్పాటు చేసి కూరగాయలను పెంచుకోవాలని నిర్ణయించారు. “ప్రతి ఇంట్లో ఒక పెరటి తోట – ప్రతి కుటుంబంలో ఆరోగ్య వృద్ధి” అనే నినాదాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు రాములమ్మ, ప్రమీల, బుల్లెమ్మ, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొని పోషణ మాసం మహోత్సవాన్ని విజయవంతం చేశారు.