ఉప రాష్ట్రపతి ఎన్నికపై ఎన్డీఏ కసరత్తు
మిత్రపక్షాలకు ఛాన్స్ ?
న్యూఢిల్లీ : నూతన ఉప రాష్ట్రపతి ఎన్నికకు సన్నాహాలు ప్రారంభించామని ఎన్నికల కమిషన్ బుధవారం ప్రకటించింది. ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్కడ్ స్థానంలో ఎవరిని నియమించాలన్న విషయంపై బీజేపీ పార్లమెంటరీ పార్టీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బీజేపీ పార్లమెంట రీ పార్టీకి నేతృత్వం వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ నాలుగు రోజుల విదేశీ పర్యటన నిమిత్తం బుధవారం బయలుదేరి వెళ్లారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాతే పార్లమెంటరీ పార్టీ సమావేశమవుతుందని తెలుస్తోంది. ఉభయ సభలలో ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా ఎన్డీఏ అభ్యర్థే ఉప ప్రధాని అవుతారు. ‘పూర్తి విధేయత’ చూపే నేతనే ఉప రాష్ట్రపతి పదవి వరిస్తుందని తెలుస్తోంది. ఉప రాష్ట్రపతి పదవికి అభ్యర్థి ఎంపికపై పార్టీ సీనియర్ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని, అయితే ఎన్డీఏలో దీర్ఘకాలం ఉంటున్న వారినే ఎన్నుకునే అవకాశం ఉన్నదని బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. ఎన్డీఏ కీలక మిత్రపక్షాలలో…ముఖ్యంగా టీడీపీ, జేడీయూలలో ఒక పార్టీకి చెందిన వ్యక్తిని ఉప రాష్ట్రపతిగా ఎన్నుకునే అవకాశం కూడా ఉన్నదని ఆయన తెలిపారు. దీనివల్ల బీజేపీ, దాని మిత్రపక్షాల మధ్య సంబంధాలు బలపడతాయని అన్నారు. కేంద్ర క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు వినవస్తున్న తరుణంలో ఉప రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు పార్టీలో సంస్థాగత ఎన్నికలు కూడా జరపాల్సి ఉంది. రాజ్యసభ పదవీకాలం ముగిసే దశలో ఉన్న వారు, సహాయ మంత్రులతో పాటు పలువురు పార్టీ నేతలకు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో చోటు దక్కవచ్చునని పార్టీ వర్గాలు తెలిపాయి.
విధేయతే గీటురాయి!
- Advertisement -
- Advertisement -