యూఎన్ తాజా నివేదిక
భారత్‌లో ఆందోళన కలిగిస్తున్న ఊబకాయం సమస్య
పిల్లలు, పెద్దలు అనే తేడా లేదు
న్యూఢిల్లీ : భారత్‌లో ఊబకాయం సమస్య ఆందోళనను కలిగిస్తున్నది. ఇది పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా ఈ సమస్యను తీవ్రతరం చేస్తున్నది. ఐక్యరాజ్యసమితి(యూఎన్)కి చెందిన పలు సంస్థలు రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడిస్తున్నది. ఈ మేరకు తాజాగా స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ (సోఫీ) ఇన్ ది వరల్డ్ 2025 నివేదిక విడుదలైంది. ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ), వ్యవసాయ అభివృద్ధి కోసం అంతర్జాతీయ నిధి(ఐఎఫ్‌ఏడీ), యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్) లు ఈ నివేదికను రూపొందించాయి.
ఐదేండ్ల వయసున్న పిల్లల్లో 3.7 శాతం పెరుగుదల
ఈ నివేదిక సమాచారం ప్రకారం.. భారత్‌లో ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో అధిక బరువు ఏటికేడూ పెరిగిపోతున్నది. ఈ వయసు పిల్లల్లో అధిక బరువు రేటు 2012లో 2.7 శాతంగా ఉంటే.. 2024 నాటికి 3.7 శాతానికి పెరిగింది. అంటే 27 లక్షల నుంచి 42 లక్షలకు ఎగబాకిందన్నమాట. దీంతో పిల్లలు ఊబకాయం, దీర్ఘకాల సంబంధ వ్యాధులకు గురవుతారని పరిశోధకులు హెచ్చరించారు. బాల్యంలో అధిక బరువు సమస్య ప్రతికూల మానసిక, సామాజిక పరిణామాలను కలిగి ఉంటుంది. ఇది పాఠశాలల్లో పిల్లల ప్రదర్శన, జీవన నాణ్యతను ప్రభావితం చేస్తుందని డబ్ల్యూహెచ్‌ఓ వివరించింది. ఊబకాయం ఉన్న పిల్లలు వారు పెద్దవారు అయ్యాక కూడా ఇదే స్థితిని కలిగి ఉండే అవకాశాలు అధికంగా ఉంటాయనీ, యుక్త వయసులో నాన్ కమ్యూనికబుల్ వ్యాధులు (ఎన్‌సీడీలు) వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని హెచ్చరించింది.
పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్లు అధికం
గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఊబకాయంతో బాధపడేవారు రెండు రెట్లు అధికంగా ఉన్నారు. అలాగే, సంపన్న వర్గాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నది. ఒబేసిటీ సమస్యను నియంత్రించటానికి భారత్‌లో అనేక కార్యక్రమాలు, ప్రయత్నాలు చేసినప్పటికీ అవి అంతగా ప్రభావం చూపలేదని పరిశోధకులు చెప్తున్నారు. కాబట్టి వ్యక్తిగత స్థాయిలో దృష్టిని సారించి, అధిక బరువు, ఊబకాయం సమస్యపై తగిన చర్యలు, అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని వారు సూచిస్తున్నారు. లేకపోతే ఈ సమస్య తీవ్రంగా మారి బాధితుల్లో ఎన్‌సీడీలు అభివృద్ధి చెందే ప్రమాదమున్నదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా భారత్‌లోని దక్షిణ ప్రాంతం, సంపన్న కుటుంబాలు, పట్టణ ప్రాంతాలలో ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువ అనీ, ఇక్కడి ప్రజలపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టిని పెట్టాలని చెప్తున్నారు.
58 కోట్ల మందికి అందని పోషకాహారం
ఇక పోషకాహార లోపం కూడా భారత్‌కు సమస్యగానే ఉన్నది. ఇప్పటికీ దేశంలో 40.4 శాతం మంది, అంటే 58.50 కోట్ల మంది ఇప్పటికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందలేకపోతున్నారని సోఫీ నివేదిక వివరించింది. ఇది చాలా ఆందోళనకరమైన విషయమని పేర్కొన్నది. భారత్‌లో 2022-24లో 17.2 కోట్ల మంది పోషకాహారలోపంతో బాధపడుతున్నారు. ఒకపక్క భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటున్నదనీ, ఇక్కడి ప్రజలకు కనీసం ఆరోగ్యకరమైన ఆహారం అందలేని పరిస్థితులున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.
ఊబకాయంతో బాధపడుతున్న పెద్దలు 20 కోట్ల మందికి పైనే
భారత్‌లో 18 ఏండ్లు పైబడినవారిలో ఊబకాయం కూడా స్థిరంగా పెరుగుతోంది. 2012లో వీరి సంఖ్య 4.7 శాతంగా ఉండగా.. అది ఇప్పుడు 7.3 శాతానికి పెరిగింది. భారత్‌లో 20.55 కోట్ల మంది పెద్దలు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇటీవల విడుదలైన ఈ పరిశోధన ఫలితాలు భారత్‌లో ఆందోళనకరమైన పరిస్థితిని వెల్లడిస్తున్నాయని ఐసీఎంఆర్ అనుబంధ సంస్థలు, అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్, సింబయాసిస్ మెడికల్ కాలేజీకి చెందిన వైద్య, ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. భారత్‌లోని ప్రతి 20వ ఇంటిలో అందరూ అధిక బరువుతో బాధపడుతున్నారు. అలాగే ప్రతీ పదో ఇంట్లో అందరూ ఊబకాయం సమస్యను కలిగి ఉన్నారు. అధిక బరువు, ఒబేసిటీలను బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) ద్వారా కొలుస్తారు. బీఎంఐ 25-29.9 మధ్య ఉంటే దానిని అధిక బరువు అనీ, బీఎంఐ 30-39.9 మధ్య ఉంటే ఒబేసిటీ అని పరిగణిస్తారు. బీఎంఐ 24.9 కంటే ఎక్కువగా ఉంటే మాత్రం దానిని అనారోగ్యకరమైనదిగా గుర్తిస్తారు.
ఒబేసిటీ పెరిగిపోతోంది
- Advertisement -
- Advertisement -