రష్యా, ఉక్రెయిన్‌లను కోరుతూ ఐరాస తీర్మానం
ఓటింగ్‌కు భారత్ దూరం
జెనీవా : రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి నాలుగేండ్లు పూర్త యిన వేళ ఇరు దేశాల మధ్య తక్షణమే, ఎలాంటి షరతులు లేకుండా కాల్పుల విరమణ జరగాలంటూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై జరిగిన ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. ఉక్రెయిన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి 107 దేశాలు మద్దతు తెలిపాయి. భారత్ సహా 51 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండగా 12 దేశాలు వ్యతిరేకించాయి.
ఐరాసలో తీర్మానం ఆమోదం
‘చిరకాల శాంతికి మద్దతు ఇవ్వండి’ అని కోరుతూ ఐరాసలో ఉక్రెయిన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఉక్రెయిన్‌పై అమెరికా దాడి ప్రారంభించి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రవేశపెట్టిన ఈ తీర్మానం ఐరాస ప్రతినిధి సభ ఆమోదం పొందింది. 193 మంది సభ్యులున్న ఐరాస జనరల్ అసెంబ్లీలో ఉక్రెయిన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి 107 దేశాలు మద్దతు తెలిపాయి. భారత్‌తో సహా బహ్రెయిన్, బంగ్లాదేశ్, బ్రెజిల్, చైనా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్, అమెరికా వంటి దేశాలు ఓటింగ్‌కు దూరంగా నిలిచాయి.
మద్దతు తెలిపిన దేశాలకు జెలెన్‌స్కీ కృతజ్ఞతలు
తీర్మానానికి మద్దతు తెలిపిన 107 దేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి స్థాయి కాల్పుల విరమణను పాటించడంతో పాటు ఉక్రెయిన్ పౌరులను తిరిగి స్వదేశానికి రప్పించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీర్ఘకాలిక శాంతి సాధనలో ఈ తీర్మానం కీలకమైన అడుగు అని పేర్కొన్న ఆయన, అందుకోసం ప్రపంచ భాగస్వామ్య దేశాలతో కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు.
‘ఈ రోజు ఐక్యరాజ్యసమితిలో జీవించే హక్కును కాపాడే దిశగా ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచిన 107 దేశాలకు నేను కృతజ్ఞుడిని. సంపూర్ణ కాల్పుల విరమణను పాటించడంతో పాటు మా ప్రజలను తిరిగి రప్పించాలనే స్పష్టమైన పిలుపుతో మా తీర్మానాన్ని ఐరాస ఆమోదించింది. ఇది సరైన, అవసరమైన చర్య. భాగస్వామ్య దేశాలతో కలిసి శాంతి సాధన కోసం మేం చురుకుగా పని చేస్తూనే ఉంటాం’ అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.
యుద్ధం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన : ఐరాస చీఫ్
ఉక్రెయిన్‌పై రష్యా పూర్తి స్థాయి దాడి ప్రారంభించి నాలుగేండ్లు పూర్తయిన సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ స్పందించారు. ఈ యుద్ధం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించేదిగా, ప్రపంచ శాంతికి ముప్పు కలిగించేదిగా ఉన్నదని ఆయన అభివర్ణించారు. ‘ఈ నెల 24తో ఉక్రెయిన్‌పై రష్యా పూర్తి స్థాయి దాడి ప్రారంభించి నాలుగేండ్లు పూర్తయ్యాయి. ఇది ఐక్యరాజ్యసమితి ఛార్టర్, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. ఈ వినాశకర యుద్ధం మన మనస్సాక్షికి మచ్చ. ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి భద్రతలకు ఇది ఇంకా ముప్పుగానే ఉంది. యుద్ధం ఎంత కాలం కొనసాగితే అంత ఎక్కువ ప్రాణనష్టం జరుగుతుంది.
ముఖ్యంగా పౌరులే తీవ్రంగా నష్టపోతున్నారు. గత సంవత్సరం ఉక్రెయిన్‌లో మరణించిన వారి సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరింది.’ అని గుటెర్రెస్ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో పోస్ట్ చేశారు. న్యాయసమ్మతమైన, శాశ్వత శాంతి సాధనకు తొలి అడుగుగా తక్షణ, సంపూర్ణ, ఎలాంటి షరతులు లేని కాల్పుల విరమణ అవసరమని గుటెర్రెస్ పునరుద్ఘాటించారు. ‘ఇది పూర్తిగా అంగీకరించలేనిది. న్యాయబద్ధమైన, శాశ్వత, సమగ్ర శాంతి సాధన దిశగా తక్షణ, సంపూర్ణ, ఎలాంటి షరతులు లేని కాల్పుల విర మణకు నేను మళ్లీ పిలుపునిస్తున్నా.
శాంతి న్యాయ బద్ధంగా ఉండాలంటే అది అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉండాలి. ఉక్రెయిన్ స్వాతంత్య్రం, సార్వభౌమత్వం, భౌగోళిక సమ గ్రతకు గౌరవం ఇవ్వడం ద్వారానే న్యాయ సమ్మతమైన, శాశ్వత శాంతి సాధ్యమవుతుంది’ అని పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం మొదలై మంగళవారం నాటికి నాలుగేండ్లు పూర్తయ్యాయి. ఎన్ని ప్రయత్నాలు చేసిన ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. దీంతో యుద్ధం కొనసాగుతూనే ఉంది.



