Tuesday, April 29, 2025
Homeక్రైమ్ఒడిశా టూ హైదరాబాద్‌

ఒడిశా టూ హైదరాబాద్‌

– పనస పండ్ల మాటున గంజాయి రవాణా
– రూ.2.5 కోట్ల విలువ చేసే సొత్తు స్వాధీనం
– తెలంగాణ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ కమలాసన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పలాస, విశాఖపట్నం, విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు అక్రమంగా రవాణా చేస్తున్న రూ.2.5 కోట్ల విలువ చేసే గంజాయిని తెలంగాణ ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పట్టుకున్నారు. సోమవారం హైదరాబాద్‌లోని నాంపల్లి ఆబ్కారీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ విబి.కమలాసన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ఒడిశా నుంచి రాష్ట్రానికి కోట్లాది రూపాయల విలువ చేసే గంజాయిని పెద్ద ఎత్తున రవాణా చేస్తున్నారనే సమాచారంతో దాడులు చేయగా అక్రమ గంజాయి గుట్టు రట్టయిందని తెలిపారు. ”సోమవారం ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో మాటు వేసిన ఎక్సైజ్‌ స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులకు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ ప్లేట్‌ కలిగిన మహేంద్ర మినీ వ్యాన్‌ కంటపడింది. వెంటనే వ్యానును ఆపి తనిఖీ చేయగా పనస పండ్లు కనిపించాయి. అందులో ఉన్న వ్యక్తులను విచారించగా, తాము పండ్ల వ్యాపారం చేస్తామని చెప్పారు. వారి తీరు అనుమానాస్పదంగా ఉండటంతో వ్యానును తనిఖీ చేయగా పనస పండ్ల మాటున గంజాయి సంచులు దొరికాయి” అని కమలాసన్‌రెడ్డి వివరించారు. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌కు చెందిన గణేష్‌ రామస్వామి అలియాస్‌ రాము, (27) విజరుశంకర్‌ కులకర్ణి అలియాస్‌ శంకర్‌రావు కులకర్ణి (53)లను అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. పట్టుబడ్డ నిందితుల నుంచి రూ.2.5 కోట్ల విలువ చేసే (410) కిలోల గంజాయి, రూ.8లక్షల విలువ చేసే మినీ వ్యాన్‌, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులు గంజాయిని చిన్న ప్యాకెట్లలోకి మార్చి బీదర్‌, తాండూర్‌, వికారాబాద్‌, హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కమిషనర్‌ సయ్యద్‌ యాసిన్‌ ఖురేషి, అడిషనల్‌ ఎస్పీ భాస్కర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ ప్రణవి, అసిస్టెంట్‌ కమిషనర్లు జి.గణేష్‌, అనిల్‌ కుమార్‌రెడ్డి డీఎస్పీలు తుల శ్రీనివాసరావు, తిరుపతి యాదవ్‌లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img