– అందరి సెలవులు రద్దు చేయండి
– అత్యవసర పరిస్థితిలో చికిత్స అందించేలా ఏర్పాట్లు : మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షసూచన ఉన్న నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో బుధవారం ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేశారు. హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, ఆర్‌ఎంవోలు, మెడికల్ ఆఫీసర్లు, డాక్టర్లు, సిబ్బంది మూడు రోజులు కచ్చితంగా హాస్పిటల్స్‌లోనే ఉండాలనీ, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి ఆదేశించారు.
అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు, గర్భిణులకు తక్షణమే వైద్య సేవలు అందించాలనీ, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ దగ్గరగా ఉన్న గర్భిణులను హాస్పిటల్స్‌లోని బర్త్ వెయిటింగ్ రూమ్స్‌కు తరలించి సేవలందించాలని సూచించారు. అంబులెన్సులు, 102 వాహనాలు అన్నింటిని సిద్ధంగా ఉంచుకోవాలనీ, ఎక్కడ అత్యవసర పరిస్థితి తలెత్తినా వెళ్లి పేషెంట్‌ను తరలించేలా డ్రైవర్లు, ఈఎంటీలను 24 గంటలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. హాస్పిటళ్లలో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. పవర్ కట్ అయిన మరుక్షణమే జనరేటర్లు ప్రారంభించి రోగులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఎలక్ట్రీషియన్లను 24 గంటలు హాస్పిటల్‌లో అందుబాటులో ఉంచుకోవాలన్నారు. హాస్పిటల్స్ లోపలికి నీరు చేరకుండా, నిల్వ ఉండకుండా ముందు జాగ్రత్త చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. ఉన్నతాధికారులందరు మూడు రోజులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్స్
జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకోవాలని డీఎంహెచ్‌వోలను రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో వారిద్దరు బుధవారం సాయంత్రం డీఎంహెచ్‌వోలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు, ఇతర శాఖల ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అందరి సెలవులు రద్దు చేస్తున్నామనీ, అప్రమత్తంగా ఉండాలని కోరారు.
హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, ఆర్‌ఎంవోలు, మెడికల్ ఆఫీసర్లు, డాక్టర్లు, సిబ్బంది మూడు రోజులు కచ్చితంగా హాస్పిటల్స్‌లోనే ఉండేలా ఏర్పాట్లు చేసుకో వాలని ఆదేశించారు. విధులకు గైర్హాజరు అయినా, నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు, గర్భిణులకు తక్షణమే వైద్య సేవలు అందించాలని, ఎలాంటి ఇబ్బందు లు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ దగ్గరగా ఉన్న గర్భిణులను హాస్పిటల్స్‌లోని బర్త్ వెయిటింగ్ రూమ్స్‌కు తరలించి సేవలందించాలన్నారు. అన్ని హాస్పిటల్స్‌లో అవసరమైన మెడిసిన్, టెస్టింగ్ కిట్స్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. పాము, తేలు కాటు పేషెంట్లకు ఇచ్చే ఇంజక్షన్లు, మెడిసిన్ అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు వీలుగా అంబులెన్సులు, 102 వాహనాలు, డ్రైవర్లు, ఈఎంటీలు, జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలని కోరారు. ఆస్పత్రుల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలనీ, వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య సేవలందించాలని సంగీత సత్యనారాయణ సూచించారు.
అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES