శిథిలమైన ఐ అండ్ పిఆర్ వాహనం
తుప్పు పట్టి పోతున్న వైనం
నవతెలంగాణ – సిరిసిల్ల
మీడియాకు అందుబాటులో ఉండాల్సిన ఐ అండ్ పిఆర్ వాహనం శిథిలావస్థకు చేరింది. ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉంచడంతో తుప్పు పట్టి పోతుంది. వాహనం లేకపోవడంతో జిల్లాలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలను కవర్ చేయడానికి మీడియా ప్రతినిధులు తీవ్ర వ్యయప్రయాసలకు గురవుతున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రం నుండి దూర ప్రాంతాలలోజరిగే కార్యక్రమాలకు మీడియా ప్రతినిధులు సరైన సమయంలో చేరుకోలేక పోతున్నారు. దీంతో కార్యక్రమాలకు సంబందించిన సమాచారం ప్రజలకు చేరవేయడంలో విఫలమౌతున్నారు. గత కలెక్టర్లకు నూతన వాహనం సమకూర్చాలని ఎన్నిసార్లు విన్నవించినా విషయం ముందుకు సాగలేదు.
9 ఏళ్ల క్రితం జిల్లాకు కేటాయింపు..
అయితే 2016లో జిల్లాల పునర్నిర్మాణం జరిగిన నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాలుగు జిల్లాలుగా విడిపోయి, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలుగా ఏర్పడ్డాయి. సిరిసిల్ల జిల్లా కేంద్రంగా ఏర్పడడంతో జిల్లా స్థాయి కార్యాలయాలు ఇక్కడకు వచ్చాయి. ఈ క్రమంలో జిల్లాల పౌర సంబంధాల అధికారి కార్యాలయాలకు నూతన ఐ అండ్ పిఆర్ వాహనాలను నాటి ప్రభుత్వం కేటాయించింది. అయితే కరీంనగర్, పెద్దపెల్లి, జగిత్యాల జిల్లాలకు నూతన వాహనాలను కేటాయించగా, ఉమ్మడి కరీంనగర్ పౌర సంబంధ అధికారి కార్యాలయ పాత ఐ అండ్ పిఆర్ వాహనాన్ని సిరిసిల్ల జిల్లా కేటాయించారు.
ఇకెన్నాళ్ళు నిరూపయోగం…
ఇక 2016లో నూతనంగా ఏర్పడిన జిల్లాకు కలెక్టరేట్ కార్యాలయం లేకపోవడంతో సిరిసిల్ల సెస్ కార్యాలయాన్ని అద్దెకి తీసుకొని దాని నుండి కార్యకలాపాలు కొనసాగించారు. జిల్లాకు కేటాయించిన ఐ అండ్ పిఆర్ వాహనాన్ని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్న ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ స్థలంలో చెట్ల కింద పార్కు చేసి ఉంచారు. వాహనాన్ని నడపడానికి డ్రైవర్, శుభ్రంగా చూసుకోవడానికి క్లీనర్ లను తీసుకోకపోవడంతో వాహనం ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉంటుంది.
గత అధికారుల నిర్లక్ష్యంతో ఆ వాహనం మూలన పడి తుప్పు పట్టిపోయి శిథిలావస్థకు చేరుకుంది. వాహనానికి సంబంధించిన పరికరాలు, ఇంజన్ తో సహా పూర్తిగా పాడైపోయాయి. గత ప్రభుత్వం, ముఖ్యంగా సిరిసిల్ల నుండి ప్రాతినిధ్యం వహించిన అప్పటి మంత్రి కేటీఆర్ కూడా ఈ ఐ అండ్ పి ఆర్ వాహనం గురించి పట్టించుకోకపోవడం శోచనీయం. అనేకసార్లు ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఎలాంటి స్పందన కనిపించడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం లోని పదవులు పొందిన నాయకులైన ఈ సమస్యను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది.