Wednesday, November 19, 2025
E-PAPER
Homeక్రైమ్ఏసీబీ వలలో అధికారులు

ఏసీబీ వలలో అధికారులు

- Advertisement -

– లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
– మెదక్‌ జిల్లా టేక్మాల్‌లో ఎస్‌ఐ..
– వనపర్తి జిల్లా గోపాల్‌పేటలో విద్యుత్‌ శాఖ ఏఈ..
నవతెలంగాణ-టేక్మాల్‌/వనపర్తి

ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటనలు మెదక్‌ జిల్లా టేక్మాల్‌, వనపర్తి జిల్లా గోపాల్‌పేట లో మంగళవారం చోటుకున్నాయి. దొంగతనం కేసులో కాంప్రమైజ్‌ కోసం లంచం తీసుకున్న టేక్మాల్‌ ఎస్‌ఐని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మెదక్‌ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండలం హసన్మామపల్లి తండాకు చెందిన పాండు.. రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి వరి కోసే మిషన్‌ నుంచి బ్యాటరీ, టూల్‌ కిడ్స్‌ దొంగిలించడంతో అతనిపై కేసు నమోదు చేశారు. కాగా, ఈ కేసు విషయంలో కాంప్రమైజ్‌ చేస్తానని, కేసు మాఫీ చేస్తానని చెబుతూ నిందితుడు పాండు నుంచి ఎస్‌ఐ రాజేష్‌ ఫోన్‌ పే చేయించుకున్నాడు. ఆ డబ్బులు సరిపోక పోవడంతో, అదనంగా ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. దాంతో నిందితుడు పాండు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. మంగళవారం పాండు.. ఏసీబీ అధికారులు ఇచ్చిన నోట్లతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎస్‌ఐకు రూ.30 వేలు ఇచ్చాడు. ఇదే సమయంలో ఏసీబీ అధికారులు ఎస్‌ఐ రాజేష్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి ప్రయత్నించగా, స్టేషన్‌ వెనకాల నుంచి పారిపోయాడు. గమనించిన ఏసీబీ అధికారులు.. రాజేష్‌ను వెంబడించగా.. టేక్మాల్‌ కూరగాయల మార్కెట్‌లో పట్టు బడ్డాడు. అనంతరం ఎస్‌ఐ రాజేష్‌ను పోలీస్‌ స్టేషన్‌కు తరలించి విచారించగా.. లంచం తీసుకున్నట్టు ఒప్పుకున్నాడని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌ తెలిపారు. కాగా, ఎస్‌ఐ అరెస్ట్‌ విషయం తెలుసుకున్న మరికొంతమంది బాధితులు.. ఏసీబీ అధికారుల ముందుకు వచ్చి తమ వద్ద నుంచి కూడా లంచాలు తీసుకున్నారని విన్నవించుకున్నారు. ఆధారాలతో వచ్చి తమకు ఫిర్యాదు చేస్తే వాటిపైన కూడా విచారిస్తామని ఏసీబీ అధికారులు హామీ ఇవ్వడంతో బాధితులు శాంతించారు. అనంతరం బాధితులు, చుట్టుపక్కల గ్రామస్తులు.. స్టేషన్‌ ముందు టపాసులు పేల్చి.. ఆనందంతో కేరింతలు కొట్టి, నృత్యాలు చేశారు.

వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండల కేంద్రంలో ఓ రైతుకు ట్రాన్స్‌ఫ్సార్మర్‌ కేటాయింపులో లంచం తీసుకుంటూ విద్యుత్‌ శాఖ ఏఈ ఏసీబీకి పట్టుబడ్డారు. మహబూబ్‌నగర్‌ ఏసీబీ డీఎస్పీ సీహెచ్‌. బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గోపాల్‌పేట మండల కేంద్రంలో విద్యుత్‌ శాఖలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా ఎన్‌.హర్షవర్ధన్‌ రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఏదుల మండల కేంద్రానికి చెందిన ఓ రైతు ట్రాన్స్‌ఫార్మర్‌ మంజూరు కోసం ఏఈని సంప్రదించగా.. రూ.40 వేలు డిమాండ్‌ చేశారు. అందులో భాగంగా ముందుగా రూ.20 వేలు, ట్రాన్స్‌ఫ్సార్మర్‌ వచ్చిన తర్వాత మరో రూ.20 వేలను ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. కాగా, మంగళవారం మధ్యాహ్నం 2గంటల సమయంలో బాధిత రైతు ఏఈ హర్షవర్ధన్‌ రెడ్డికి రూ.20వేలు ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏఈ హర్షవర్ధన్‌ రెడ్డిని బుధవారం నాంపల్లి కోర్టులో హాజరు పరచనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -