సాంకేతిక సమస్యతో రుణమాఫీ నిధులు వెనక్కి
ఏపీజీవీబీ శాఖలను టీజీవీబీలుగా మార్పు
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ మారడంతో రైతుల ఖాతాల్లో పడని డబ్బులు
రూ.280 కోట్ల పైచిలుకు వెనక్కి
సమస్య పరిష్కరించాలని మంత్రికి అన్నదాతల విన్నపం
రైతులకు బ్యాంకు నోటీసులు
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
బ్యాంకర్లు, వ్యవసాయాధికారుల మధ్య సమన్వయ లోపం రైతులకు శాపంగా మారింది. సాంకేతికంగా జరిగిన పొరపాటుతో అర్హత కలిగిన రైతులు రుణమాఫీ అందుకోలేకపోయారు. రుణమాఫీ జాబితాల తయారీ సమయంలో పాత ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ స్థానంలో ఆన్‌లైన్‌లో కొత్త కోడ్ నమోదు చేసే సందర్భంగా సాంకేతిక సమస్య ఏర్పడి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 15వేల మందికి దక్కాల్సిన రుణమాఫీ నిధులు రూ.280 కోట్ల నిధులు ఏడాది తర్వాత వెనక్కి వెళ్లాయి. వ్యవసాయశాఖ, టీజీబీ అధికారుల సమన్వయ లోపంతో తాము నష్టపోతున్నామని, సీఎం దృష్టి సారించి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. రుణమాఫీ అమలుకు లబ్దిదారుల జాబితాలు రూపొందించిన సమయంలోనే.. పూర్వపు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకు అధికారికంగా తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మారింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రుణమాఫీ లబ్దిదారుల జాబితాలు తయారు చేసే సందర్భంలో వ్యవసాయ శాఖ ఏఈవోలు, ఏవోలు పూర్వపు ఏపీజీవీబీకి చెందిన ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ను రైతుల ఖాతాలకు జత చేశారు.. అయితే, రాష్ట్ర వ్యవసాయ శాఖ అనుమతించిన జాబితాల్లో తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా రూపాంతరం చెందిన తర్వాత వచ్చిన నూతన ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ పొందుపరిచారు. దీంతో రుణమాఫీ కోసం వ్యవసాయ శాఖ నుంచి వచ్చిన జాబితాల్లో గ్రామీణ వికాస బ్యాంకు ఖాతా ఉన్న రైతులకు సాంకేతిక సమస్యతో నగదు బదిలీ నిలిచింది. ఈ కారణంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దాదాపు 15 వేల మంది రైతులు.. సుమారు రూ.280 కోట్ల పైచిలుకు రుణమాఫీని పొందలేకపోయారు. అర్హత పొందినా వారి రుణాలు మాఫీ కాలేదు. బ్యాంక్, వ్యవసాయాధికారులు చేసిన తప్పిదాలకు తాము నష్టపోయామని, సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించి అర్హులైన ఖాతాదారులకు రుణమాఫీ వర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
సాంకేతిక సమస్య
ఏపీజీవీబీ శాఖలను టీజీవీబీలుగా గుర్తించి వాటి పరిధిలో కొత్త ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ నెంబర్లు కేటాయించడంతో.. పాత నెంబర్ వచ్చిన ఖాతాలకు నగదు బదిలీని (రుణమాఫీ మొత్తం రైతు ఖాతాలో జమ చేయడానికి) ఆన్‌లైన్‌లో తీసుకోలేదు. డీబీటీడైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ ప్రాబ్లమ్ రిమార్క్ చూపింది. దీంతో పలువురు రైతులు అప్పట్లో ఆందోళనలు చేశారు. ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ మారడం, దాన్ని రుణమాఫీ లబ్దిదారుల జాబితాల్లో సరిచేయకపోవడం వల్ల తాము మాఫీ పొందలేక పోయామని రైతులు వాపోయారు. ఈ క్రమంలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ గ్రామీణ బ్యాంకులో అర్హులైన రైతులకు రుణమాఫీకి కేటాయించిన సుమారు రూ.280 కోట్ల పైచిలుకు నిధులు వెనక్కి వెళ్లాయి.
మంత్రికి విన్నపం
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సమస్యను ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఈనెల 21న రైతులు కలిసి విన్నవించారు. రుణమాఫీ అయ్యేలా చూడాలని కోరారు.
రుణమాఫీ జరిగింది ఇలా..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 18 మండలాల్లో తెలంగాణ గ్రామీణ బ్యాంకుతోపాటు మరో 21 బ్యాంకుల నుంచి రైతుల వివరాలు సేకరించారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు నల్లగొండ రీజియన్ పరిధిలోని (దాదాపు ఉమ్మడి జిల్లా పరిధి) 78 శాఖల నుంచి కూడా రుణమాఫీ అర్హుల జాబితాలను రూపొందించారు. అయితే ఆ బ్యాంకు అధికారులు, ఫీల్డ్ ఆఫీసర్లు రైతుల ఖాతాల వివరాలతోపాటు, తమ బ్యాంకులను ఏపీజీవీబీ బ్యాంకులుగానే పేర్కొంటూ, పాత ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ను వ్యవసాయాధికారులకు అందజేశారు. వారు ఈ కోడ్ నెంబర్లతోనే జాబితాలను రూపొందించి ఆన్‌లైన్ చేశారు. దాంతో ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమకాలేదు.
అప్పులు చెల్లించాలని బ్యాంకు నోటీసులు
అధికారుల నిర్లక్ష్యంతో రుణమాఫీ కాలేదు. తీసుకున్న రుణం చెల్లించాలని నల్లగొండ గ్రామీణ వికాస్ బ్యాంకు నోటీసులు జారీ చేస్తోంది. మా గ్రామ రైతులు నల్లగొండలోని గ్రామీణ బ్యాంకులో పంట రుణాలు తీసుకున్నారు. అయితే మా గ్రామానికి సంబంధించి గ్రామీణ బ్యాంకులో ఖాతాలున్న ఎవరి రుణమూ మాఫీ కాలేదు. ఆరా తీస్తే ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ మారడంతో సాంకేతిక సమస్యతో నిధులు మా ఖాతాల్లో పడలేదని చెబుతున్నారు. ఇప్పుడేమో అప్పు చెల్లించాలని బ్యాంకు అధికారులు నోటీసులు ఇస్తున్నారు. -సూదిరెడ్డి సాయి కృష్ణారెడ్డి, రైతు, సోమరిగుడం
మంత్రికి సమస్యను తెలిపాం
తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకులో లక్ష 26 వేల రూపాయలు తీసుకున్నాను. ప్రభుత్వం అందరికీ రుణమాఫీ చేసినప్పటికీ ఫలితం మాకు దక్కలేదు. మా సమస్యను పరిష్కరించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి విన్నవించాం. -నంద్యాల శ్యాంసుందర్ రెడ్డి, రైతు, ఎర్రగడ్డలగూడెం
అన్ని అర్హతలున్నా రుణమాఫీ కాలే..
నేను రెండెకరాల వ్యవసాయ భూమికి లక్ష రూపాయలు రుణం తీసుకున్నా. వడ్డీతో కలిపి రూ.1,37,000 అయింది. ప్రభుత్వం రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తుందని ప్రకటించినప్పటికీ అన్ని అర్హతలు ఉన్నా నేను పొందలేకపోయాను. అధికారుల తప్పిదం మాకు శాపంగా మారింది. -గంధ మల్ల రాములు, ఎర్రగడ్డలగూడెం
తక్షణమే చేయాలి
సాంకేతిక కారణాలతో రైతులకు చెందాల్సిన రుణమాఫీ నిధులు వెనక్కి పోవడం బాధాకరం. ఏది ఏమైనప్పటికీ మంత్రులు జోక్యం చేసుకొని రైతుల రుణమాఫీని తక్షణమే చేయాలి.
-ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, రైతు సంఘం రాష్ట్ర నాయకులు
ప్రభుత్వానికి నివేదించాం
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ నుంచి తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్‌గా రూపాంతరం చెందిన క్రమంలో ఏర్పడిన సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కాలేదు. రుణమాఫీలో జరిగిన తప్పిదంపై ప్రభుత్వానికి నివేదించాం. సమస్య పరిష్కారం ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. -పాల్వాయి శ్రవణ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి



