నవతెలంగాణ – కామారెడ్డి
కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ముఖ్యఅతిథిగా పాల్గొని కాళోజి నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సాహిత్య వర్గ ప్రతినిధులు మాట్లాడుతూ.. కాళోజి తన కవిత్వంతో ప్రజల కష్టాలు, ఆశలు, ఆకాంక్షలకు స్వరమిచ్చారన్నారు. ఆయన రచనలు సామాజిక చైతన్యానికి మార్గదర్శకం అని పేర్కొన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కాళోజి నారాయణరావు తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో అగ్రగణ్యులలని అన్నారు. ఆయన రచనల్లో సమాజంలోని సమస్యలు ప్రతిఫలించాయని తెలిపారు. ప్రజల కోసం, తెలుగు సాహిత్యం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయం అని వివరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చందర్ నాయక్, డిబిసిడిఓ జయరాజ్, అసిస్టెంట్ బిసిడిఓ చక్రధర్, సాహితీ మిత్రులు, బహుజన సంఘాల నాయకులు కొత్తపల్లి మల్లయ్య, నాగభూషణం, గంగారాం, నాగరాజు, నరేష్, పవన్ అశ్వక్, జిల్లా అధికారులు, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.