– అధికారులందరూ సమన్వయంతో పని చేయాలి
– ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
నవతెలంగాణ అచ్చంపేట:
నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని నల్లమల అడవిలో వెలసిన లింగమయ్య స్వామి ఆలయంలో జరగనున్న సలేశ్వరం జాతర కు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేపట్టింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు సమన్వయంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గురువారం సంబంధిత అధికారులతో కలిసి నల్లమల అటవీ ప్రాంతాన్ని సందర్శించి, జాతర ఏర్పాట్లు మరియు ట్రెక్కింగ్ మార్గాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అడవిలోని క్లిష్ట పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి సంవత్సరం సలేశ్వరం జాతరకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి మరింత రద్దీ ఉండే అవకాశముందని పేర్కొన్నారు.
భక్తుల సౌకర్యం కోసం తాగునీటి సరఫరా, వైద్య సేవలు, తాత్కాలిక శిబిరాలు, భద్రతా ఏర్పాట్లు వంటి అంశాలను సమర్థంగా అమలు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా అడవి మార్గాల్లో దర్శనానికి వచ్చే భక్తుల కోసం స్పష్టమైన మార్గదర్శక బోర్డులు ఏర్పాటు చేయడం, ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక సూచనలు ఉంచడం, అవసరమైన చోట్ల సిబ్బందిని నియమించడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు.

అదేవిధంగా శుభ్రత నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, చెత్తను నియంత్రించే చర్యలు చేపట్టాలని అధికారులకు తెలిపారు. జాతర సమయంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించేందుకు వైద్య బృందాలు, అత్యవసర సేవల సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అగ్నిప్రమాదాల నివారణ కోసం ఆలయ పరిసరాల్లో అగ్నిమాపక సిబ్బంది, ఫైర్ ఇంజిన్లను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు.
భక్తుల రద్దీని నియంత్రించేందుకు ముఖ్య ప్రాంతాల్లో మైక్ సిస్టమ్ ఏర్పాటు చేసి సమాచారం అందించేలా చూడాలని, పోలీస్ శాఖ ద్వారా ప్రత్యేక ఔట్‌పోస్ట్ ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. ఎవరైనా తప్పిపోయిన సందర్భంలో వెంటనే గుర్తించి కుటుంబ సభ్యులకు చేరవేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణంలో స్వామి దర్శనం కల్పించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు.
రాబోయే వేసవి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో తాగునీటి సరఫరాను విస్తరించడంతో పాటు చల్లని నీడ కల్పించే శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు తాత్కాలిక షెడ్లు, టెంట్లు ఏర్పాటు చేయడం, సమస్యలు తలెత్తకుండా వైద్య శిబిరాలను సిద్ధంగా ఉంచాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే చికిత్స అందేలా వైద్య సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలని సూచించారు. మహిళలు ఇబ్బందులు ఎదుర్కోకుండా వారికి ప్రత్యేకంగా నీటి సరఫరాతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించినారు.
సలేశ్వరం జాతర నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని గర్భిణీ మహిళలు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న భక్తులు జాతరకు రాకుండా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నల్లమల అడవిలోని కఠినమైన ట్రెక్కింగ్ మార్గాలు, ఎత్తైన ప్రదేశాలు, వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు వంటి పరిస్థితులు ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నందున ఈ సూచనలు చేసినట్లు తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో వైద్య సహాయం అందుబాటులో ఉన్నప్పటికీ, ఇలాంటి వర్గాల భక్తులు జాగ్రత్తగా ఉండడం మంచిదని అన్నారు. ఇతర భక్తులు కూడా ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జాతరకు హాజరుకావాలని సూచించారు. భక్తులందరూ సురక్షితంగా ఉండటం ప్రధాన లక్ష్యమని, అవసరమైన జాగ్రత్తలు పాటిస్తూ స్వామి దర్శనం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.



