Saturday, July 5, 2025
E-PAPER
Homeమానవిఓ ఆడ‌ప‌డుచు త‌ప‌న

ఓ ఆడ‌ప‌డుచు త‌ప‌న

- Advertisement -

ఆడపడుచు, వదిన, మరదళ్ల సంబంధం చాలా విచిత్రంగా ఉంటుంది. కొన్ని సార్లు మంచి స్నేహితుల్లా, కొన్నిసార్లు బద్ద శత్రువులుగా, మరి కొన్ని సార్లు అక్కచెల్లెళ్లుగా ఉంటారు. కొందరు ఆడపడుచులు వదినల జీవితం గురించి ఎంతో ఆలోచిస్తారు. వారి సమస్యలు తెలుసుకొని ప్రయత్నించేందుకు కృషి చేస్తారు. అలాంటి ఆడపడుచు ఉన్న ఇంట్లో సమస్యలకు ఆస్కారమే ఉండదు. అలాంటి ఓ కథనమే ఈ వారం ఐద్వా అదాలత్‌(ఐలమ్మ ట్రస్ట్‌)లో మీకోసం…
రాజ్యలక్ష్మికి సుమారు 53 ఏండ్లు ఉంటాయి. భర్త ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. వీరికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. కొడుకు రవి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను మాలతిని ప్రేమించి పెండ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చాడు. మాలతి వేరే సామాజిక తరగతికి చెందిన అమ్మాయి. అయినా అందరితో బాగా కలిసిపోతుంది. రవి, మాలతీల పెండ్లి జరిగి మూడేండ్లు అవుతుంది.


రాజ్యలక్ష్మి కూతురు రమ్య పెండ్లి జరిగి రెండేండ్లు అవుతుంది. పెండ్లి జరిగిన ఏడాది వరకు అందరూ బాగానే ఉన్నారు. ఏడాది నుండి రమ్య రవికి, మాలతి మధ్య గొడవలు పెడుతుంది. దాంతో ఇద్దరూ విడిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు విడిపోవాలనుకుంటున్నారంటే దానికి కారణం చెప్పడం లేదు. రమ్య రవికి పూర్తిగా సపోర్ట్‌ చేస్తుంది. ‘నా చెల్లి చెప్పింది వేదం. తను మాలతిని వదిలేయమని చెబుతుంది. అందుకే నేను విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను’ అంటాడు. ‘ఎంతగా నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. అందుకే మీ దగ్గరకు వచ్చాను. మీరే ఎలాగైనా వాళ్లతో మాట్లాడి సమస్య పరిష్కరించండి’ అంటూ రాజ్యలక్ష్మి ఐద్వా అదాలత్‌కు వచ్చింది.


అంతా విని రమ్య, రవి, మాలతిలను పిలిపించాము. మొదట రవితో మాట్లాడితే ‘నాకు ఈ మధ్య కాలంలో మాలతి నచ్చడం లేదు. నేను చెప్పింది ఏదీ వినడం లేదు. ఆమెకు నచ్చినట్టు ఉంటుంది. ఇంట్లో వాళ్లు కూడా పట్టించుకోవడం లేదు. ఇక నేనెందుకు ఆమెతో ఉండాలి. మా అమ్మ నన్ను ఇక్కడి వరకు ఎందుకు తీసుకొచ్చిందే అర్థం కావడం లేదు. అలాగే మా చెల్లికి కూడా నేనూ మాలతీ కలిసి ఉండడం ఇష్టం లేదు. ఆమెకు ఇష్టం లేని పని ఏదీ నేను చేయను. అందుకే విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను’ అన్నాడు.


ఈ విషయం ఆమెకు చెప్పారా అంటే ‘చెప్పాను, దానికి ఆమె ఏమో చెబుతుంది. కొద్దిగా టైం కావాలి అంటుంది’ అన్నాడు. అతన్ని బయట కూర్చోబెట్టి మేము రమ్యను పిలిపించి ‘మీకు మాలతి అంటే ఎందుకు ఇష్టం లేదు. అసలు ఏం జరిగింది, మీ అన్నా వదినలు విడిపోవాలని ఎందుకు అనుకుంటున్నారు’ అని అడిగితే. ‘ఏమీ లేదు మేడం, మా అన్నయ్య మా వదిన మాలతీని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఆయన ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. కానీ ఆరు నెలలు మాత్రమే వదినతో ప్రేమగా ఉన్నాడు. తర్వాత నుండి అనుమానిస్తున్నాడు. కొట్టడం, వేరే వాళ్లతో సంబంధాలు అంటకట్టడం చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో అయితే అసలు ఆమెను ఓ మనిషిగానే చూడడం లేదు. మానసికంగా హింసిస్తున్నాడు. ఇంట్లో ఎవరికీ ఈ విషయం తెలియదు. వదిన ఎవరికీ చెప్పలేదు. ఇదంతా మౌనంగా ఎందుకు భరిస్తుందో నాకు అర్థం కావడం లేదు. నేను మొదట వదినకే చెప్పాను. రవిని వదిలేసి వెళ్లిపో, నీ జీవితం నీకు నచ్చినట్టుగా ఉండు అన్నాను. కానీ ఆమె వినిపించుకోవడం లేదు. ఈ విషయంలోనే నాకూ, వదినకు బాగా గొడవ జరుగుతుంది. నాకు మా వదినంటే చాలా ఇష్టం. నన్ను బాగా చూసుకుంది. మా అమ్మను కూడా చూసుకుంటుంది. అన్నయ్య మా అమ్మ వాళ్లను పట్టించుకోడు. అలాంటి ఆమె ఇలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. నీ పద్దతి మార్చుకో అని మా అన్నయ్యకు చెబితే వినడు. అందుకే విడాకులు తీసుకుంటే తనైనా సంతోషంగా ఉంటుందని నా ఆలోచన’ అంది.


ఇదే విషయం గురించి మాలతితో మాట్లాడితే ‘ప్రేమించి పెండ్లి చేసుకున్నాను. నాకు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. పెండ్లి విషయంలో నేను పొరపాటు చేశాను. ఇంట్లో వాళ్లను ఒప్పించి చేసుకుంటే బాగుండేది. ఇప్పుడు రవి నన్ను ఇబ్బంది పెడుతున్నాడని ఎక్కడకు వెళ్లాలి. అలా వెళితే నన్ను అర్థం చేసుకునే పరిస్థితి మా ఇంట్లో లేదు. రవికి వేరే ఆడవాళ్లతో సంబంధం ఉంది. కానీ నేనే ఎవరితోనే సంబంధం పెట్టుకున్నానని ప్రచారం చేస్తున్నాడు. మానసికంగా హింసిస్తున్నాడు. నా జీతం మొత్తం అతనికి ఇవ్వాలి. ఇంట్లో ఎలాంటి బాధ్యతలూ తీసుకోడు. అన్నీ నేనే చూసుకోవాలి. ఇలాంటి వ్యక్తితో జీవించడం కష్టం. చనిపోవడానికి కూడా ప్రయత్నించాను. అప్పుడు రమ్యే నాకు ధైర్యం చెప్పింది. కానీ రవి అంటే నాకు చాలా ఇష్టం. అతను లేకుండా నేను ఉండలేను. కొన్ని సార్లు రమ్య చెప్పిందే సరైనది అనిపిస్తుంది. ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నేను విడాకులు తీసుకుంటే నా చెల్లెళ్లకు పెండ్లి జరగడం కష్టం. అందుకే ధైర్యం చేయలేక రవి పెట్టే బాధలను భరిస్తున్నాను’ అన్నది.


రవిని పిలిచి అడిగితే ‘మాలతి అంటే ఈ మధ్య నాకు నచ్చడం లేదు. అందుకే వేరే వాళ్లతో సంబంధం పెట్టుకున్నాను. నేను మగాడిని. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండొచ్చు. ఆమెకు నచ్చకపోతే వదిలేసి వెళ్లమనండి. లేదంటే సైలెంట్‌గా ఉండమనండి’ అన్నాడు. దాంతో రాజ్యలక్ష్మి ‘ఒరేరు వెధవ నీ గురించి తెలిసి కూడా నిన్ను వెనకేసుకొని వచ్చాను. నేను చేసింది తప్పు కాబట్టి ఇప్పుడు చెబుతున్నాను. నువ్వు ఇంట్లో వుండాల్సిన అవసరం లేదు. మాకు రమ్య ఎంతో మాలతి కూడా అంతే. ఆమె మాతోనే ఉంటుంది. నువ్వే ఇంట్లో నుండి వెళ్లిపో. ఇక్కడకు తీసుకొస్తే రవిలో మార్పు వస్తుంది అనుకున్నాం. ఎవరు చెప్పినా వాడు వినే స్థితిలో లేడు. మాలతికి ఇష్టం అయితే మాతో ఉండొచ్చు. లేదంటే తనకు నచ్చిన చోట ఉండొచ్చు. మేము ఆమెకే సపోర్ట్‌ చేస్తాం’ అంది. రమ్య కూడా వదినకే మద్దతు ఇచ్చింది.
‘రవి, నీకు మంచి కుటుంబం ఉంది. మాలతి కూడా చాలా మంచి అమ్మాయి. నువ్వు ఇన్ని తప్పులు చేసినా నిన్ను వదిలి వుండలేనంటుంది. నీ పద్దతి మార్చుకుంటే నీకే మంచిది. లేదంటే దిక్కులేని వాడివవుతావు. మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. మీరు సంబంధం పెట్టుకున్నవాళ్లు మీకు కష్టం వచ్చినప్పుడు తోడు ఉండరు. కుటుంబ సభ్యులే మీకు అండగా నిలబడేది. బాగా ఆలోచించుకొని నిర్ణయించుకోండి’ అన్నాము.


‘రమ్య, మీరు మీ వదిన కోసం చాలా చేస్తున్నారు. మీలాంటి ఆడపడుచులు ఉంటే ప్రతి ఇల్లూ సంతోషంగా ఉంటుంది. అలాగే మాలతి మీరు విడాకులు తీసుకుంటే మీ చెల్లెళ్ల భవిష్యత్తు ఏమవుతుందో అని ఆలోచిస్తున్నారు. అలాంటి భయాలేమీ పెట్టుకోకండి. రవిలో మార్పు వస్తే కలిసి ఉండొచ్చు. లేదంటే మీ జీవితం మీరు చూసుకుంటే మంచిది. మీకు మంచి అత్త, ఆడపడుచు దొరికారు. కాబట్టి కొన్ని రోజులు ఓపిక పట్టి అప్పుడు నిర్ణయం తీసుకోండి’ అని చెప్పి పంపించాము.
– వై వరలక్ష్మి, 9948794051

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -