Monday, March 23, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుయుద్ధాల వల్ల ఆయిల్‌ గ్యాస్‌ సంక్షోభం

యుద్ధాల వల్ల ఆయిల్‌ గ్యాస్‌ సంక్షోభం

- Advertisement -

ట్రంప్‌ అడుగులకు మడుగులొత్తుతున్న ప్రధాని మోడీ
దేశ ప్రతిష్టను అప్రతిష్టపాలు చేసే వ్యవహారం
ఉపాధి హామీ చట్టం నిర్వీర్యం
రాజ్యాంగంలో లౌకిక పదాన్ని తొలగించడం సార్వభౌమత్వానికి గొడ్డలిపెట్టు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

నవతెలంగాణ- మిర్యాలగూడటౌన్‌
ప్రపంచంలో యుద్ధాల వల్ల చమురు, ఆయిల్‌, గ్యాస్‌ సంక్షేభం ఏర్పడి ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం పడుతోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్‌పై యుద్ధాన్ని ఆపాలంటూ భారత ప్రధాని మోడీ పార్లమెంటులో తీర్మానం కూడా ప్రవేశపెట్టకుండా ట్రంప్‌ అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని విమర్శించారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాల గూడ పట్టణంలో సీపీఐ(ఎం) డివిజన్‌ స్థాయి సమావేశం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికారి మల్లేష్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. అమెరికా-ఇజ్రాయిల్‌ ఇరాన్‌పై చేస్తున్న యుద్ధం వల్ల ఆయిల్‌ సంక్షోభంతో గ్యాస్‌ ధరలు పెరిగి ప్రజలు కోలుకోలేని స్థితి ఏర్పడిందన్నారు. యుద్ధాన్ని ఐక్యరాజ్యసమితి వ్యతిరేకించినా ట్రంప్‌ తన ఆధిపత్య ధోరణి మానుకోవడం లేదన్నారు.

భారత ప్రధాని మోడీ వెనిజులా దేశ పర్యటనకు వెళ్లి అక్కడ అమెరికా జరుపుతున్న యుద్ధాన్ని ఖండించలేదని, ఇది శాంతికి భంగం కలుగుతుందని తెలిపారు. దేశ ప్రతిష్టను అప్రతిష్టపాలు చేసే విధంగా మోడీ వ్యవహారం ఉందన్నారు. దేశంలో ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యపరిచారన్నారు. హక్కులను హరించేలా నాలుగు లేబర్‌కోడ్‌లను తెచ్చి కార్మికుల్లో అభద్రతాభావం కల్పించారని తెలిపారు. అటవీ హక్కుల చట్టాన్ని సవరిస్తూ భూములను కార్పొరేట్‌ శక్తులకు అమ్మి కోట్లు కూడబెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడవిలో గిరిజనులకు అండగా ఉంటున్న మావోయిస్టులను అంతమొందించే విధంగా వారిని ఏరివేత కార్యక్రమం చేపట్టారని అన్నారు.

రాజ్యాంగంలోని లౌకిక పదాన్ని తొలగిస్తామనడం దేశ సార్వభౌమత్వానికి గొడ్డలిపెట్టు వంటిదన్నారు. ఈ క్రమంలో బీజేపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై లౌకిక శక్తులను కూడగట్టుకుని తమ పార్టీ పోరాడుతుందని తెలిపారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర పాలకులు ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారని, దీన్ని ఏమాత్రం సహించబోమన్నారు. ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజలను చైతన్యం చేస్తామన్నారు. రాష్ట్ర బడ్జెట్‌ ప్రజాఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉందని, పేదలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడం లేదని విమర్శించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నారి ఐలయ్య, చినపాక లక్ష్మీనారాయణ, పాలడుగు నాగార్జున, వీరవెళ్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -