Wednesday, April 8, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిచమురు-ప్రపంచ ఆర్థిక వ్యవస్థ

చమురు-ప్రపంచ ఆర్థిక వ్యవస్థ

- Advertisement -

అమెరికా-ఇజ్రాయిల్‌ చేస్తున్న బాంబు దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్‌ హార్ముజ్‌ జలసంధిని మూసివేసింది. దాంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలమైపోతోంది. అమెరికన్‌ డాలర్ల లెక్కలో ముడిచమురు ధరలు పెరిగిపో యాయి. దాని వెనువెంటనే ఇతర దేశాల కరెన్సీల, ముఖ్యంగా ఆసియా దేశాల కరెన్సీల విలు వలు పడిపోవడం మొదలైంది. దీని ఫలితంగా సంపన్న పెట్టుబడిదారీ దేశాలలో కన్నా ఎక్కువ మోతాదులో మూడవ ప్రపంచ దేశాలలో ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. ఇలా ద్రవ్యోల్బణం పెరిగిపోవడం వలన ప్రజల కొను గోలు శక్తి హరించుకు పోతోంది. అందువలన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆర్థికమాంద్య ప్రమాదాన్ని ఎదుర్కొం టోంది. ఈ ఆర్థిక మాంద్యం కూడా సంపన్న పెట్టుబడిదారీ దేశాలలో కన్నా ఎక్కువ స్థాయిలో మూడవ ప్రపంచ దేశాలలో నెలకొంటోంది. చమురుకు కొరత ఏర్పడినందువలన ఎరువుల ఉత్పత్తి తగ్గిపోయింది. దాంతో ఆ ఎరువుల కొరత ఏర్పడింది. దాని ఫలితంగా ఆహారధాన్యాల ఉత్పత్తి దెబ్బతింటోంది. ముఖ్యంగా మూడవ ప్రపంచ దేశాలలో దుర్భర పరిస్థితుల మధ్య శ్రామిక ప్రజానీకం చిక్కుకుపోతున్నారు.

కనుచూపు మేరలో ఈ సంక్షోభానికి ముగింపు కనిపించడం లేదు. ఈ సంక్షోభానికి దారి తీసిన చట్టవిరుద్ధమైన, అనైతికమైన యుద్ధానికి ముగింపు కానరాకపోవడమే దీనికి కారణం. స్వతంత్ర దేశాల సార్వ భౌమాధి కారాన్ని దెబ్బ తీసేలా రెండు ‘పోకిరీ’ దేశాలు- అమెరికా, ఇజ్రాయిల్‌ చేస్తున్న నిర్వాకం ఇది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చమురు చాలా చిన్న భాగం. కాని ఆ చమురు ధరల పెరుగు దల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇంత స్థాయిలో అవాంతరాలు కల్పించడం అసంగతంగా కనిపిస్తుంది. నిజానికి ప్రపంచ స్థూల ఉత్పత్తిలో ముడి చమురు విలువ 3 శాతం కన్నా తక్కువే. 2023లో అది కేవలం 2.3 శాతంగా మాత్రమే ఉంది. అయితే తక్కిన ముడి పదార్థాలకన్నా ముడి చమురు చాలా ముఖ్యమైనది. ఇతర ముడి పదార్థాల విలువ కూడా ప్రపంచ స్థూల ఉత్పత్తిలో చాలా చిన్న భాగం మాత్రమే. సామ్రాజ్యవాద విస్తరణ, ఆక్రమణ యత్నాలకు ప్రధాన కారణం ముడిపదార్థాల మీద అదుపు సంపాదించడమేనని మార్క్సిస్టు సిద్ధాంతాలు చెప్పడాన్ని చాలా మంది ఇతర రచయితలు ఈ కారణంగానే ప్రశ్నిస్తూంటారు కూడా.
‘సామ్రాజ్యవాద యుగం’ అన్న తన గ్రంథంలో హారీ మెగ్డాఫ్‌ ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ముడి పదార్థాల విలువ చాలా తక్కువే అయినప్పటికీ, సరుకుల ఉత్పత్తి గాని, ఉత్పత్తి అనంతరం జరిగే మారకం, ఇతర లావాదేవీలు కాని ఈ ముడి సరుకులు లేకుండా జరగలేవు. అందుచేత ముడిసరుకుల విలువ తక్కువగా ఉండడం బట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వాటి ప్రాముఖ్యత ఎంతమాత్రమూ తగ్గదు. మరోలా చెప్పాలంటే, ముడి సరుకుల మారకపు విలువను ఉత్పత్తి అయిన సరుకుల మారకపు విలువతో పోల్చిన ప్పుడు చాలా తగ్గించివేసినప్పటికీ, (నిజానికి వాటి మారకపు విలువ తగ్గిపోవడం కూడా సామ్రాజ్యవాదం పుణ్యమే.) వాటి ఉపయోగపు విలువకు మాత్రం అత్యంత ప్రాధాన్యత ఉంది.

ప్రస్తుత పరిణామాలు ఈ విషయాన్నే బలపరుస్తు న్నాయి. ప్రపంచ చమురు ఉత్పత్తుల్లో-ముడి చమురు మాత్రమే కాక దాని నుంచి వచ్చే వివిధ ఉత్పత్తులన్నీ కలుపుకుని-20 శాతం మాత్రమే హార్ముజ్‌ జలసంధి ద్వారా రవాణా అవుతుంది. అంటే సుమారుగా అది ప్రపంచ జిడిపి లో కేవలం 0.6 శాతం మాత్రమే. మొత్తం ప్రపంచ జిడిపిలో కేవలం 0.6 శాతం రవాణా అవడానికి ఆటంకం ఏర్పడినంత మాత్రాన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇంత పెద్ద స్థాయిలో సంక్షోభం తలెత్తిందంటే చమురు వంటి ముడిసరుకు ఎటువంటి కీలక పాత్ర పోషిస్తోందో బోధపడుతోంది.
ఇంత కీలకమైన పాత్ర పోషించగలగడానికి కారణం చమురు విశ్వవ్యాప్త మధ్యంతర స్థానంలో ఉండడమే. అన్ని రంగాలకూ చమురు అవసరమే. అటువంటి చమురు మొత్తం జిడిపి లో చాలా తక్కువ శాతం ఉండడం వలన అది ఎక్కువ ఇబ్బందులను సృష్టించగలిగే అవకాశం ఎక్కువగా ఉంది. దాని ధర పెరగడం వలన కలిగే ద్రవ్యోల్బణ ప్రభావం అంత తీవ్రగా ఉంటుంది. చమురు వివిధ దొంతరల ఉత్పత్తి క్రమం ద్వారా అంతిమంగా వినిమయ ఉత్పత్తుల రూపంలో మార్కెట్‌లో ప్రవేశిస్తుంది. ఆ ఉత్పత్తుల విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతీ దొంతర వద్దా ధర పెరుగుతూ వుంటుంది. ఇది పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ స్వభావం. ఈ దొంతరలకన్నింటికీ అట్టడుగున ఉన్న ముడి చమురు ధర పెరిగితే ఆపై అన్ని దొంతరలలోనూ దాని ప్రకంపనలు అంతిమ ఉత్పత్తుల ధరల మీద ప్రభావాన్ని చూపిస్తాయి.

తక్కువ దొంతరలలో ఉత్పత్తి క్రమం ఉన్నప్పుడు ముడి చమురు ధరలో 10 శాతం పెరుగుదల ఉంటే కలిగే ప్రభావం తక్కువగా ఉంటుంది. అదే ఉత్పత్తి క్రమంలో దొంతరలు ఎక్కువగా ఉంటే అదే 10 శాతం పెరు గుదల ఎక్కువ ప్రభావాన్ని కలిగిస్తుంది. అందుచేత చమురు వంటి సార్వత్రిక మాధ్యమంగా ఉండే ముడిసరుకు ధరలో పెరుగుదల కలిగించే ద్రవ్యోల్బణ ప్రభావం బహు దొంతరల ఉత్పత్తి క్రమం ఉన్న వ్యవస్థలో ఎక్కువగా ఉంటుంది.
ముడిచమురు ధరలో వచ్చే మార్పు ఆర్థిక వ్యవస్థ మీద ఇంతటి తీవ్ర ప్రభావాన్ని కలిగించగలదు కనుకనే ప్రపంచంలో ప్రధాన కరెన్సీ అయిన డాలర్‌తో పోల్చినప్పుడు దాని విలువను నిలకడగా కొనసాగించడం ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు అంత అవసరం. ఒకప్పుడు అన్ని కరెన్సీల విలువలనూ బంగారం విలువ ప్రమాణంతో పోల్చి నిర్ధారించేవారు. ఇప్పుడు ఆ బంగారం ప్రమాణాన్ని అమలు చేయడం లేదు. ప్రపం చం యావత్తూ డాలర్‌ ప్రాధాన్యత కలిగివున్నా, దానికి కూడా బంగారం ప్రమాణం లేదు.
ఇప్పుడు పైకి చెప్పకపోయినా, డాలర్‌ విలువ ముడిచమురు విలువతో ముడిపడి పోయి వుంది. దానర్ధం ఒకానొక రేటు దగ్గర ముడిచమురు రేటు డాలర్లలో ఖరారై పోయి వుందని కాదు. కాని ముడి చమురు ధర డాలర్ల రూపంలో ఎప్పుడైనా పెరిగితే ఆ పెరుగుదల అదే విధంగా ఎక్కువ కాలం కొనసాగుతుందన్న అంచ నాల తలెత్త కుండా పెట్టుబడిదారీ ప్రపంచం అన్ని ప్రయత్నాలూ చేస్తుంది. విశ్వవ్యాప్త మాధ్య మంగా ఉన్న ముడి చమురు ధర డాలర్లలో అదే పనిగా పెరిగిపోకుండా స్థిరంగా ఒకే ధర దగ్గర కొనసాగడం డాలర్‌ ఆధిపత్యం స్థిరంగా కొనసాగడానికి అత్యంత ఆవశ్య మైన విషయం. ఇప్పుడు మనకి బంగారం ప్రమాణంగా లేకపోవచ్చు. కాని ఒక విధంగా చమురు- డాలర్‌ ప్రమాణం ఉనికిలో ఉంది.

ఈ ప్రమాణం ఇలాగే కొనసాగాలంటే చమురు ధరను డాలర్ల లెక్కలో నిలకడగా కొనసాగించడం చాలా అవసరం. ఈ ప్రమాణాన్ని కొనసాగించాల్సిన అగత్యం వెనుక మరో కారణం కూడా ఉంది.
గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా వాణిజ్య చెల్లింపుల్లో భారీ లోటు కొనసాగుతూనే వుంది. ఆ లోటును భర్తీ చేయ డానికి అమెరికా డాలర్లను ముద్రించి విడుదల చేస్తోంది. ఆ డాలర్లను స్వీకరించడానికి, వాటి విలువను అంగీకరించ డానికి ప్రపంచం కూడా సుముఖంగానే ఉంది. అందుచేత ఇప్పుడు ప్రపంచం అంతా డాలర్లు ఎక్కడబడితే అక్కడ ఉన్నాయి. ఈ పరిస్థితిలో డాలర్‌ ప్రమాణం ప్రశ్నార్ధకంగా మారే పరిస్థితి దాపురిస్తే మొత్తం పెట్టుబడిదారీ ప్రపంచ స్థిరత్వమే ప్రమాదంలో పడుతుంది. అందుచేత చమురు- డాలర్‌ ప్రమాణాన్ని నిలబెట్టుకోవడం మరింత కీలకంగా మారింది. అలా నిలబెట్టుకోడానికే చమురును ఉత్పత్తి చేసే దేశాల మీద రాజకీయ ఆధిపత్యాన్ని చెలాయిం చడానికి అమెరికా పూనుకుంటోంది.

అనేక గల్ఫ్‌దేశాల్లో ఇప్పటికే అమెరికా అటువంటి ఆధిపత్యాన్ని కలిగి వుంది. ఇరాన్‌ను, వెనిజులాను కూడా తన పెత్తనం కిందకు తెచ్చుకుని సంపూర్ణ ఆధిపత్యం సాధిం చాలని అమెరికా ప్రయత్నిస్తోంది. వెనిజులా విషయంలో కొంతవరకు అమెరికా కోరుకున్నది నెరవేరే సూచనలు కనిపిస్తున్నా, ఇరాన్‌ విషయం మాత్రం వేరేగా ఉంది. ఇరాన్‌లో ప్రభుత్వాన్ని గద్దె దించేసి తన తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలనన్న ధీమాతో అమెరికా ఇరాన్‌ మీద దాడికి దిగింది.
అయతుల్లా ఆలీ ఖమేనీతో సహా ఇరాన్‌ ఉన్నతాధి కారులను అంతం చేసి తన చెప్పుచేతల్లోకి ఇరాన్‌ను తెచ్చు కోవాలని, అందుకు ఇజ్రాయిల్‌ను వాడుకోవాలని అమెరికా చూసింది. తన డాలర్‌ సర్వాధిపత్యాన్ని మరింత బలపరుచు కోవాలన్న ఉద్దేశంతో అమెరికా చేసిన ఈ ప్రయత్నం వాస్తవానికి ఆ డాలర్‌ ఆధిపత్య స్థానాన్నే బలహీనపరిచే దిశగా పరిణమించింది.
ఇరాన్‌ విషయంలో అమెరికా వేసిన లెక్కలు తప్పాయి. దాంతో ఇరాన్‌ మీద ఆధిపత్యం సాధించడం మాట అటుంచి, డాలర్‌ స్థిరత్వమే ప్రమాదంలో పడింది. దాని పర్యవసానంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడింది. సామాన్య ప్రజానీకాన్ని తీవ్ర దారిద్య్రంలోకి నెడుతున్న ఈ పరిస్థితులు ఆ ప్రజానీకంలో పెల్లుబుకుతున్న ఆగ్రహానికి కారణమౌతు న్నాయి. ఈ ఆగ్రహం ఆ ప్రజానీకాన్ని ఈ పెట్టుబడిదారీ వ్యవస్థకే వ్యతిరేకంగా నిలబెట్టేంత తీవ్ర స్థాయిలో ఉంది.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్‌ పట్నాయక్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -