ముంబయి : భారతదేశ చమురు దిగుమతులు 18 నెలల కనిష్ఠానికి పడిపోయాయి. ఈ ఏడాది జులైలో 1.85 కోట్ల మెట్రిక్ టన్నుల చమురు దిగుమతి జరిగింది. ఇంతక్రితం నెల దిగుమతులతో పోల్చితే 8.7 శాతం తగ్గడం ద్వారా.. ఫిబ్రవరి 2024 కనిష్ట స్థాయికి పడిపోయాయి. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు చేసుకోవడం వల్లే భారత్‌పై అదనంగా 25 శాతం టారిఫ్‌లు వేస్తున్నామని ఇటీవల ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికా ఆంక్షల మేరకే కేంద్రం చమురు దిగుమతిని తగ్గించి ఉంటుందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కాగా.. దేశీయ రిఫైనరీలలో నిర్వహణ కోసం షట్‌డౌన్‌లు, డిమాండ్‌లో సీజనల్ మందగమనం, గ్లోబల్ ఆయిల్ ధరలలో హెచ్చుతగ్గులు దిగుమతులకు ప్రధాన కారణమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గడిచిన జులైలో రష్యా నుంచి దిగుమతులు భారీగా తగ్గాయి. సౌదీ అరేబియా, ఇరాక్ నుంచి సరఫరా స్థిరంగా ఉంది. దేశీయ ఇంధన డిమాండ్‌లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది. ముఖ్యంగా డీజిల్, పెట్రోల్ వినియోగంలో ఈ పరిస్థితి భారతదేశ ఆర్థిక వ్యవస్థపై స్వల్ప ప్రభావం చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు.