ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి
అనువైన స్థలం కోసం కలెక్టర్‌తో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన
నవతెలంగాణ-మాక్లూర్
రైతులకు లాభాల పంట ఆయిల్ పామ్ పంట అని, దాని అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం గుత్ప గ్రామ శివారులో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయిల్ పామ్ ఇండిస్టీ నెలకొల్పేందుకు అనువైన స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అధిక లాభాలను అందిస్తూ, అనేక ప్రయోజనాలు సమకూర్చే ఆయిల్ పామ్ పంట సాగు దిశగా రైతులను ప్రోత్సహించేలా జిల్లా యంత్రాంగం తోడ్పాటుతో ప్రత్యేక చొరవ చూపుతున్నామని, ఫలితంగా జిల్లాలో సుమారు 7 వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ పంట సాగు జరుగుతోందన్నారు.
ఈ నేపధ్యంలోనే జిల్లాలో ఆయిల్ పామ్ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సమగ్ర వివరాలతో నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు. స్థల నిర్ధారణ జరిగిన వెంటనే ఫ్యాక్టరీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని అన్నారు. దేశ వ్యాప్తంగా స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా 75 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు జరగాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం పది శాతం విస్తీర్ణంలోపే ఈ పంట సాగు చేస్తున్నారని తెలిపారు. స్థానికంగానే ఆయిల్ పామ్ పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తే, రైతులు అధిక లాభాలు ఆర్జించడంతో పాటు ప్రజలకు కూడా మేలు చేసిన వారవుతారని అన్నారు. ఆయిల్ పామ్ పంట సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలతో కూడిన ప్రోత్సాహకాలను అందిస్తోందని, ఇన్ పుట్ సబ్సిడీని రైతు ఖాతాలో జమ చేస్తోందని తెలిపారు.
ఆయిల్ పామ్ మొక్కలకు అయ్యే వ్యయంలో కూడా అధిక మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తూ సబ్సిడీ రూపంలో కంపెనీలకు చెల్లిస్తుందని అన్నారు. ఆయిల్ పామ్ బోర్డు ఉన్నందున పంట అమ్మకం, ధర విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం ఉండదని భరోసా కల్పించారు. ఎకరం విస్తీర్ణంలో సుమారు పది టన్నుల వరకు దిగుబడి వస్తుందని, అంతర పంట వేసుకొని అదనపు లాభాలను సైతం పొందవచ్చని సూచించారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ పంటకు ఉన్న డిమాండ్ ను బట్టి చూస్తే ఎకరానికి కనీసం రూ. రెండు లక్షల పైగా ఆదాయం ఆర్జించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. స్థల పరిశీలన జరిపిన వారిలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మెన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మెన్ మానాల మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, రమణ్ రెడ్డి తదితరులు ఉన్నారు.



