– ప్లాంటేషన్‌పై రైతులకు అవగాహన కల్పించాలి : వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు
– కామారెడ్డి జిల్లా పాల్వంచలోని వ్యవసాయ క్షేత్రంలో మాస్ ప్లాంటేషన్
నవతెలంగాణ-కామారెడ్డి
ఆయిల్‌పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రం శివారులోని ఓ వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన ఆయిల్ పామ్ మాస్ ప్లాంటేషన్ కార్యక్రమంలో హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌తో కలసి మంత్రి తుమ్మల పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఆర్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన రైతు సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డి జిల్లాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ఆయిల్ పామ్ సాగులో అంతర పంటలను సాగు చేసి అదనపు ఆదాయం పొందొచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ మిషన్ వంటనూనెలు ఆయిల్ పామ్ (ఎన్‌ఎంఈఓ-ఓపీ) పథకం కింద ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆదాయం పెంచుకోవాలని సూచించారు. ఈ పథకాన్ని పురస్కరించుకుని, కేంద్ర వ్యవసాయ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం పరస్పర సమన్వయంతో ఉద్యానశాఖ ద్వారా జిల్లాలో ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేయనున్న పామాయిల్ మిల్ ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు గెలలను కొనుగోలు చేసి, 14 రోజుల్లోపే రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో బహుళ జాతి సంస్థ అయిన హెచ్‌యూఎల్‌కు జిల్లాలో ఆయిల్‌పామ్ తోటల అభివృద్ధి బాధ్యతలు అప్పగిం చినట్టు చెప్పారు. ప్రభుత్వం మొదటి నాలుగేండ్ల కాలానికి ఎకరాకు గరిష్టంగా రూ.50,918 వరకు (పథకం నిబంధనల ప్రకారం) రాయితీ అందిస్తుం దన్నారు. రైతు తన వాటాగా ఒక మొక్కకు రూ.20 చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్ పరికరాల ఏర్పాటు కోసం కూడా ఎకరాకు రూ.5వేలు అందించనున్నట్టు చెప్పారు. ఈ మొత్తం నేరుగా డ్రిప్ ఇరిగేషన్ సంస్థకు చెల్లించబడుతుందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ సాగు రైతులకు దీర్ఘకాలిక ఆదాయం అందించే పంటగా మారుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ మిషన్ వంటనూనెలు, ఆయిల్ పామ్ పథకం ద్వారా అందిస్తున్న సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, పాల్వంచ తహసీల్దార్, వ్యవసాయ శాఖ, హార్టి కల్చర్, సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



