ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రులు తుమ్మల, పొన్నం
అధికారులతో కలిసి ఫ్యాక్టరీ పరిసరాల పరిశీలన
రాష్ట్రంలో పండే బియ్యాన్ని కేంద్రం కొనబోమని చెప్పిందన్న మంత్రులు
పంటమార్పిడి చేసుకోవాలని రైతులకు సూచన
నవతెలంగాణ-నంగునూరు
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని నర్మెట్ట గ్రామంలో రూ.300 కోట్లతో నిర్మించిన ఆయిల్ ఫెడ్ వారి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఈనెల 22న సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆయిల్ ఫెడ్ చైర్మెన్ జంగా రాఘవ రెడ్డి, కలెక్టర్ కె.హైమావతి, ఆయిల్ ఫెడ్ ఎండి యాష్మిన్ భాషా, సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్‌తో కలిసి ఫ్యాక్టరీని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. దేశంలోనే అత్యధిక టెక్నాలజీతో నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని 22న రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించనున్నట్టు చెప్పారు. అదేరోజు రూ.40కోట్లతో ఆయిల్ రిఫైనరీ యూనిట్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేస్తారన్నారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో గల ఆయిల్‌పంప్ ఫ్యాక్టరీలో క్రూడ్ ఆయిల్ మాత్రమే తీస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో దేశంలోనే అత్యధిక వరి పండే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో పండే బియ్యాన్ని కొననని తెగేసి చెప్పిందన్నారు. ఈ సమయంలో పంటమార్పిడి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదన్నారు. ముఖ్యంగా ఎలాంటి చీడ, పీడ బాధలు, అడవి పందులు, కోతులు, వడగండ్ల వానల బాధలు లేని రైతుకు స్థిరమైన అధిక ఆదాయాన్ని సమకూర్చే ఆయిల్ పామ్ తోటల పెంపకానికి రైతులు ముందుకు రావాలన్నారు.
రైతులు ధైర్యంగా ముందుకు వచ్చి ఆయిల్ పామ్ పంటలు పండించాలన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా మొదటి సంతకం నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి చేశానని.. అప్పుడు రూ.12,000 ఉన్న ధర ఇప్పుడు రూ.21,546 కు చేరిందన్నారు. ఈ ధరను రూ.25 వేల పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. సిద్దిపేటలో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల రైతులకు అందుబాటులోకీ ఉంటదన్నారు. ఫ్యాక్టరీని ప్రారంభించడంతోపాటు 20, 21, 22 తేదీల్లో ఫ్యాక్టరీ ఆవరణలో రైతుమేళా నిర్వహిస్తామన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఇటీవల గుజరాత్ వెళ్లినప్పుడు అక్కడ పాల సేకరణ గ్రామీణ స్థాయి నుండి జరుగుతున్నదని. అక్కడి అమూల్ పాలు దేశ వ్యాప్తంగా వ్యాపించాయని అన్నారు. అదేవిధంగా ఇక్కడ ఆయిల్ పామ్‌ను తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారని, ప్రతీ జిల్లాకు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభించాలని భావిస్తున్నారని అన్నారు. ఈ ప్రాంత రైతాంగానికి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఆయిల్ ఫ్యాక్టరీకి రూపం తెచ్చిన మంత్రికి ధన్యవాదాలు అని తెలిపారు.
ఆయిల్ ఫెడ్ చైర్మెన్ జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ అంటేనే తుమ్మల నాగేశ్వరరావు అని, ఫ్యాక్టరీ నిర్మాణం త్వరగా పూర్తి అయ్యేందుకు ప్రత్యేక చొరవ చూపారన్నారు. కలెక్టర్ కె.హైమావతి మాట్లాడుతూ.. సాధారణంగా వరిని పండించడం రైతులకు అలవాటైందని, పంట మార్పిడి చేసుకోక పొతే భవిష్యత్తులో ఇబ్బంది పడతారన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఆర్డీవో సదానందం, జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపారాణి, ఆయిల్ ఫేడ్ అధికారులు సుధాకర్ రెడ్డి, శ్రీకాంత్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.



