ట్రంప్‌నకు హామీ ఇచ్చిన బ్రిటన్ ప్రధాని
లండన్ : రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేసేందుకు బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్ అంగీకరించారని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. అంతేకాక ఆంక్షలు విధించడం లో భాగస్వామి అవుతానని కూడా చెప్పారని అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలును కొనసాగిస్తున్న నాటో, యూరోపియన్ యూనియన్ దేశాలపై తాను విమర్శలు చేసినప్పుడు స్టార్మర్ ‘ఇబ్బంది’ పడ్డారని చెప్పుకొచ్చారు. బ్రిటన్ పర్యటన నుంచి స్వదేశానికి తిరిగి వస్తూ ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ విలేకరులతో ముచ్చటించారు. ఉక్రెయిన్ గురించి స్టార్మర్ మీతో మాట్లాడారా అని విలేకరులు ప్రశ్నించగా రష్యా నుంచి యూరోపియన్ దేశాలు చమురును కొనుగోలు చేస్తుండడంపై బ్రిటన్ నేత కొంత ఇబ్బంది ఫీల్ అయ్యారని తెలిపారు. ‘నేను యూరప్‌ను విమర్శించడం బ్రిటన్ ప్రధానిని ఇబ్బంది పెట్టింది. మీకు తెలుసు. నాటో దేశాలు, ఈయూ దేశాలు…మీరు ఏ పేరుతో అయినా పిలవండి. ఎందుకంటే వాటి మధ్య చాలా పోలికలు ఉన్నాయి. రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నందుకు నేను వాటిని విమర్శించాను’ అని ట్రంప్ చెప్పారు. అయితే రష్యా నుంచి బ్రిటన్ కూడా చమురును కొనుగోలు చేస్తున్నప్పటికీ ఆ అపరాధులలో స్టార్మర్ లేరని అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయాలని ట్రంప్ గత వారం నాటో సభ్య దేశాలకు అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే.