Wednesday, February 18, 2026
E-PAPER
Homeబీజినెస్ఓలా ఎలక్ట్రిక్‌ షేర్లు 83 శాతం పతనం

ఓలా ఎలక్ట్రిక్‌ షేర్లు 83 శాతం పతనం

- Advertisement -

భారీగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
ముంబయి : ఎంతో ఆర్భాటంగా స్టాక్‌ మార్కెట్లోకి ప్రవేశించిన ఓలా ఎలక్ట్రిక్‌ కంపెనీ షేర్లు కుప్పకూలిపోతున్నాయి. ఆల్‌టైం గరిష్టాల నుంచి భారీ నష్టాలను చవి చూడటంతో ఇన్వెస్టర్లు లబోదిబోమంటున్నారు. వరుసగా నాలుగో రోజు మంగళవారం కూడా ఓలా షేర్లు పతనమయ్యాయి. ఇంట్రాడేలో 5 శాతం క్షీణించి 27.36 కనిష్ట స్థాయిని తాకగా.. తుదకు 2.91 శాతం నష్టంతో రూ.27.99 వద్ద ముగిసింది. ఓలా రేటింగ్‌ను అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ సిటీ ‘బై’ నుంచి ‘సెల్‌’కి తగ్గిస్తూ.. టార్గెట్‌ ధరకు 51 శాతం కోత పెట్టి రూ.27గా నిర్ణయించడమే ఇందుకు ప్రధాన కారణం. 2024లో చేరిన గరిష్ట స్థాయి రూ.157తో పోలిస్తే ఈ స్టాక్‌ ఏకంగా 83శాతం మేర పడిపోయి ఇన్వెస్టర్ల సంపదను ఆవిరి చేసింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో ఆదాయం 55 శాతం తగ్గి రూ.470 కోట్లకు పడిపోయింది. నికర నష్టం రూ.487 కోట్లకు పెరగడం ఇన్వెస్టర్లలో మరింత ఆందోళన పెంచింది. ఒకప్పుడు అగ్రస్థానంలో ఉన్న ఓలా ప్రస్తుతం 6 శాతం మార్కెట్‌ వాటాతో ఐదో స్థానానికి పడిపోయింది. టీవీఎస్‌, బజాజ్‌, ఆథర్‌ వంటి సంస్థల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటుంది. వినియోగదారుల నుంచి సర్వీస్‌, నాణ్యత పరంగా వస్తున్న ఫిర్యాదులు బ్రాండ్‌ విలువను దెబ్బతీశాయి. మరోవైపు కంపెనీ వద్ద నగదు నిల్వలు తగ్గడం, అప్పులు పెరగడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది.

రెండో రోజూ సెన్సెక్స్‌కు లాభాలు
దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజూ రాణించాయి. మంగళవారం సెషన్‌లోనూ ఐటి, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు స్వల్ప లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్‌ 173.81 పాయింట్లు పెరిగి 83,450.96కు చేరింది. నిఫ్టీ 42.65 పాయింట్ల లాభంతో 25,725.40 వద్ద ముగిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -