– ఆర్టీఏ కార్యాలయం వద్ద క్యాబ్ డ్రైవర్ల నిరసన
– కొంపల్లిలో డ్రైవర్ల సమ్మె
నవతెలంగాణ – బంజారా హిల్స్
ఓలా, ఊబర్ ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ క్యాబ్ డ్రైవర్లు హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయం వద్ద శనివారం ఆందోళన చేపట్టారు. వివిధ కార్మిక యూనియన్ల పిలుపుమేరకు పెద్దఎత్తున క్యాబ్ డ్రైవర్లు ర్యాలీగా రవాణా శాఖ కార్యాలయానికి వచ్చి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ఓలా, ఊబర్ వంటి సంస్థల వల్ల డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. డ్రైవర్ల సంపదలో 40 శాతం ఈ యాప్‌లే దోచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అజరుబాబు మాట్లాడుతూ.. క్యాబ్ డ్రైవర్లు రోజులో 15 గంటలు కష్టపడ్డా కనీసం బతకలేని పరిస్థితి ఉంటోందని అన్నారు. ప్రభుత్వానికి పలుమార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రవాణా శాఖ ధరలను ప్రకటించాలని, డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, నగరంలో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఓవైపు పూట గడవని పరిస్థితిలో ఉన్న క్యాబ్ డ్రైవర్లను పోలీసులు చలానాలతో వేధిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిరణ్, సిద్దార్థ తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కొంపల్లిలో క్యాబ్ డ్రైవర్లు చేపట్టిన సమ్మెకు సీఐటీయూ దుండిగల్ మండల కార్యదర్శి బొడిగే లింగస్వామి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆయా కార్పొరేట్ సంస్థలు డ్రైవర్లకు కనీస ధర చెల్లించడంలో మోసపూరిత కుట్రలు చేస్తున్నాయని తెలిపారు. రేయింబవళ్లు శ్రమిస్తున్నా.. డ్రైవర్లు కనీసంగా వాహనాల ఈఎంఐలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఓలా, ఊబర్, రాపిడో వంటి యాప్‌లను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక అప్లికేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ వేదిక ద్వారా ఉపాధి పొందుతున్న డ్రైవర్లకు రేట్ కార్డులు ఖరారు చేసి, కనీస చార్జీలు లభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఓలా, ఊబర్ ఆగడాలను అరికట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



