Tuesday, May 20, 2025
Homeరాష్ట్రీయంజీపీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం

జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం

- Advertisement -

– విధానపరమైన వాటిని సీఎం, మంత్రుల దృష్టికి తీసుకెళ్తాం
– ఏప్రిల్‌ నుంచే గ్రీన్‌ చానల్‌ ద్వారా వేతనాలు : సీఐటీయూ నేతలకు పంచాయతీరాజ్‌ డిప్యూటీ కమిషనర్‌ సుధాకర్‌రెడ్డి హామీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించి తమ పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తామనీ, విధానపరమైన అంశాలను సీఎం, మంత్రి దృష్టికి తీసుకెళ్తామని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ కమిషనర్‌ డి.సుధాకర్‌రెడ్డి హామీనిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్‌లో డిప్యూటీ కమిషనర్‌తో తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర గౌరవాధ్యక్షులు పాలడుగు భాస్కర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య, రాష్ట్ర అధ్యక్షులు గ్యారపాండు, ఉపాధ్యక్షులు పాలడుగు సుధాకర్‌, మహిళా కన్వీనర్‌ పొట్టా యాదమ్మ, కార్యనిర్వాహక అధ్యక్షులు పైళ్ల గణపతిరెడ్డి, కోశాధికారి గడ్డం ఈశ్వర్‌, ఆఫీస్‌ బేరర్లు రాపర్తి రాజు, రాంచందర్‌, వెంకటేష్‌ గౌడ్‌, మహేష్‌, పులి మల్లేష్‌, కొప్పుల శంకర్‌, వెంకటేశ్వర్లు, ఖాజా, ఆశయ్య, శ్రీకాంత్‌, ఎం. నర్సయ్యతో కూడిన బృందం చర్చలు జరిపింది. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ పంచాయతీల్లో పనిచేస్తున్న జీపీ కార్మికులకు గ్రీన్‌ ఛానల్‌ ద్వారా వేతనాలు చెల్లించాలనీ, జీవో నెం.60 ప్రకారం కేటగిరీల వారీగా వేతనాలను నిర్ణయించాలని డిప్యూటీ కమిషనర్‌ను కోరారు. జీపీ సిబ్బందిని రెండో పీఆర్సీ పరిధిలోని తీసుకురావాలని విన్నవించారు. మల్టీపర్పస్‌ విధానాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. కారోబార్‌, బిల్‌ కలెక్టర్లకు ప్రత్యేక హోదా కల్పించాలని కోరారు. అర్హులైన సిబ్బందికి ప్రమోషన్లు ఇవ్వాలనీ, 60 ఏండ్లు పైబడిన వారికి రిటైర్డ్‌ బెనిఫిట్స్‌ కింద రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రమాదాలలో మరణిస్తున్న కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలనీ, ప్రతి కార్మికుడికి ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని విన్నవించారు. ఆన్‌లైన్‌లో నమోదు కాని కార్మికుల పేర్లను వెంటనే నమోదు చేయాలనీ, పారిశుద్ధ్య కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు, ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. ప్రమాదాల్లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల నష్టపరిహారం అందించాలని, వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని, పంచాయతీ సిబ్బందికి పిఎఫ్‌, ఈఎస్‌ఐ, ప్రమాద బీమా లాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా డిప్యూటీ కమీషనర్‌ సుధాకర్‌ రెడ్డి మాట్లాడుతూ తమ పరిధిలో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని హామీనిచ్చారు. పంచాయతీ కార్మికులకు గ్రీన్‌ ఛానల్‌ ద్వారా వేతనాలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని, 2025 ఏప్రిల్‌ వేతనాలను తక్షణమే చెల్లిస్తామని చెప్పారు. ప్రమాదాలు జరిగి మరణిస్తున్న కార్మికులకు నష్టపరిహారం అందిస్తామని, పంచాయతీ కార్మికులందరికీ ఇన్సూరెన్స్‌, పిఎఫ్‌ మరియు ఈఎస్‌ఐ అమలుకు చర్యలు చేపడతామని భరోసానిచ్చారు. అదనంగా పనిచేస్తున్న సిబ్బంది పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని హామీనిచ్చారు. పంచాయతీ కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు, ఇండ్ల స్థలాలు కేటాయింపుల్లో మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. పంచాయతీలలో ట్రాక్టర్‌ డ్రైవర్లకు డ్రైవింగ్‌ లైసెన్సులు ఇప్పిస్తామని హామీనిచ్చారు. దహన సంస్కారాలకు ప్రభుత్వ జీఓ ప్రకారం రూ.30 వేలు ఆర్థిక సహాయం అందిస్తామని, యూనిఫామ్‌, చెప్పులు, నూనెలు, సబ్బులు క్రమం తప్పకుండా ఇప్పించేందుకు తక్షణ చర్యలు చేపడ్తామని భరోసానిచ్చారు. గుర్తింపు కార్డులను కూడా జారీ చేస్తామని హామీనిచ్చారు. వారిపై వేధింపులు లేకుండా చూస్తామని భరోసానిచ్చారు. మల్టీపర్పస్‌ వర్కర్‌ విధానం రద్దు, జీఓ నెం.51 సవరణ, అర్హత కలిగిన కారోబార్‌, బిల్‌ కలెక్టర్లకు స్పెషల్‌ స్టేటస్‌ లాంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -