‘లీవ్’ అంటే అపరాధభావన
‘ఆఫ్’ ఉన్నా…ఆన్‌లైన్‌లో అందుబాటులోనే..
‘విశ్రాంతి’కి నోచని ‘మిల్లీనియల్స్’ తరం
ఉద్యోగాల్లో పోటీతత్వమే ప్రధాన కారణం
ఈ విషయంలో పూర్తి స్పష్టతతో జెన్‌జెడ్ తరం
మారుతున్న లివింగ్ స్టైల్
పని అయిపోయినా.. ఫోన్ మోగితే వెంటనే స్పందించాలనే ఒత్తిడి మెయిల్, వాట్సాప్ మెసేజ్ వస్తే ‘ఆఫ్ టైమ్’ అనే భావనే లేకపోవడం.. ఇదే మిల్లీనియల్స్ తరం పెరిగిన పని సంస్కృతి. కష్టపడితేనే విలువ, ఎప్పుడూ అందుబాటులో ఉండాలన్న భావన. ఇలాంటి నేపథ్యంతో పెరిగిన తరం.. ఇప్పుడు పని నుంచి డిస్‌కనెక్ట్ అవ్వాలంటే అపరాధ భావనతో బాధపడుతోంది. ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు ఊపిరి పీల్చే అవకాశం ఇచ్చినా.. మనసులోని అపరాధ భావన మాత్రం వారిని వెంటాడుతూనే ఉన్నది.
న్యూఢిల్లీ: ఆఫీస్ పని సమయం ముగిసిన తర్వాత కూడా ఆఫీస్ కాల్స్, మెసేజ్‌లకు స్పందించాలనే అప్రకటిత నియమంతో పెరిగిన మిల్లీనియల్స్ (ఒక తరం పేరు).. ఇప్పుడు పని నుంచి వ్యక్తిగత జీవితాన్ని వేరు చేయాలంటే అపరాధ భావనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు వారి ఆశలకు బలం ఇస్తున్నప్పటికీ.. మానసికంగా డిస్‌కనెక్ట్ కావడం అంత సులభం కాదని నిపుణులు చెప్తున్నారు.
‘ఎప్పుడూ ఆన్’ సంస్కృతిలో పెరిగిన తరం
అటు పాత తరానికి, ఇటు టెక్నాలజీ సంస్కృతికి మధ్యలో మిల్లీనియల్స్ జీవన ప్రయాణం సాగింది. మీడియా రంగానికి చెందిన ఓ మహిళ (33) తన అనుభవాన్ని పంచుకుంటూ…”ఎప్పుడైనా బ్రేకింగ్ న్యూస్ రావచ్చు. కాబట్టి నిజంగా లాగ్ ఆఫ్ అవ్వలేం” అన్న నియమంతోనే మేము పని చేశామని చెప్తున్నది. అయితే జెన్-జీ టీమ్‌ను నడిపిన ఆమె.. వారి ఆలోచనల తీరుపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. వారు తమ రోజువారీ కీలక పని తీరు లక్ష్యాలకు మించి పని చేయబోమని స్పష్టంగా చెప్పడం ఆమెకు షాక్‌ను కలిగించింది. ఆ ప్రభావంతో తాను కూడా పని గంటల తర్వాత ఫోన్‌ను పక్కన పెట్టినప్పుడు ఎంతకాలంగా ఒత్తిడిలో ఉన్నానో అర్థమైందని ఆమె చెప్పింది.
జెన్-జీ వర్సెస్ మిల్లీనియల్స్
జెన్-జీ తరం మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నది. మొదటి నుంచే ఒక స్పష్టమైన హద్దులతో ఉద్యోగ మార్కెట్‌లోకి వచ్చింది. మానసిక ఆరోగ్యం పట్ల అవగాహనతో, పని-వ్యక్తిగత జీవితాన్ని వేరు చేసి చూడటంలో వారు వెనుకాడరు. అయితే ఇది సోమరితనం కాదనీ, జెన్-జీ అనుసరిస్తున్న సమతుల్యత భావనకు నిదర్శనమని నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు.. ఇక కొత్త టెక్నాలజీలతో మిల్లీనియల్స్‌కు ఒక సవాల్ విసురుతున్నది. గాలప్ అధ్యయనం ప్రకారం.. ప్రతి పది మందిలో ఏడుగురు మిల్లీనియల్స్ తీవ్ర పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. డెలాయిట్ 2023 సర్వేలో.. మూడు వంతులకు పైగా మిల్లీనియల్స్ ఉద్యోగాల్లో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్టు తెలిసింది. ఇది ఆరోగ్యం, కుటుంబ జీవితం, సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది.
పని నుంచి దూరంగా ఉంటే అపరాధ భావన ఎందుకు?
వాస్తవానికి మిల్లీనియల్స్ పెరిగిన వాతావరణం చాలా భిన్నమైనది. నిరంతరం కష్టపడాలనే కల్చర్‌లో వారు పెరిగారు. దాంతో పాటు వారి తల్లిదండ్రుల పని విధానం ప్రభావం కూడా వారిపై పడింది. విశ్రాంతి తీసుకోవడమంటేనే అలసత్వంగా, విరామం అంటేనే ఒక బలహీనతగా వారు భావిస్తున్నారు. దీంతో పని నుంచి దూరం కావటాన్ని వారు ఒక అపరాధ భావనతో చూస్తున్నారని నిపుణులు చెప్తున్నారు.
ఆ బిల్లు ఒక ఆశ
ఈనెల 5న లోక్‌సభలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎంపీ సుప్రియా సూలే ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ ప్రయివేటు మెంబర్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇది దేశవ్యాప్తంగా ఉద్యోగ మార్కెట్‌లో తీవ్ర చర్చకు దారి తీసింది. పని గంటల తర్వాత ఆఫీస్ కాల్స్, మెయిల్స్‌ను నిర్లక్ష్యం చేసే హక్కులను ఈ బిల్లు ఉద్యోగు లకు ఇవ్వటమే ఇందుకు ప్రధాన కారణం. అయితే ఈ బిల్లు పార్లమెం టులో ఇంకా చర్చకు రాకపోయినప్పటికీ.. భారత్‌లో ఏండ్లుగా కొనసాగుతోన్న ‘ఆల్వేస్-ఆన్’ పని సంస్కృతిని ప్రశ్నిస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు.
ఉద్యోగ భద్రత కూడా ఒక కారణమే..!
భారత్‌లో ప్రస్తుతం నిరుద్యోగం ఒక ప్రధాన సమస్య. ఇలాంటి తరుణంలో ఒక చిన్న ఉద్యోగం కూడా దొరకటమే గగనమైంది. ఇలాంటి తరుణంలో దొరికిన ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడానికి మిల్లీనియల్స్ ప్రాధాన్యత నిస్తున్నారు. ”ఎప్పుడూ అందుబాటులో ఉండడం నిబద్ధతగా భావించే సంస్కృతిలో పెరిగాం. ఇప్పుడు ‘ఆఫ్’ అయితే ‘పని పట్ల సీరియస్ కాదేమో’ అన్న భయం వెంటాడుతుంది” అని హెచ్‌ఆర్ అనురాగ్ మల్హోత్ర చెప్పారు. తమను ఉద్యోగం నుంచి తొలగించి వేరొకరితో భర్తీ చేస్తారన్న ఆందోళన కూడా మిల్లీ నియల్స్‌లో భయానికి కారణమవుతున్నది.
హద్దులు చెరిపేసిన ‘వర్క్ ఫ్రమ్ హౌం’
కరోనా మహమ్మారి, తదనంతర పరిస్థితులు మార్కెట్‌లో పని తీరును తీవ్రంగా ప్రభావితం చేశాయి. అరుదుగా ఉండే వర్క్ ఫ్రమ్ హౌమ్ సంస్కృతిని నిత్యకృత్యం చేసింది. అయితే ఈ పని సంస్కృతి ద్వారా కుటుంబానికి దగ్గరగా ఉన్నప్పటికీ.. ప్రశాంతతకు మాత్రం దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని నిపుణులు చెప్తున్నారు. ”మహమ్మారి తర్వాత వర్క్ ఫ్రమ్ హౌమ్‌లో ఆఫీస్, ఇల్లు మధ్య గీత మాయమైంది. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ఆందోళన, నిద్రలేమి, భావోద్వేగ అలసటకు దారి తీస్తుంది” అని డాక్టర్ దివ్య శ్రీ చెప్పారు.
చట్టం సరిపోదు.. పని సంస్కృతి మారాలి
దేశంలో ఒక్క చట్టం మారితేనే సరిపోదనీ, పని సంస్కృతి కూడా మారాలని నిపుణులు చెప్తున్నారు. సమయానికి లాగ్ ఆఫ్ అయినా పని సంస్కృతి ఏమీ చెడిపోదన్న నమ్మకం ఉద్యోగుల్లో కలిగినప్పుడే వారిలో ఆ అపరాధ భావన తీవ్రత తగ్గుతుందని అంటున్నారు. ఇందుకు ఉద్యోగులను నియంత్రించగలిగే స్థాయిలో ఉన్నవారు ఉదాహరణగా నిలవాలని చెప్తున్నారు.



