Wednesday, January 28, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఫిబ్రవరి 2న కేంద్రంపై యుద్ధభేరి

ఫిబ్రవరి 2న కేంద్రంపై యుద్ధభేరి

- Advertisement -

‘ఉపాధి’ రక్షణకు ఢిల్లీ నుంచి గల్లీదాకా పోరు
కోట్లాది మందితో ఉద్యమిస్తాం
మోడీ విధానాలను తిప్పికొట్టేది ప్రజా ప్రతిఘటనే : అఖిల భారత వ్యవసాయ
కార్మిక సంఘం అధ్యక్షులు ఏ.విజయరాఘవన్‌
భూమి లేని పేదలకు ఆర్థికసాయం హామీని అమలు చేయాలి : ఆర్‌.వెంకటరాములు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశంలోని కోట్లాది మంది పేదలకు సామాజిక భద్రత కల్పించిన ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని మోడీ సర్కారు కేవలం 72 గంటల్లో విధ్వంసం చేసిందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు, మాజీ ఎంపీ ఏ.విజయ రాఘవన్‌ ఆందోళన వ్యక్తంచేశారు. దాని స్థానం లో తీసుకొచ్చిన వీబీజీ రామ్‌ జీ బిల్లు రాష్ట్రాలపై తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపనుందని హెచ్చరించారు. ఈ నేప థ్యంలో ‘ఉపాధి’ చట్టాన్ని తిరిగి పునరుద్ధరించాలని డి మాండ్‌ చేస్తూ ఫిబ్రవరి రెండున మోడీ సర్కార్‌పై యుద్ధ భేరి మోగించనున్నామని ఆయన హెచ్చరించారు. ఢిల్లీ నుంచి గల్లీదాకా కోట్లాది మంది వ్యవసాయ కార్మి కులు, కూలీలతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలిపారు. రాష్ట్రాల రాజధానులు, జిల్లా, మండల కేంద్రాల్లో భారీ స్థాయిలో నిరసనలు తెలపటం ద్వారా ‘ఉపాధి’పై కేంద్రం వైఖరిని ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌లో జరుగుతున్న ఐద్వా అఖిల భారత మహాసభల్లో మంగళవారం సౌహార్ద సందేశమిచ్చిన విజయ రాఘవన్‌… అనంతరం వ్యకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకటరాములు, నాయకులు ఆర్‌. ఆంజనేయులు, విజరు తదితరులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేగా చట్టాన్ని నేరుగా నిర్వీర్యం చేస్తే దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వస్తుందనే భయంతో మోడీ సర్కార్‌…తొలుత దాని పేరు మార్చి, అనేక నిబంధనల పేరిట మొత్తం చట్టాన్నే ఎత్తేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని బడా కార్పొరేట్లకు అనేక రాయితీలు, ప్రయోజనాలను కల్పిస్తున్న కేంద్రం.. పేదలకు ఉపాధి కల్పిస్తున్న నరేగాను నిర్వీర్యం చేయటాన్నిబట్టి పాలకులు ఎవరి పక్షాన ఉన్నారో తేలిపోతోందన్నారు. అత్యధిక మంది పేదలకు ఉపాధి కల్పించే చట్టానికి అతి తక్కువ నిధులు కేటాయించటం దారుణమని విమర్శించారు. మోడీది పేదలు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం కాబట్టే ఇలాంటి చర్యలకు ఒడిగడుతోందని విజయ రాఘవన్‌ దుయ్య బట్టారు. గతంలో వివిధ రాష్ట్రాల్లో బుల్డోజర్‌ను ఉపయో గించిన బీజేపీ ప్రభుత్వం.. ఇప్పుడు అదే తరహాలో ఉపాధి చట్టంపై బుల్డోజర్‌ను ప్రయోగించిందని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా తెచ్చిన వీబీజీ రామ్‌జీ బిల్లులో ప్రతీ వ్యక్తికి 125 పనిదినాలు కల్పిస్తామంటూ చెబుతున్నారు.. కానీ నిధులు మాత్రం 25 పని దినాలకు కూడా కేటాయించటం లేదని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా జాబు కార్డున్న ప్రతీ వ్యక్తికి వంద రోజులపాటు పని కల్పించాలంటే రూ.1.80 లక్షల కోట్ల నిధులు అవసరమవుతాయంటూ కేంద్రం అంచనా వేసిందని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకూ రూ.80 వేల కోట్లకు మించి ఏనాడూ ఖర్చు చేయలేదని వివరించారు. అలాంటిది ఇప్పుడు 125 పని దినాలు కల్పించేందుకు వీలుగా రూ.2.40 లక్షల కోట్లను కేటాయిస్తామంటే నమ్మగలమా? అని ప్రశ్నించారు. ఈ చట్టాన్ని అమలు చేయాలంటే రాష్ట్రాలు విధిగా 40 శాతం నిధులివ్వాలంటూ షరతు విధించారని.. ఫలితంగా రాష్ట్రాల ఖజానాలపై విపరీతమైన భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో తీసుకు రానున్న ‘యూజీసీ బిల్లు’పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో విద్యను తన గుప్పిట్లోకి తీసుకునేందుకే మోడీ సర్కార్‌ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని హెచ్చరించారు. ఈ రకంగా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య వ్యవస్థను ఖూనీ చేస్తున్న బీజేపీ చర్యలను తిప్పికొట్టాలంటే ప్రజా ప్రతిఘటనే శరణ్యమని విజయరాఘవన్‌ నొక్కి చెప్పారు.

వెంకటరాములు మాట్లాడుతూ… ఫిబ్రవరి రెండున నిర్వహించబోయే నిరసన కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లోనూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. భూమి లేని నిరు పేదలు, వ్యవసాయ కార్మికులకు నెలకు రూ.వెయ్యి చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్న హామీని రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇండ్లు లేని వారికి, ఇండ్లు, ఇండ్ల పట్టాలివ్వాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -