ముళ్ళ తీగల మధ్య సాగే
బ్రతుకు పొలిమేరకు వచ్చిన అతిథి వాడు
తుమ్మ చెట్టంత బలంగా
కనిపించే మల్లెపువ్వు మనసున్నోడు
మాటల అమాయకత్వంలో
వాడ్ని మించినోళ్లే లోకమంతా అంటే నమ్మాలి
గంపెడు సంతానమున్న ఇంట్లో
గువ్వ పిట్టలా చూసుకుంటారు వీడ్ని ఆఖరోడని
అంత పెద్ద ఊరిలో
పెద్ద చదువు చదివింది ఒక్కడేనని
ఊరంతా ఎక్కడ చెప్పినా వాడి మాట పారేది
అన్నలు కవచంలా ఉండి తమ్ముడు జోలికి
ఎవడు రాకుండా బుద్ధి, భయం చెప్తుండే
ఇల్లు వాకిలి సరిజేయాలని పడిన కష్టం పండి
ఒకదారి అయితుండు అనుకునేసరికి..
ఏ ముదనష్టపు చూపు పడిందో కొంపమీద
కొరివి దెయ్యాల పాలయ్యే వరుసగా ప్రాణాలు
అక్కలు, వదినలు, అన్న, తమ్ముడు, పిల్లలు
వరుసబెట్టి కాటికి నడిపించిన గాయాలు మానక
వాడి గుండెకి పడ్డ తూట్లు చెప్తే
వినే ఎవరికైనా కన్నీళ్ళాగకపోతుండే
ఎన్ని బాధలున్నా బతికే ఉండాలిరా, చస్తే
నీ వెనక బ్రతికుతున్నోళ్ళ బాధేంటో
నాకు తెలుసు
అని నెత్తి నోరు కొట్టుకుని చెప్తుండే వాడు
వయసు పిల్లతో ప్రేమలో పడ్డా అని
ఎవరు చెప్పినా
ఓపిక తెచ్చుకుని మరీ జీవితపాఠం చెప్తుండే సమజయ్యేలా
28వ ఏట వాడు ప్రేమలో పడిండు, వాడి ప్రేమ
30వ ఏట గోతిలోకి తీసుకుపోతదని
గమనించలే బిడ్డ..
కరోనాను ఎదిరించి బ్రతికిండు, పోరాడిండు గానీ
ప్రేమించిన పిల్ల ధైర్యం చెయ్యకపోయేసరికి
గుండె జారగొట్టుకుండు..
అందరికీ వాడి గొంతు చివరిసారిగా వినిపించిండు
వాడి గుండెలోని శోకాన్ని
ప్రాణ స్నేహితులకి కూడా చెప్పలేదు
బ్రతికినంత కాలం స్నేహంతో,
ప్రేమతో అందరినీ గెలిచినోడు
చెట్టుకి ఉరితాడు కట్టుకొని అందరినీ ఓడించిండు
ఎవడు చావడీ భూమ్మీద గానీ,
ఎన్నేళ్ళయినా గుర్తుండే మనిషి చచ్చిండంటే
ఇంకా స్నేహితులుగా మేం ఒప్పుకోలేం..
అరే లక్ష్మణా నీ యాది మరవలేం రా
దొంగ సాలె…
- నాగరాజు కువ్వారపు, 8688154469



