Wednesday, December 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఏ ప్రాతిపదికన డివిజన్ల విభజన చేశారు?

ఏ ప్రాతిపదికన డివిజన్ల విభజన చేశారు?

- Advertisement -

జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో గందరగోళం
మౌలిక సదుపాయాలపరంగా డివిజన్లు ఉండాలి
వార్డుల పేర్లు మార్చాలని ఎక్కువగా అభ్యంతరాలు
కొన్ని ఏరియాల్లో హద్దులపై అభ్యంతరాలు
వినతులను పరిగణనలోకి తీసుకుంటాం: మేయర్‌

నవతెలంగాణ-సిటీబ్యూరో
జీహెచ్‌ఎంసీ వార్డుల విభజన అశాస్త్రీయంగా, అసంబద్ధంగా జరిగిందంటూ కార్పొరేటర్లు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలా? లేక జనాభా ప్రాతిపదికగానా? ఓటర్ల జాబితానా? ఏ విధంగా విభజన చేశారో తెలియడం లేదన్నారు. మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కౌన్సిల్‌ సమావేశం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. సమావేశంలో డివిజన్ల డీ లిమిటేషన్‌ ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను అధికారులు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వార్డుల డీలిమిటేషన్‌ అంశంపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వెల్లువెత్తాయి. వార్డుల పేర్లు మార్చాలని, కొన్ని ఏరియాల్లో హద్దులపై అభ్యంతరాలపై సభ్యులు మాట్లాడారు. ప్రధానంగా వార్డుల పునర్విభజన అంశంపై సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా విలీనం చేసిన 27 మున్సిపాల్టీలతోపాటు, వార్డుల సంఖ్యను 150 నుంచి 300 వరకు ప్రభుత్వం చేసిన డివిజన్ల డీలిమిటేషన్‌పై బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

డివిజన్ల విభజన ఏ ప్రాతిపదికన చేశారో తెలియట్లేదని బీజేపీ, బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అన్నారు. డివిజన్ల విభజనపై ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తోపాటు ఎక్స్‌-ఆఫిషియో సభ్యులు, కార్పొరేటర్లు మాట్లాడారు. జనాభా ఆధారంగా డివిజన్లను విభజించామని అధికారులు చెబుతున్నారని, ఎలాంటి పారామీటర్స్‌ తీసుకున్నారో మాత్రం చెప్పడం లేదన్నారు. సీజీజీ (సెంటర్‌ ఫర్‌ గుడ్‌గవర్నెస్‌)లో చేశామంటున్నారు, కానీ సీజీజీని ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. ప్రజలు, కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం లేకుండా, అభిప్రాయాలు తీసుకోకుండా డీ లిమిటేషన్‌ ఎలా చేశారన్నారు. కొన్ని డివిజన్లలో ఎక్కువ ఓట్లు, మరికొన్ని డివిజన్లలో తక్కువ ఓట్లు ఉన్నట్టు ఉన్నాయన్నారు. తిరిగి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు ప్రామాణికంగా తీసుకుని వార్డుల విభజనను పున్ణపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

ఒక్కసారిగా గందరగోళం
చర్చలు జరుగుతున్న క్రమంలోనే సభలో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. దారుస్సలాంలో వార్డుల విభజన చేశారంటూ బీజేపీ కార్పొరేటర్లు చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం కార్పొరేటర్లు అభ్యంతరం తెలిపారు. దీంతో ఎంఐఎం, బీజేపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బీజేపీ కార్పొరేటర్లు గెజిటెడ్‌ పేపర్లను చింపి కౌన్సిల్‌లో విసురుతూ, మేయర్‌ పోడియం వద్దకు దూసుకెళ్లారు. దాంతో వారిపై మేయర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గందరగోళం నడుమ పునర్విభజనపై కార్పొరేటర్ల నుంచి వచ్చిన అభిప్రాయాలను, అభ్యంతరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని మేయర్‌ ప్రకటించారు. అనంతరం సభను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. అ తర్వాత బీజేపీ కార్పొరేటర్లు కౌన్సిల్‌ కార్యాలయం ముందు బైటాయించి ఆందోళన చేపట్టారు. రేవంత్‌ సర్కార్‌ ఎంఐఎంకు అనుకూలంగా విభజన చేశారని, జీహెచ్‌ఎంసీ రిలీజ్‌ చేసిన మ్యాప్‌ తప్పుల తడకగా ఉందంటూ ఆరోపించారు. కాంగ్రెస్‌, ఎంఐఎంను హఠావో హైదరాబాద్‌ బచావో అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -