Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజిఒక రద్దు! వంద ప్రశ్నలు?

ఒక రద్దు! వంద ప్రశ్నలు?

- Advertisement -

మనదేశంలో ఏ ప్రయోగం చేయాలన్నా ప్రభుత్వాలు మొదట విద్యమీద చేస్తాయి, ఎందుకంటే నష్టం జరిగినా విద్యార్థులకే కదా అన్న ధోరణి. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ విద్య మరోసారి ప్రయోగాలకు గురికాబోతున్నట్లు తెలుస్తోంది. పాఠశాల విద్యకు, డిగ్రీ విద్యకు మధ్యగానున్న ఇంటర్‌ నుండే విద్యార్థి తన భవిష్యత్తును నిర్ణయించు కుంటాడు. కానీ భవిష్యత్తులో ఆ పరిస్థితి ఉండదేమో! రెండు దశాబ్దాల క్రితం రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఉమ్మడి రాష్ట్రంలో పాఠశాల విద్యలో ఇంటర్‌ విద్యను విలీనం చేయాలన్న ప్రతిపాదన బలంగా వచ్చింది. రాష్ట్రం మొత్తం ఇంగ్లీష్‌ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్‌ అనుసరించాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆనాడు ఐక్య గురుకుల పాఠశాలల ఉపాధ్యాయ సంఘాలు, ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం చేపట్టిన నిరసనలు, ధర్నాల ఫలితంగా ప్రభుత్వం తన ప్రతిపాదనను విరమించుకోవలసి వచ్చింది. మళ్లీ ఇప్పుడు నేటి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇదే ప్రయోగానికి పూనుకున్నది. పాఠశాల విద్యలో ఇంటర్‌ను కలపడానికి మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. ఇలాచేస్తే గనుక ఇక ఇంటర్‌ బోర్డు మనుగడలో ఉండదు. అంటే ఇంటర్మీడియట్‌ బోర్డు రద్దు కాబోతున్నది. ఇందుకు ప్రభుత్వం చెబుతున్న కారణం ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదవకుండా 25 నుండి 30శాతం విద్యార్థులు డ్రాపౌట్స్‌ అవుతున్నారని. అంటే పాఠశాలలోనే ఇంటర్‌ విద్యను కలిపితే ఈ డ్రాపౌట్స్‌ నివారించవచ్చుననే అభిప్రాయం సర్కారు ఆలోచనగా ఉన్నట్టుంది!
జాతీయస్థాయిలో కానీ చాలా రాష్ట్రాల్లో కానీ పాఠశాలల్లోనూ ప్లస్‌ టు స్థాయి వరకు అంటే ఇంటర్‌ వరకు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్లస్‌ టు స్థాయిని పాఠశాల విద్య కిందే పరిగణించుతూ కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రాలన్నింటికీ నిధులు కేటాయిస్తూ వస్తున్నది. కానీ మన రాష్ట్రంలో ఇంటర్‌ విద్యను విడిగా చూపడం వల్ల కేంద్రం నుండి రాష్ట్రానికి నిధులు రావడం లేదు. ఆ నిధులు రాబట్టుకోవడానికి ఇంటర్‌ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేస్తున్నా రనేది అసలు రహస్యం. దానికి డ్రాపౌట్స్‌ అనే బూచిని చూపిస్తూ విలీన ప్రక్రియకు తెరలేపింది రాష్ట్ర సర్కారు. అసలు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అడ్మిషన్లు ఎందుకు పడిపోతున్నాయో ఎనాడైనా సమీక్ష , అధ్యయనం కానీ జరిగిందా? డ్రాపౌట్‌ అవుతున్న 25శాతం నుండి 30శాతం విద్యార్థులు కొంతమంది కార్పొరేట్‌ కళాశాలలో అడ్మిషన్‌ పొంది చదవడం, మరికొంతమంది పాలి టెక్నిక్‌ కోర్సులు చదవడం, శక్తి లేనివారు లేదా ఆసక్తి చూపనివారు చదువును అర్ధాంతరంగా నిలిపివేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో సైన్స్‌ చదివే విద్యార్థులకు పోటీ పరీక్షలకు అంటే ఐఐటి, నీట్‌, ఎప్‌సెట్‌ ప్రవేశపరీక్షలకు అవసరమైన జ్ఞానం అందించడం లేదన్న విమర్శ సర్వత్రా వ్యక్తమవుతున్నది. దీన్ని నివారించేందుకు బోర్డు తగిన చర్యలు తీసుకోవడం లేదన్న విద్యానిపుణుల వాదనల్ని కూడా ఆలోచించాలి. లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ తల్లిదండ్రులు కార్పొరేట్‌ కళాశాలలకు పంపి తమ పిల్లలు ఏదో ఒక పోటీపరీక్షలో ఉత్తీర్ణులై మంచి కోర్స్‌ చదివించడం కోసం వెనకాడడం లేదు. ప్రభుత్వ కళాశాలలు విశ్వాసాన్ని కోల్పోతున్నాయని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? పోటీ పరీక్షలకు విద్యార్థులను తయారు చేయగల సత్తా లెక్చరర్లకు లేదన్నది ఇప్పుడు చర్చ కాదు. కానీ పైఅధికారుల్లో వ్యవస్థను గాడినపెట్టే చిత్తశుద్ధి లోపించిందన్నది వాస్తవం. కనీససంఖ్యలో కూడా కొన్నిచోట్ల అడ్మిషన్లు జరగకపోవడం శోచనీయం, ఇంటర్మీడియట్‌ విద్యావ్యవస్థకు ఇది ఒక పొంచి ఉన్న ప్రమాదం.
ఇంటర్మీడియట్‌ విద్యాబోర్డు ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా ఉంటూ మంచి సిలబస్‌తో కూడి ఉన్నత విద్యా ప్రమాణాలతో విద్యార్థులను తయారు చేస్తున్నది. ఆ సిలబస్‌ నందు రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్ష ఎప్‌సెట్‌ స్థాయికి ఉపయోగపడే జ్ఞానం, సమాచారం పొందు పరచబడింది. మన కార్పొరేట్‌ కళాశాలల్లో ఐఐటి, నీట్‌ పోటీ పరీక్షల నిమిత్తమై అదనపు జ్ఞానాన్ని అందించి అదనంగా విద్యార్థులు, అధ్యాప కులచే పని చేయించడం ద్వారా జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు, గణనీయమైన సంఖ్యలో సీట్లు సాధిస్తున్నాయి. ఇప్పుడు అన్ని పాఠ శాలల్లో తొమ్మిది నుండి ప్లస్‌ టు స్థాయి వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలుపరచాలని చూస్తే అది రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల దృష్ట్యా మంచిదే కావచ్చు కానీ రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలను, తల్లిదండ్రుల ఆకాంక్షలను మాత్రం దెబ్బతీస్తుంది. జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో మన విద్యార్థులు భవిష్యత్తులో వెనుకబడే ప్రమాదం ఉంది. పదవ తరగతి వరకు సీబీఎస్‌ఈ, ఐసిఎస్‌ఈ సిలబస్‌ చదివిన వాళ్లు కూడా ఆ తర్వాత ఇంటర్మీడియట్‌కి వచ్చేసరికి స్టేట్‌ సిలబస్‌ వైపు వెళ్లడం గమనార్హం.

రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఐదు నుండి ప్లస్‌ టు వరకు తరగతులుంటాయి. ఇవి పాఠశాల విద్యకు, ఇంటర్‌బోర్డుకు అనుసంధానమై నడుస్తాయి. వీటి నుండి కూడా గణనీయమైన సంఖ్యలో విద్యార్థులు ఐఐటి, ఎన్‌ఐటి, ట్రిపుల్‌ ఐటి, మెడిసిన్‌ కోర్సులకు సీట్లు పొందుతున్నారు. వీటిలో కూడా సదరు పరీక్షలకై స్పెషల్‌ కోచింగ్‌ ఇవ్వడం జరుగుతున్నదనే విషయాన్ని మనం మరువకూడదు. ఒకవేళ ఇంటర్‌ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసి తొమ్మిదవ తరగతి నుండి సీబీఎస్‌ఈ సిలబస్‌ ప్రవేశపెడితే మన రాష్ట్రంలోని 200పైగా నడుస్తున్న ఇంజనీరింగ్‌ కళాశాలల భవిష్యత్తు ప్రశ్నార్ధకమవుతుంది. సీబీఎస్‌ఈ సిలబస్‌ ప్రాతిపదికన మన రాష్ట్రస్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారా లేక ఐఐటి జేఈఈ ర్యాంకుల ఆధారంగా రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కళాశాలలో సీట్లు కేటాయిస్తారా? రాష్ట్రస్థాయిలో సమాంతరంగా మరో ప్రవేశ పరీక్ష నిర్వహించడం పైన సాధ్యాసాధ్యాలు ఆలోచించాలి. మన రాష్ట్రంలోని కొన్ని ప్రయివేటు ఇంజనీరింగ్‌ కళాశాలలో డీమ్డ్‌ యూనివర్సిటీల స్థాయిలో గుర్తింపు పొందాయి. మరికొన్ని స్వతంత్ర ప్రతిపత్తితో నడుస్తూ జాతీయస్థాయిలో మంచి ర్యాంకుతో గుర్తింపు తెచ్చుకున్నాయి. వీటిలో అడ్మిషన్‌ విధానం కూడా చాలా జటిలమైనది. అదేవిధంగా నీట్‌ ప్రవేశ పరీక్ష కేవలం మెడిసిన్‌ వరకే పరిమితమైంది. వ్యవసాయ వెటర్నరీ కోర్సులకు ప్రవేశ పరీక్ష సంగతి ఏమిటి? దానికి కూడా నీట్‌ ర్యాంకు ఆధారంగానే సీట్ల కేటాయింపు జరుగుతుందా? మరోపక్క డిప్లొమా నుండి అంటే పాలిటెక్నిక్‌ నుండి ఇంజనీరింగ్‌ చదివే విద్యార్థులు ఉన్నారు. వాళ్ల గతి ఏమవుతుంది? ఇప్పటికే రాష్ట్రంలో ప్రయివేటు ఇంజనీరింగ్‌ కళాశాలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం అమల్లో ఉంది. వాటికి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు బకాయిపడింది. యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెట్టడం చూస్తూనే ఉన్నాం.
నూతన విద్యావిధానాన్ని అమలు పరచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం విద్యను పూర్తిగా తమ నియంత్రణలోనికి తెచ్చుకునే ప్రయత్నంలో ఇదొక వ్యూహం. రాష్ట్రాలు విద్యను తమ పరిధిలో తమ అవస రాలకు తగిన రీతిలో ఏర్పరచుకోగా కేంద్రం కర్రపెత్తనం చేస్తూ ఇప్పుడు రాష్ట్రాలను ఇరకాటంలో పడవేస్తున్నది. ఒకపక్క హిందీని కూడా అన్ని రాష్ట్రాలపై బలవంతంగా రుద్దే ప్రయత్నాలు చేస్తున్నది. కానీ అది అంతర్జాతీయ స్థాయికి లేదా విదేశాలకు వెళ్లే విద్యార్థుల ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు లాంటిది. రాష్ట్రంలో ఇంటర్‌ విద్యలో సిలబస్‌ ప్రమాణాలు జాతీయస్థాయి పోటీ పరీక్షలకు అనుగుణంగా తయారయ్యే విద్యార్థులకు మార్గదర్శకంగా పొందుపరచబడ్డాయి. అందుకే వేలాది మంది విద్యార్థులు ఈ ప్రవేశపరీక్షల్లో రాణిస్తున్నారు. ఒక శాస్త్రీయ అధ్యయనం జరగాలి. అంతేగాని బోర్డుల విలీనం దీనికి పరిష్కారం కాదు. ప్రజల జీవన పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు, అవసరాలు అన్నింటిని అధ్యయనం చేసి, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. అన్ని కళాశాలల్లో అన్ని కోర్సులు అందుబాటులో ఉంచడం కష్టం. విద్యార్థి అభిరుచికి తగిన కోర్సు తాను ప్రస్తుతం చదువుతున్న సంస్థలో లేకపోతే మరో చోటికి వెళ్లి చదువుకునే స్థోమత లేనట్లయితే అతడు డ్రాపౌట్‌గా మిగిలి పోవచ్చు. బోర్డుల రద్దు లేదా విలీనం నిధులు రాబట్టడానికే గాని విద్యార్థుల సంక్షేమం లేదా ప్రయోజనాలు అందుకు బలవుతున్నాయనేది స్పష్టం.

శ్రీశ్రీ కుమార్‌
9440354092

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad