నవతెలంగాణ – మునిపల్లి
ఎన్నికల సంగ్రామంలో ఒక్కోసారి ఒక ఓటు అనేది అభ్యర్థుల తలరాతను మారుస్తుంది అనడంలో సందేహం లేదు. ఒక ఓటు తేడాతో గెలిచిన వాళ్ళు ఒక ఓటు తేడాతో ఓడిపోయిన వారు అనేకమంది ఉంటారు. ఉత్కంఠ రేపే ఒక ఓటు అటు అభ్యర్థులకు ఇటు ఎన్నికల అధికారులకు ముప్పు తిప్పలు పెడుతుంది. ఒక ఓటు తేడాతో వచ్చిన ఫలితాన్ని, గెలుపును ప్రకటించడం ఎన్నికల అధికారులకు సవాల్ గా మారుతుంది. అయితే ఆ ఒక ఓటు మునిపల్లి మండలంలోని లింగంపల్లి గ్రామపంచాయతీలో స్వయానా ఇద్దరు అన్నదమ్ములను ఒక ఎన్నికల్లో గెలిపించి మరొక ఎన్నికల్లో పరాజయం కావడానికి కారణమైంది.
వివరాల్లోకి వెళితే గతంలో జరిగిన ఒక గ్రామపంచాయతీ ఎన్నికల్లో మాజీ జడ్పిటిసి సభ్యులు మీరు ఇలాల్ రజియోద్దీన్ ( అసత్ పటేల్ ) అప్పట్లో ఒక ఓటు తేడాతో అప్పటి అభ్యర్థి హాజీ పాషా పై విజయం సాధించారు. అయితే ఇటీవల జరిగిన రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో అతని స్వయాన సోదరుడైన మసూద్ అదే ఒక ఓటు తేడాతో పరాజయం పాలయ్యారు. ఇటీవలి లింగంపల్లి గ్రామపంచాయతీ ఎన్నికల్లో మసూద్ కు 619 ఓట్లు రాగా సమీప అభ్యర్థి ఇర్ఫాన్ అహ్మద్ కు 620 ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు రీకౌంటు చేసి ఫలితాన్ని తేల్చాల్సి వచ్చింది. ఈ విధంగా ఒక ఓటు అనేది ఒకే కుటుంబంలో ఒకసారి విజయాన్ని, మరొకసారి పరాజయాన్ని తెచ్చిపెట్టిందని అందరూ ఒక ఓటు మహిమ గురించి వింతగా చర్చించుకుంటున్నారు.



