Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeమానవిఒకరికి ఒకరుగా

ఒకరికి ఒకరుగా

- Advertisement -

పెండ్లి… సమాజంతో పాటు చట్టం ద్వారా గుర్తించబడిన ఒక సంబంధం. ఈ బంధంలో ఒకరిపై ఒకరికి కొన్ని హక్కులు ఉంటాయి. అలాగే బాధ్యతలు కూడా ఉంటాయి. జీవిత భాగస్వాములు ఒకరికి ఒకరు అండగా ఉండాలి. ఒకరికి ఒకరుగా కలిసి జీవించాయి. ఈ బంధమే కుటుంబానికి పునాది. మనిషిని ఒంటరితనం బాధిస్తుంది. యవ్వనంలో ఉన్నపుడు మనసు ఒక తోడును కోరుకుంటుంది. అందుకే పెద్దలు ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలకు పెండ్లి చేస్తారు. పెండ్లి మానసికంగా, శారీరకంగా మనిషిని ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. పెండ్లి చేసుకున్న తర్వాత భాగస్వామి నుండి దొరకాల్సిన ప్రేమ దొరకకపోతే.. కోరుకున్న ప్రేమ అందకపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తెలియజేసే కథనమే ఈవారం ఐద్వా అదాలత్‌(ఐలమ్మ ట్రస్ట్‌)లో తెలుసుకుందాం…
సాధారణంగా తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పిల్లల భవిష్యత్తు బాగుండాలని వారికి పెండ్లి చేస్తారు. కానీ చాలా మంది పిల్లలు దాన్ని పట్టించుకోవడం లేదు. అలాంటప్పుడు ఆ తల్లిదండ్రులు పడే ఆవేదన మాటల్లో చెప్పలేనిది. తల్లిదండ్రులు వారి జీవితం కంటే కూడా పిల్లల గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. భార్యాభర్తలుగా ఉన్నప్పుడు వారి ఆలోచనా విధానం ఒకలా ఉంటుంది. అదే తల్లిదండ్రులు అయిన తర్వాత ప్రాధాన్యతలు, బాధ్యతలు మారిపోతాయి. పిల్లలే తమ ప్రపంచంగా బతికేస్తుంటారు.

రాగిణికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అందరికీ పెండ్లి జరిగింది. ఎవరి కుటుంబాలు వారివి. చిన్న కొడుకు వంశీకి శ్రీనిధితో పెండ్లి చేసి ఆరు నెలలు అవుతుంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమే. ఇద్దరూ ఓకే అనుకున్న తర్వాతనే పెద్దల సమక్షంలో పెండ్లి చేశారు. రాగిణి ప్రస్తుతం చిన్నకొడుకుతోనే ఉంటుంది. పెద్ద కొడుకు వేరే ఊళ్లో ఉంటాడు. కూతురు వేరే రాష్ట్రంలో వుంటుంది. అంతా బాగానే ఉన్నా సమస్య ఏమిటంటే వంశీ, శ్రీనిధి ఇద్దరూ పెండ్లి తర్వాత సంసార జీవితం గడపడం లేదు. వారి మధ్య ఉన్న సమస్య ఏంటో ఆమెకు అర్థం కావడం లేదు.

ఇదే విషయాన్ని ఆమె కొడుకు, కోడలినే అడిగింది. కానీ వారి నుండి ఎలాంటి సమాధానం లేదు. దాంతో ఆమెలో ఆందోళన పెరిగిపోయింది. నేరుగా ఐద్వా అదాలత్‌ దగ్గరకు వచ్చింది. ఆమె చెప్పింది విన్న తర్వాత మేము వంశీని, శ్రీనిధిని పిలిపించి మాట్లాడాము. శ్రీనిధి మాట్లాడుతూ ‘వంశీ అంటే నాకు ఇష్టమే. అందుకే పెండ్లి చేసుకున్నాను. కానీ వంశీ ‘కొంచెం టైం తీసుకుందాం’ అంటున్నాడు. ఎందుకో అడిగితే ‘నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. వాటిని తీర్చిన తర్వాత మనిద్దరం సంతోషంగా ఉండొచ్చు’ అంటున్నాడు. అందుకే నేను అతన్ని ఇబ్బంది పెట్టడం లేదు. మా కుటుంబాల్లో భర్త మాటకు ఎవ్వరూ ఎదురు చెప్పరు. అలాంటిది నేను ఎలా ఆయన మాటను ఎదిరిస్తాను. అందుకే సరే అన్నాను’ అంది.

వంశీతో మాట్లాడితే ‘నాకు శ్రీనిధి అంటే చాలా ఇష్టం. మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాము. మా మధ్య ఎలాంటి సమస్యలూ లేవు. మా పెండ్లి జరిగి కేవలం ఆరు నెలలు మాత్రమే అవుతుంది. అయినా మా మధ్య ఏదో సమస్య ఉందని మా అమ్మ కంగారు పడుతుంది. అసలు మమ్మల్ని ఇక్కడకు ఎందుకు పిలిపించిందో అర్థం కావడం లేదు’ అన్నాడు.
‘మీరు అంత సంతోషంగా ఉంటే శ్రీనిధిని ఎందుకు దూరం పెడుతున్నారు. పెండ్లి తర్వాత భార్యను అలా దూరం పెట్టడం సరైనదేనా? మీకేదైనా సమస్య ఉంటే చెప్పండి, అవసరమైతే డాక్టర్‌ దగ్గరకు వెళ్లి చూపించుకోండి. సమస్య పరిష్కారం అవుతుంది. ఇది కాకుండా ఇంకేదైనా సమస్య ఉంటే మీ అమ్మతో కూడా పంచుకోండి. అప్పుడు ఆమెకు కూడా అర్థం అవుతుంది’ అన్నాము.

దానికి అతను ‘అలాంటిది ఏమీ లేదు. మేము కొంచెం సమయం తీసుకుందామనుకున్నాం. అంతే కానీ ఇంకో సమస్య ఏమీ లేదు’ అన్నాడు. ‘ఆ టైం దేనికోసమే చెప్పండి’ అంటే ‘నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. పెండ్లిలో కొంత అప్పు చేయాల్సి వచ్చింది. అంతకు ముందు కూడా కొన్ని అప్పులు ఉన్నాయి. వాటిని తీర్చేస్తే నాకు ఎలాంటి సమస్యలూ ఉండవు. రెండేండ్లలో ఈ సమస్యలన్నీ తీరిపోతాయి. అప్పుడు నేనూ నా భార్య సంతోషంగా ఉండొచ్చు. అలా కాకుండా మేము తొందర పడితే పిల్లలు పుట్టి ఆ బాధ్యతలతో ఆర్థిక సమస్యలు మరింత పెరుగుతాయి. అందుకే ఇద్దరం కలిసి పిల్లల కోసం కొంత సమయం తీసుకుందామనుకున్నాం. అంతకు మించి వేరే సమస్యలు ఏమీ లేవు’ అన్నాడు వంశీ.

శ్రీనిధి కూడా ‘నాకూ అదే కారణం చెప్పాడు, అందుకే సరే అన్నాను’ అంది. ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి ‘పెండ్లి తర్వాత భార్యాభర్తలు ఇన్ని రోజులు దూరంగా ఉంటే మీ మధ్య మంచి రిలేషన్‌ ఎలా ఏర్పడుతుంది? ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, బాధ్యతలు ఎలా ఏర్పడతాయి. ఇప్పుడే పిల్లలు వద్దనుకుంటే దానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీని కోసం చాలా మార్గాలు ఉన్నాయి. వీటి గురించి ఆలోచించకుండా దూరంగా ఉండడం సరైనది కాదు. దీని వల్ల శ్రీనిధితో పాటు మీ అమ్మ కూడా బాధపడుతుంది. ఈ విషయం శ్రీనిధి మీకు చెప్పలేక ఇబ్బంది పడుతుంది. ఇలాంటి విషయాలు మీరే అర్థం చేసుకోవాలి. ఇద్దరూ సరదాగా బయటకు వెళ్లండి. హాయిగా గడపండి. ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. పెండ్లయిన కొత్తలోనే బాధ్యతలు, అప్పులు అంటూ మీరు తప్పించుకు తిరిగితే మీ రిలేషన్‌ తర్వాత కాలంలో ఎలా బలపడుతుంది? రెండేండ్లు మీరు ఇలాగే గడిపితే మీ మధ్య సమస్యలు పెరుగుతాయి. బాగా ఆలోచించుకొని మళ్లీ రండి’ అని చెప్పి పంపించాము.

మళ్లీ నెల తర్వాత ఇద్దరూ వచ్చారు. ఈసారి ఇద్దరి ముఖాల్లో చాలా సంతోషం కనిపించింది. శ్రీనిధి మాట్లాడుతూ ‘వంశీ ఇప్పుడు నాతో ప్రేమగా ఉంటున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇద్దరం ఉద్యోగాలు చేసి ఆ అప్పులన్నీ త్వరలోనే తీర్చేద్దామనుకున్నాం. మా అత్తమ్మ మీ దగ్గరకు తీసుకొచ్చి మాకు చాలా మంచి చేశారు’ అన్నది.
భార్యా భర్తల మధ్య సమస్యలుంటే మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. బాధ్యలు ఉంటే ఒకరికి ఒకరు అండగా నిలబడి పంచుకోవాలి. అంతే తప్ప ఇలా దూరంగా ఉంటే ఆ సమస్యలు మరింత పెరుగుతాయి తప్ప పరిష్కరించబడవు. కనుక నేటి జంటలు దీన్ని అర్థం చేసుకొని నడుచుకోవాలి.
– వై వరలక్ష్మి, 9948794051

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad