Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలువన్‌ పర్సన్‌... వన్‌ పార్టీ ఎలక్షన్‌

వన్‌ పర్సన్‌… వన్‌ పార్టీ ఎలక్షన్‌

- Advertisement -

ఇదే బీజేపీ విధానం
ఓట్ల తొలగింపు దేశానికే ప్రమాదం
బీహార్‌లో నాలుగు నెలల్లో కోటి ఓట్ల నమోదు ఎలా సాధ్యం?
ప్రజాస్వామ్య పరిరక్షణకు లౌకికశక్తులంతా కలిసి రావాలి
ఈసీని బీజేపీలో భాగస్వామ్యం చేసుకున్నారు
కమ్యూనిస్టుల సిద్ధాంతాన్ని అందరికీ అర్థమయ్యేలా చేస్తాం
సురవరంనకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు ఇస్తాం : సంస్మరణ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
గొప్ప ప్రజాస్వామికవాది : బీవీ రాఘవులు
ఆయన జీవితం అందరికీ ఆదర్శం : డి రాజా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ కాదనీ, వన్‌ పర్సన్‌ వన్‌ పార్టీ ఎలక్షన్‌ అనీ, ఇదే బీజేపీ విధానమని ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డిని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే నిలబెట్టామని చెప్పారు. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సురవరం సుధాకర్‌రెడ్డి లాంటివారు ఎంతో అవసరమని అన్నారు. సీపీఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభ శనివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగింది. ఈ సందర్భంగా సురవరం చిత్రపటానికి సీఎం రేవంత్‌రెడ్డి సహా పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, జస్టిస్‌ ఎన్వీ రమణ, టీపీసీసీ అధ్యక్షులు బి మహేష్‌కుమార్‌గౌడ్‌, బీఆర్‌ఎస్‌ నేతలు బోయినపల్లి వినోద్‌కుమార్‌, వి శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, ఎంపీ ఈటల రాజేందర్‌, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, మందుల సామేలు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌, టీజేఎస్‌ అధ్యక్షులు కోదండరామ్‌, ప్రొఫెసర్‌ హరగోపాల్‌, కాశీం, సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నేత బి ప్రదీప్‌, ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్‌ ఓంకార్‌, ఆరెస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, ఎస్‌యూసీఐ(సీ) రాష్ట్ర కార్యదర్శి మురహరి, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌రాజా, సీపీఐ(ఎంఎల్‌) రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న, సీపీఐ ఏపీ కార్యదర్శి కె రామకృష్ణ, సురవరం సతీమణి బివి విజయలక్ష్మి తదితరులు ప్రసంగించారు.

కలిసికట్టుగా పోరాడాలి : రేవంత్‌రెడ్డి
ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో పాలకుల విపరీతమైన పోకడలను కట్టడి చేసేందుకు, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు, భావసారూప్యత కలిగిన వారంతా కలిసి కట్టుగా పోరాడాల్సిన అవసరముందన్నారు. ప్రజాస్వామ్య మూల సిద్ధాంతానికి విరుద్ధంగా కేంద్రంలో పాలన సాగుతోందన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను హరించే ప్రమాదకర పరిస్థితులున్నాయని చెప్పారు. ఈ పరిస్థితులను నిలువరించేందుకు ఐక్య కార్యాచరణను నిర్మించాలని అన్నారు. అప్పుడే సురవరం లాంటి నేతకు ఘనమైన నివాళి అని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) బీజేపీ అనుబంధ సంఘంగా మారిందని ఆక్షేపించారు. సీఈసీని అడ్డం పెట్టుకొని కేంద్రంలో అధికారాన్ని పదిలం చేసుకునేందుకు కుట్రలు జరుగుతున్నా యని అన్నారు. బీహార్‌లో 65 లక్షల ఓట్లను తొలగించడం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమనీ, అదే సమయంలో కేవలం నాలుగు నెలల్లో అక్కడ కోటి ఓట్లను ఎలా నమోదు చేశారని ప్రశ్నించారు. ఒకవేళ అంతమంది పుట్టినా వారికి ఓటు హక్కు రావడం సాధ్యమా?అని అడిగారు. ఓట్‌ చోరీకి వ్యతిరేకంగా రాహుల్‌ గాంధీ పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. ఎన్నికలు వస్తున్నాయంటే ఈడీ, సీబీఐ, ఐటీవంటి సంస్థలను రంగంలోకి దించుతున్నారని చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న ఆలోచన చేసే వారి నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనీ, లౌకికశక్తులన్నీ ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని కోరారు. సమాజంలో చైతన్యాన్ని పెంచేందుకు నిరంతరం శ్రమించిన కమ్యూనిస్టు యోధుడు సురవరం సుధాకర్‌రెడ్డి అని అన్నారు. విద్యార్థి రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వరకు ఎంత ఎత్తుకు ఎదిగినా ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని వీడలేదన్నారు. ఏ జెండాను మోయడం గొప్పగా భావించారో చివరి శ్వాస వరకు ఆ జెండా నీడలోనే ఉండటం చాలా అరుదు అని అన్నారు. మొదటి తరంలో సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు మహబూబ్‌ జిల్లాకు వన్నె తెచ్చారనీ, రెండో తరంలో జైపాల్‌ రెడ్డి, సురవరం సుధాకర్‌ రెడ్డి జిల్లాకు వన్నె తెచ్చారని చెప్పారు. సురవరం సుధాకర్‌ రెడ్డికి రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు ఉండే విధంగా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఎర్రజెండా అంటే ప్రజలకు విశ్వాసమనీ, కమ్యూనిస్టు సిద్ధాంతం పరిధి ఇంకా విస్తరించాలన్నారు. కమ్యూనిజం అంటే కేవలం లైబ్రరీలో చదివే పుస్తకం కాదనీ, ప్రజల పక్షాన పోరాడే చైతన్యమని అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్టులు అధికారంలో ఉంటే కొన్ని సమస్యలే పరిష్కరించవచ్చనీ, ప్రతిపక్షంలో ఉంటే ప్రజలకు సంబంధించిన అన్ని సమస్యలనూ పరిష్కరించ వచ్చన్నారు. నిత్యం ప్రతిపక్షంగా ఉంటూ ప్రజల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులేననీ, వారు తలచుకుంటే ప్రభుత్వాలు దిగిపోతాయనేది తాను బలంగా నమ్ముతానని అన్నారు.

రాజ్యాంగంపై కేంద్రం దాడి : డి రాజా
రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల కోసం సురవరం సుధాకర్‌రెఢ్డి నిబద్ధతతో పోరాడారనీ, ఆయన జీవితం నేటితరానికి ఆదర్శం కావాలనీ, రాజకీయ పార్టీలకు ఒక సందేశంగా మారాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంపైనే దాడి చేస్తున్నదని విమర్శించారు. రాజకీయాలకతీతంగా అన్ని సామాజిక రాజకీయ శక్తులు కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు ఉద్యమం కూడా ఐక్యం కావాలన్నారు. ఐక్యత విషయంలో సీపీఐ(ఎం) ఒక్కటే కాకుండా అన్ని వామపక్ష పార్టీలూ ఆత్మపరిశీలన చేసుకోవాలని రాజా కోరారు. సురవరం జ్ఞాపకార్దం రాష్ట్రంలో తగిన స్మారకాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రికి సూచించారు.

కమ్యూనిస్టు పార్టీలు ఐక్యం కావాలి : జస్టిస్‌ ఎన్‌వి రమణ
దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలన్నా, పేద ప్రజలకు న్యాయం చేయాలన్నా ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన నాయకులు, కార్యకర్తల ఆశయం నేరవాలన్నా కమ్యూనిస్టు పార్టీలన్నీ ఐక్యం కావాలని జస్టిస్‌ ఎన్‌వి రమణ ఆకాంక్షించారు. ఆ రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆశిస్తున్నానని చెప్పారు. సురవరం ఎంపీగా, కార్మికశాఖ స్టాడింగ్‌ కమిటీ చైర్మెన్‌గా కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. కమ్యూనిస్టు కార్యకర్త నిజాయితీపరుడనీ, న్యాయం తరుపున నిలబడతాడనీ, పేదల హక్కుల కోసం పోరాడుతాడనే ప్రగాఢమైన విశ్వాసం దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉందన్నారు. దానిని ప్రజాస్వామ్యవాదిగా తాను కూడా నమ్ముతున్నాననీ, కమ్యూనిస్టుల ఐక్యత కావాలని చెప్పారు. అప్పుడే బలమైన ఉద్యమాలను నిర్మించొచ్చని అన్నారు. ఏనాటికైనా ఎర్రకోటపై ఎర్రజెండా ఎగురుతుందంటూ తన తండ్రి చెప్పే వారని గుర్తు చేశారు.

రాజకీయాలు వ్యాపారమయం : దత్తాత్రేయ
రాజకీయాలు వ్యాపారమయం అయ్యాయని మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. నీతి, నిజాయితీ, నైతిక విలువలకు కట్టుబడి పనిచేసిన గొప్ప నేత సురవరం అని ఆయన సేవలను కొనియాడారు. ఆయన ఆస్తులనే ప్రజలకు పంచిపెట్టారని చెప్పారు. సమాజానికి కమ్యూనిస్టుల అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, పశ్య పద్మ, జాతీయ కౌన్సిల్‌ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, కె శ్రీనివాస్‌రెడ్డి రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, ఈటి నర్సింహ్మా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు విఎస్‌ బోస్‌, కలవేణి శంకర్‌, గద్దర్‌ ఫౌండేషన్‌ చైర్మెన్‌ సూర్యం, ప్రజాగాయకులు ఏపూరి సోమన్న తదితరులు పాల్గొన్నారు.

గొప్ప ప్రజాస్వామికవాది : రాఘవులు
సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి గొప్ప ప్రజాస్వామిక వాది అని సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. పార్టీని నడిపిన తీరు, ప్రజలతో మమేకమైన పద్ధతి, ఉద్యమాలను నిర్వహించడంలో ఆయన చెరగని ముద్ర వేశారని అన్నారు. కమ్యూనిస్టు భావజాలా నికి భిన్నంగా ఉండే వారినీ ఆయన ఆకర్షిస్తారని చెప్పారు. విషయం మీద రాజీపడకుండా అందర్నీ కలుపుకునిపోయే వ్యక్తిత్వం ఉందన్నారు. విశాల ప్రజానీకాన్ని, శక్తులను కలుపుకునిపోవడం ఇప్పుడు ఎంతో అవసరమని అన్నారు. అప్పుడే కమ్యూనిస్టు ఉద్యమం ముందుకుపోతుందన్నారు. పార్లమెంటరీ రాజకీయాలతోపాటు సమస్యలపై ఉద్య మాలూ అవసరమేనని చెప్పారు. 2000 సంవత్సరంలో విద్యుత్‌ ఉద్యమం ప్రజలు చేశారని అన్నారు. అందులో సురవరం కీలకపాత్ర పోషించారని అన్నారు. సరళీకరణ విధానాలు విస్ఫోటనంలా అమలు చేయాలని నాటి ప్రభుత్వం భావించిందన్నారు. దాన్ని ఛేదించిన ప్రముఖ ఉద్యమం అదేనని గుర్తు చేశారు. అప్పుడు ఉద్యమం జరగకపోతే ఈరోజు దేశం ఈ పరిస్థితుల్లో ఉండేది కాదని చెప్పారు. ఆ ఉద్యమ ఫలితంగా 2020 వరకు సరళీకరణ విధానాలు సంపూర్ణంగా అమలు కాలేదన్నారు. ఇది తెలుగు ప్రజలకు గర్వకారణమని వివరించారు. మోడీ ప్రభుత్వం రైతాంగ చట్టాలను తెచ్చిందనీ, వాటిని రైతులు ఐక్యంగా పోరాడి వెనక్కి కొట్టారని చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి, హేతువాద భావజాలానికి తీవ్ర ప్రమాదం ఏర్పడిందన్నారు. వాటిని రక్షించుకునేందుకు సమరశీల ఉద్యమాలకు సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఫాసిజాన్ని నివారించింది కమ్యూనిజమని అన్నారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు ధోరణులను వెనక్కి కొట్టాలని పిలుపునిచ్చారు. సురవరం మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి, ఆయన కుటుంబానికి తీరనిలోటని అన్నారు.

కమ్యూనిస్టుల ఐక్యతే సురవరం ఆకాంక్ష : తమ్మినేని
కమ్యూనిస్టులు కలవాలని, పార్టీలు ఐక్యం కావాలనే సురవరం సుధాకర్‌రెడ్డి ఆకాంక్ష త్వరలో నెరవేరాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. కమ్యూనిస్టులకు ఈ దేశంలో భవిష్యత్తు ఉందా? అంటూ విశ్లేషణలు వస్తున్నాయనీ, కమ్యూనిస్టుల్లేకుంటే ఈ దేశానికి భవిష్యత్తు ఉందా? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీకి కాంగ్రెస్‌ రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని అన్నారు. సైద్ధాంతిక ప్రత్యర్థి కమ్యూనిస్టులేనని స్పష్టం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad